BholaShankar: భజన బ్యాచ్ ఎఫెక్ట్ రియాలిటీలోనే కాదు, రీల్ లో కూడా డ్యామేజ్ చేస్తుంది..!

BholaShankar

ఎంతటి మృగరాజు అయినప్పటికీ పొగడ్తలకు పొంగిపోవటం అలవాటైతే, భజన బృందం చేసే భజనతో సింహం కూడా కళ్ళు మూసుకుపోయి పుట్టుకతో వచ్చిన వేటాడే గుణాన్ని కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పరిస్థితి కూడా ఇంచు మించు ఇలాగే తయారయ్యిందని చెప్పచ్చు. ఆడియో ఫంక్షన్స్ లో డైరెక్టర్స్ స్టార్ హీరోలను ఆకాశానికి ఎత్తటంతో మొదలైన ఈ భజన పైత్యం ఇప్పుడు ప్రొడ్యూసర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ సహా సినిమా యూనిట్ మొత్తానికి పాకింది. ఒక లిమిట్ వరకూ ఉంటే భజన కూడా కంటికి ఇంపుగా, శ్రవణానంద కరంగా ఉంటుంది. అదే గనక శృతి మించితే భోళాశంకర్ సినిమా లాగా తయారవుతుంది.

రొటీన్ మాస్ మసాలా కథతో వచ్చిన సినిమాకి రీమేక్ కావటంతో సినిమాకు మొదటి నుండి నామమాత్రపు బజ్ కూడా క్రియేట్ కాలేదు. ఇక సినిమా మొత్తం భజన బ్యాచ్ చేసే ఔట్ డేటెడ్, విసిగించే కామెడీతో ఉండటం వల్ల ఓవర్సీస్ లో పడ్డ ప్రీమియర్స్ షోస్ తోనే డిజాస్టర్ టాక్ మూట కట్టుకుంది భోళా శంకర్ సినిమా. సినిమా మొత్తానికి ఏదైనా పాజిటివ్ ఎలిమెంట్ ఉంది అంటే, అది కేవలం మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ లో గ్రేస్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ లకి మహతి స్వరసాగర్ ఇచ్చిన బీజీఎమ్ అని చెప్పాలి. నిజానికి కథలో మినిమమ్ కంటెంట్ ఉన్నా కూడా సినిమాకి అవి ప్లస్ అయ్యి కనీసం యావరేజ్ గా అయినా మిగిలేది. నాసిరకం కథతో, అంతకంటే నాసిరకం టేకింగ్ తో సినిమా చేస్తే ఎంతటి మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ అయినా హెల్ప్ అవ్వదని ఈ సినిమా ద్వారా ప్రూవ్ అయ్యింది.

నిజానికి చిరంజీవికి కథల ఎంపికలో మంచి జడ్జిమెంట్ ఉందనేది అందరికీ తెలిసిన సత్యమే. గతంలో పలు సినిమాల్లో ఒకటి, రెండు ఇంపార్టెంట్ సీన్స్ షూటింగ్ సమయంలో డైరెక్టర్ అందుబాటులో లేని సమయంలో ఆర్టిస్ట్ ల డేట్స్ వేస్ట్ అయ్యి నిర్మాతపై భారం పడటాన్ని దృష్టిలో పెట్టుకొని స్వయంగా చిరంజీవే ఆ సీన్స్ ని డైరెక్ట్ చేయటం, వాటికి మంచి అప్లాజ్ రావటం కూడా జరిగింది. అలాంటి చిరంజీవి ఇప్పుడు ఇలాంటి రొటీన్ రొట్ట కథతో సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే ముమ్మాటికీ అది భజన బృందం ప్రభావమే అని చెప్పాలి. డైరెక్టర్ మొదలు కొని, సినిమాలో కమెడియన్స్ గా కనిపించిన జబర్దస్త్ బ్యాచ్ అంతా కూడా భజన బ్యాచ్ కావటంతో మెగాస్టార్ కళ్ళు ఈ సినిమా విషయంలో రియాలిటీని చూడలేకపోయాయి.

- Advertisement -

ఒక సినిమా ఫ్లాప్ అయితే, ఆ రిజల్ట్ హీరో వరకూ చేరటానికి నెలరోజులకు పైగానే సమయం పడుతుందని ఒక సినిమాలో సెటైరికల్ సీన్ ఉంటుంది. ఇప్పుడు మెగాస్టార్, సహా ఇతర స్టార్ హీరోల చుట్టూ చేరుతున్న భజన బ్యాచ్ ని చూస్తుంటే ఆ సీన్ గుర్తుకు వస్తుంది. ఆ రకంగా  ‘మొహమాటానికి పోయి విధవరాలు గర్భవతి అయ్యింది’ అన్నట్టు మొదట్లో ఇష్టం లేకపోయినా వేదాళం సినిమా ఓటీటీలో రాలేదని ప్రొడ్యూసర్ సహా భజన బ్యాచ్ కన్విన్స్ చేస్తే రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా ఈ సినిమా చేసి అటు విమర్శలు, ఇటు నష్టం మూట కట్టుకున్నాడు చిరంజీవి. ప్రస్తుతం RRR లాంటి సినిమాలతో టాలీవుడ్ ఖ్యాతి ఖండాంతరాలు దాటి వ్యాపిస్తున్న తరుణంలో మెగాస్టార్ లాంటి వర్సటైల్ యాక్టర్ భజన చేసే భజనకు బలైపోవటం కడు దుర్లభం.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు