తెలుగులో వారసుడు చిత్రంతో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు నటుడు దళపతి విజయ్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించే వారసుడు పూర్తి కాకముందే ఆయన తన తదుపరి సినిమాలపై కోలీవుడ్ మీడియా పలు కథనాలను వెల్లడించింది. వాటిపై మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన రాలేదు.
ఇదిలా ఉండగానే విజయ్ కొత్త సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటికొచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ 100వ చిత్రంలో విజయ్ హీరోగా నటించనున్నారట. ఈ విషయాన్ని నిర్మాత ఆర్.బి. చౌదరి తనయుడు, నటుడు జీవా మీడియాకు వెల్లడించారు. తన తండ్రిని విజయ్ కొన్ని రోజుల కిందట కలిశారని, తమ నిర్మాణ సంస్థకు ప్రత్యేకంగా నిలవనున్న 100వ సినిమాలో హీరోగా నటించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు జీవా వెల్లడించారు.
ఈ సినిమాలో నటించే అవకాశం తనకు ఇవ్వాలని, రెమ్యూనరేషన్ తీసుకోనని తన తండ్రికి చెప్పినట్టు వివరించారు. వీరిద్దరూ కలిసి గతంలో స్నేహితుడు సినిమాలో నటించారు. ఈ చిత్రానికి దర్శకుడు ఎవ్వరు..? ఈ సినిమా పట్టాలెక్కుతుందా..? అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి ఉండక తప్పదు. మరోవైపు విజయ్ 66వ చిత్రానికి దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించే ఛాన్స్ ఉండవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.