HBDChiyaanVikram : ఒక్కో సినిమా.. ఒక్కో మెట్టు.. విలక్షణత కి మరో పేరు..

HBDChiyaanVikram : చిత్ర పరిశ్రమ లో ఎంతో నటనా ప్రతిభ కలిగిన నటులు ఎంతో మంది ఉన్నారు. కానీ దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో తెలిసిన వాళ్ళు కొంత మంది మాత్రమే ఉంటారు. అందులోనూ నటన కోసం ఎంతటి కష్టమైన పడే వాళ్ళు కొంతమందే ఉంటారు. అలాంటి అరుదైన నటుల్లో ఒకరు ‘చియాన్ విక్రమ్’. ఈయన పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. ఒక్క తమిళ్ లోనే కాదు, తెలుగు, మలయాళం హిందీలో కూడా ఎన్నో సినిమాల్లో నటిస్తూ సినీ అభిమానుల్ని మెప్పిస్తున్నాడు. ఒక పాత్ర నచ్చిందంటే చాలు ఆ పాత్ర కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాడు. అయితే విక్రమ్ సినిమా ఇండస్ట్రీ లో గుర్తింపు కోసం పడిన కష్ఠాలు కూడా అంతా ఇంతా కాదు. తమిళనాడు లో రామనాథపురం నుండి నటనపై ఆసక్తి తో ఇండస్ట్రీ కి వచ్చిన విక్రమ్ సినిమాల్లో అవకాశం కోసం చాలా ట్రై చేసాడు. అయితే కెరీర్ బిగినింగ్ లో విక్రమ్ తెలుగులోనే ఎక్కువగా గుర్తింపు పొందాడు . అలా తెలుగులో మొదటి సినిమా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన అక్క పెత్తనం చెల్లెలి కాపురం. దాంతో పాటు బంగారు కుటుంబంలో అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించగా, సౌందర్యంతో 9 నెలలు సినిమాలో నటించాడు. అలా తెలుగు, తమిళ్ సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ సాగుతుండగా, అజిత్ తో చేసిన ఉల్లాసం సినిమాలో సెకండ్ లీడ్ గా మంచి బ్రేక్ వచ్చింది.

సేతుతో అసలైన కెరీర్ మొదలు..

అయితే విక్రమ్ అప్పటివరకు చేసిన సినిమాలు పక్కనేడితే, బాల తో చేసిన ‘సేతు’ సినిమా తో కెరీర్ మొత్తం మారిపోయిందని చెప్పొచ్చు. ఈ సినిమాలో ప్రేమ కోసం తపించిన భగ్న ప్రేమికుడిగా, మతి స్థిమితం కోల్పోయిన వాడిగా విక్రమ్ నటన అత్యద్భుతం అని చెప్పాలి. ఈ సినిమా ఆ రోజుల్లో ఏకంగా 6 భాషల్లో రీమేక్ అయింది. కానీ ఏ ఒక్కరూ విక్రమ్ నటనని మ్యాచ్ చేయలేదు. ఈ చిత్రం తో వచ్చిన క్రేజ్ తో విక్రమ్ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. అయితే ఆ తర్వాత దీన్ని మించిన సినిమా మళ్ళీ బాలా తోనే తీసాడు విక్రమ్. అదే శివపుత్రుడు. ఊరికి దూరంగా స్మశానం లో పెరిగిన యువకుడు, గతిలేక సమాజంలోకి వచ్చినపుడు సరైన ఆదరణ లేక కృశించిపోయిన యువకుడి కథ ఇది. అతడ్ని ఆదరించిన శక్తితో అనుబంధం ఎలాంటిదో ఈ సినిమాలో చూడొచ్చు. విక్రమ్ నటన ఈ చిత్రంలో అనితర సాధ్యం అని చెప్పొచ్చు. ఈ చిత్రంలో నటనకు గాను విక్రమ్ ఏకంగా నేషనల్ అవార్డు ని సొంతం చేసుకోవడం విశేషం.

పాన్ ఇండియా స్టార్ గా సంచలనం..

అయితే విక్రమ్(HBDChiyaanVikram) పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది శంకర్ తో చేసిన అపరిచితుడు సినిమాతో. అంతకు ముందు విక్రమ్ సమురాయ్, జెమినీ, సామి సినిమాలతో కమర్షియల్ గా మంచి హిట్లు కొట్టి స్టార్ హీరోగా ఎదిగాడు. తెలుగులో కూడా అప్పటికే మంచి గుర్తింపు పొందాడు. శంకర్ షణ్ముగం తో చేసిన అపరిచితుడు ఆయన స్టార్ డమ్ ని జాతీయ వ్యాప్తం చేసింది. ఈ చిత్రంలో రామాగా, అపరిచితుడిగా రెండు పాత్రల్లో అత్యద్భుతంగా నటించాడని చెప్పాలి. కమల్ హాసన్ తర్వాత తమిళ్ లో ఆ రేంజ్ లో నటన లో వేరియేషన్స్ చూపించిన హీరోగా విక్రమ్ పేరు సంపాదించారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈ చిత్రం తర్వాత విక్రమ్ నటించిన ప్రతి సినిమా కూడా ఎదో ఒక ప్రత్యేకతని సంతరించుకుంది. విక్రమ్ తన ప్రతి సినిమాలోనూ విలక్షణతో కూడిన నటనతో ఆకట్టుకునే వారు. విలన్, నాన్న, ఐ , ఇరు ముగన్, రీసెంట్ గా కోబ్రా, పొన్నియిన్ సెల్వన్ విలక్షణమైన నటనతో ఆకట్టుకున్నారు. ఇన్ని సినిమాలు చేసినా ఏదో ఒక వెలితి ఉంటుందని, ఇంకేదో ప్రత్యేకంగా చేయాలి అని విక్రమ్ అంటూనే ఉంటారు. ఇక ఈరోజు (ఏప్రిల్ 17) పుట్టిన రోజు ఈ సందర్బంగా filmify తరపున ఆయనకీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ, మరిన్ని మంచి సినిమాలతో ప్రేక్షకులని అలరించాలని కోరుకుంటున్నాం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు