శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా గౌరీ రోనంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెళ్ళిసందD’. గతేడాది దసరా కానుకగా అక్టోబర్ 15న రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను మూటకట్టుకున్నప్పటికీ, ఎవ్వరూ ఊహించని విధంగా మంచి కలెక్షన్లు రాబట్టి హిట్ సినిమాగా నిలిచింది. పోటీగా అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం ఉన్నప్పటికీ, ఈ చిత్రం మాస్ సెంటర్స్ లో ఆ చిత్రాన్ని మించి కలెక్ట్ చేయడం, ట్రేడ్ పండితులకు సైతం షాకిచ్చింది. అదంతా ‘పెళ్ళి సందడి’ చిత్రం పై ఉన్న క్రేజ్ కొంతైతే మరికొంత కీరవాణి సంగీతం, శ్రీలీల గ్లామర్ వల్ల అని చెప్పాలి.
నిజానికి కె.రాఘవేంద్ర రావు ఈ చిత్రాన్ని ఓటీటీలో నేరుగా విడుదల చేయాలని అనుకున్నారు. ఈ దర్శకేంద్రుడి పర్యవేక్షణలోనే ఈ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల థియేట్రికల్ రిలీజ్ కు ఇంట్రెస్ట్ చూపారు. రాఘవేంద్ర రావు ఎందుకు ఆ డేరింగ్ స్టెప్ తీసుకున్నారో తెలీదు. కానీ, సినిమా మాత్రం కమర్షియల్ హిట్ అందుకుంది. అయితే డిజిటల్ రిలీజ్ విషయంలో చాలా లేట్ అయ్యింది. ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగకపోవడంతో డిజిటల్ రిలీజ్ కు ఆలస్యం అయినట్టు వినికిడి. ఎట్టకేలకు జీ5 సంస్థ ఈ చిత్రం డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ రేటు చెల్లించి దక్కించుకుంది. జూన్ 24 నుండి ఈ మూవీ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.