Megastar’s BholaaShankar: ‘భోళా’ బోల్తా కొట్టడానికి మెగాస్టారే కారణం…?

Megastar’s BholaaShankar

మొత్తానికి అనుకున్నదే అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ), మెహర్ రమేష్ కాంబినేషన్లో వచ్చిన భోళాశంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఈ సినిమా అనౌన్స్ చేసిన నాడు మెగాఫ్యాన్స్ మనసుల్లో పడ్డ అనుమానపు భీజం ఈ రోజు సిల్వర్ స్క్రీన్ పై నీరసం, నిరుత్సాహన్ని మొలకెత్తేలా చేసింది. ‘అసలే కోతి…ఆపై కల్లు తాగెను’ అన్న చందంగా అసలే రొటీన్ రొట్ట మసాలా కథతో వచ్చిన తమిళ సినిమాకి రీమేక్ ఆపై డిజాస్టర్ ట్రాక్ తో మెగా ఫోన్ కి పదేళ్లు దూరంగా ఉన్న దర్శక మహానుభావుడు వెరసి నార్మల్ ఆడియెన్స్ తో మాత్రమే కాకుండా డై హార్డ్ మెగా ఫ్యాన్స్ మెదళ్లతో సైతం ఫుట్ బాల్ ఆడేసుకుంది భోళాశంకర్ సినిమా.

మూస కథలతో గతంలో చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఇంతటి ఔట్ డేటెడ్ టేకింగ్ తో వచ్చి డిజాస్టర్ అవ్వటం చాలా అరుదనే చెప్పాలి. టైర్ 2 హీరోలు సైతం ఛాన్స్ ఇవ్వాలంటే భయపడే పరిస్థితిలో ఉన్న మెహర్ రమేష్ కి మహావిష్ణువు లాంటి మెగాస్టార్ పిలిచి మరీ పునర్జన్మ లాంటి ఛాన్స్ ఇచ్చినప్పటికీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మాట దేవుడెరుగు, ఎన్ని రకాలుగా దుర్వినియోగం చేయాలో రీసర్చ్ చేసి మరీ ఈ సినిమా చేసాడు మెహర్ మామ. రొటీన్ మాస్ మసాలా కథను ఔట్ డేట్ అయిపోయిన క్రింజ్ కంటెంట్ తో నింపేసి పదేళ్ల కాలం కిందట ఆగిపోయిన బుర్రతో డైరెక్షన్ చేసాడు మెహర్ రమేష్.

ఏది ఏమైనా, దర్శకుడ్ని అనటం కంటే ముందు, ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు చిరంజీవిని అనాలి. ఆయనే గనక ఈ కథకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయి ఉంటే ఈ రోజు మెగాఫ్యాన్స్ కి ఆచార్య లాంటి మరో నైట్ మేర్ దాపురించి ఉండేది కాదు. సినిమా వరకూ చిరంజీవి తనవైపు నుండి పూర్తి న్యాయం చేసినప్పటికీ, ఆల్రెడీ మనోళ్లు ఎన్నోసార్లు వాడి ట్రాష్ ఫోల్డర్ లో పెట్టేసిన కథతో చేసిన సినిమా కోసం ఎంత కష్టపడ్డా కూడా అది బూడిదలో పోసిన పన్నీరు లాగా, అడవి కాచిన వెన్నెల లాగా, బంగారపు హుండీని చిల్లర వేయటానికి వాడినట్లు అవుతుంది. మొన్నటిదాకా టాలీవుడ్ ని మకుటం లేని మహారాజులాగా ఏలిన మెగాస్టార్ తొమ్మిదేళ్ల గ్యాప్ ఇచ్చి రీఎంట్రీ ఇచ్చాక ఈ తరానికి తాను మెగాస్టార్ ని అని పరిచయం చేసుకోవాలన్న తాపత్రయం రీఎంట్రీ తర్వాత వచ్చిన ప్రతి సినిమాలో కనిపిస్తోంది.

- Advertisement -

చిరంజీవి మెగాస్టార్ అన్నది ఈ తరానికి తెలియాలంటే, తన పాత సినిమాలు చూస్తే సరిపోతుంది కానీ, ఆ కాలం నాటి కథలతో సినిమాలు చేసి అప్పటి మ్యానరిజమ్స్ తో మ్యాజిక్ క్రియేట్ చేయాలనుకోవడం చిరంజీవి చేస్తున్న కాస్ట్లీ మిస్టేక్. మెగాస్టార్ వయసు గురించి పక్కన పెడితే, తనకున్న స్టేచర్ కి, ఇమేజ్ కి భోళాశంకర్ సినిమాలో శ్రీముఖి, రష్మీలతో రొమాన్స్ చేయటం చూస్తుంటే, కాన్పు కాని నిండు గర్భం కన్నా ఎక్కువ మోయలేని భారం మోసినంత నొప్పి కలిగింది మెగా ఫ్యాన్స్ కి. ఒకప్పుడు తన సినిమాలకు రాత్రంతా జాగారం చేసి మరీ క్యూ లైన్లో నిలబడి చొక్కాలు చంచుకున్నా కూడా టికెట్ దొరకని మెగాస్టార్ సినిమాకి ఈరోజు ఇలాంటి పరిస్థితి తలెత్తడం విచారకరం. మరి, చుట్టూ ఆహా ఓహో అంటూ తాళం వేసే భజన బృందంతో రాను రాను రియాలిటీకి దూరమైపోతున్న మెగాస్టార్ ఇప్పటికైనా అభిమానుల ఆర్తనాదాలు విని కళ్ళు తెరుస్తాడా లేదా చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు