Premalu Movie Review: ప్రేమలు మూవీ రివ్యూ

‘పొరుగింటి పుల్లకూర రుచి’ అన్నట్టు మన తెలుగు ప్రేక్షకులకి డబ్బింగ్ సినిమాలంటే మక్కువ ఎక్కువ. పక్క భాషలో ఓ సినిమా హిట్ అయ్యింది అంటే దాని కథ ఎలాంటిది అని పట్టించుకోకుండా ఎగబడి చూసేస్తూ ఉంటారు. ఇటీవల మలయాళంలో ‘ప్రేమలు’ అనే సినిమా రిలీజ్ అయ్యింది. ఇంటర్నెట్లో దీనిని తెగ చూసేసారు ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్. దీంతో రాజమౌళి కొడుకు కార్తికేయ ఈ సినిమాని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. మరి తెలుగు ప్రేక్షకుల్ని ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుందో ఓ లుక్కేద్దాం రండి :

కథ:
సచిన్ సంతోష్ (నాస్లెన్ కె.గపూర్) బి.టెక్ కంప్లీట్ చేసిన విద్యార్థి. చదువుకునే రోజుల్లో అతను ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ.. అప్పటికే ఆ అమ్మాయి ఇంకో వ్యక్తిని ప్రేమిస్తున్నట్టు తెలిపి పెద్ద షాక్ ఇస్తుంది. లవ్ ఫెయిల్యూర్ ఒక పక్క, ఇంట్లో వాళ్ళు పెట్టే ప్రెజర్ ఇంకో పక్క, ఎక్కువవడంతో యూకే కి వెళ్లిపోవాలని అతను నిశ్చయించుకుంటాడు. కానీ అతని బ్యాంక్ ఖాతాలో సరిపడా బ్యాలన్స్ లేక.. వీసా రాదు.దీంతో ఊర్లో అతనికి అవమానాలు ఎదురవుతాయి. ఈ క్రమంలో వాటి నుండి తప్పించుకోవడానికి స్నేహితుడు అమూల్ డేవిస్ (సంగీత్ ప్రతాప్)తో హైదరాబాద్ వెళ్లి గేట్ కోచింగ్లో జాయిన్ అవుతాడు. తర్వాత వాళ్ళు అనుకోకుండా స్నేహితుడి పెళ్ళికి వెళతారు. అక్కడ వారికి రీనూ (మమిత బైజు) అనే సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంజినీర్ పరిచయమవుతుంది. సచిన్.. రీనూని ఇష్టపడతాడు. అది కాస్త ప్రేమగా మారుతుంది. కానీ రీనూకి రెస్పాన్సిబిలిటీ లేని వ్యక్తిని ప్రేమించడానికి ఇష్టపడదు. అది తెలుసుకుని సచిన్ నిరాశకి లోనై తన ప్రేమ విషయం ఆమెకు చెప్పడానికి భయపడతాడు. కానీ ఒకసారి ఆమెకు తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏమైంది? అనేది మిగిలిన కథ

విశ్లేషణ:
చెప్పుకోడానికి కథ పెద్ద ఏమీ ఉండదు. పైన చెప్పుకున్న కథ చూస్తుంటే ఇది రెగ్యులర్ గా, సీరియస్ ఫార్మేట్లో సాగుతుందేమో అనే డౌట్ కొంతమందికి రావచ్చు. ఒరిజినల్ వెర్షన్ చూసిన వాళ్లకి ఇలాంటి డౌట్స్ రావు. కొత్తగా చూసేవాళ్ళకి ఇదే డౌట్ వస్తుంది. కానీ స్క్రీన్ ప్లే విషయంలో మ్యాజిక్ చేశాడు దర్శకుడు గిరీష్ ఎ.డి. ఇందులో పూర్తిగా యూత్ కి ప్రత్యేకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఉండే నిబ్బా బ్యాచ్ కి కనెక్ట్ అయ్యే డైలాగులు చాలా ఉన్నాయి. వన్ లైనర్స్ బాగా పేలాయి. అందుకు ’90’s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ను అభినందించాలి. అతనే తెలుగు వెర్షన్ కి డైలాగులు రాశాడు. ‘కె.పి.హెచ్.బి మెట్రో కింద..’ ‘కుమారి ఆంటీ’ ఇలా ట్రెండింగ్ టాపిక్స్ ను అన్నిటినీ టచ్ చేస్తూ అతను డైలాగ్స్ రాశాడు. అవి అందరికీ హిలేరియస్ గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ బాగానే ఉన్నా.. క్లైమాక్స్ ఎందుకో సిల్లీగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ అన్నీ బాగా కుదిరాయి. అన్నిటికంటే హైలెట్ ఏంటి అంటే.. ఇది డబ్బింగ్ సినిమా అయినప్పటికీ.. ఎక్కువగా హైదరాబాద్ లొకేషన్స్ లో షూటింగ్ జరపడం. అలాగే తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీతో సినిమాని తీయడం.

- Advertisement -

నటీనటుల విషయానికి వస్తే.. నాస్లెన్ కె.గపూర్ లుక్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి. అతని ఫ్రెండ్ గా చేసిన సంగీత్ ప్రతాప్, హీరోయిన్ టీం మేనేజర్ గా చేసిన శ్యామ్ మోహన్..లు చాలా బాగా నటించి నవ్వించారు. హీరోయిన్ మామితా బైజు కూడా చాలా నేచురల్ గా ఉంది. ఆమె లుక్స్ లో ఎక్కడా అసభ్యత కనిపించలేదు. ఆమె ఫ్రెండ్ గా చేసిన అఖిలా భార్గవన్ కూడా ఓకే.

ప్లస్ పాయింట్స్ :

కామెడీ
ఫస్ట్ హాఫ్
మ్యూజిక్
పెర్ఫార్మెన్సెస్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ కథ
క్లైమాక్స్

మొత్తంగా.. ‘ప్రేమలు’ మరో ‘మ్యాడ్’ తరహా యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసే విధంగానే దీనిని రూపొందించారు. ఈ వీకెండ్ కి థియేటర్ కి వెళ్లి కడుపుబ్బా నవ్వుకుని రావాలంటే ఇది మంచి ఆప్షన్ అనే చెప్పాలి.

రేటింగ్ : 2.75/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు