25YearsFor Iddaru Mitrulu : పాతికేళ్ల ‘ఇద్దరు మిత్రులు’.. చిరు, మణి మ్యూజికల్ హ్యాట్రిక్ సెన్సేషన్…

25YearsFor Iddaru Mitrulu : టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాలకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా 90స్ లో చిరంజీవి చిత్రాలు కమర్షియల్ గా ఒక్కోసారి అంతగా లేకపోయినా, చిరంజీవి ఫ్యాన్ బేస్ తో గట్టెక్కిన చిత్రాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇక ఆ రోజుల్లో సంగీతానికి దర్శకులు పెద్ద పీట వేసేవారు. దానికి చిరు కూడా దాసోహమే. ఇక చిరంజీవి చిత్రాల్లో మ్యూజికల్ హిట్స్ అంటే చెప్పుకునే చిత్రాల్లో ఒకటి “ఇద్దరు మిత్రులు”. ఆ రోజుల్లో మ్యూజికల్ గా సెన్సేషన్ సృష్టించిన ఇద్దరు మిత్రులు చాలా మందికి ఓ మామూలు కమర్షియల్ చిత్రం కావచ్చు. కాని ఒక ఫ్రెండ్షిప్ నేపథ్యంలో వచ్చిన ఒక గొప్ప చిత్రం ఈ సినిమా అని భావించాలి. అయితే మీరనుకోవచ్చు. ఫ్రెండ్షిప్ నేపథ్యంలో అంతకంటే గొప్ప చిత్రాలు ఆరోజుల్లోనే చాలా వచ్చాయి అని. కానీ ఒక అమ్మాయి, అబ్బాయి ఫ్రెండ్షిప్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలు అప్పట్లో అంతగా లేవనే చెప్పాలి. ఈ సినిమా వచ్చాకే నువ్వే కావాలి, వసంతం లాంటి చిత్రాలు ఊపందుకున్నాయి. ఇక ఈ మ్యూజికల్ హిట్ (25YearsFor Iddaru Mitrulu) విడుదలై నేటికీ(april 30) 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా అప్పటి చిత్ర విశేషాలపై ఓ లుక్కేద్దాం..

స్వచ్ఛమైన స్నేహానికి ప్రతీక గా ఇద్దరు మిత్రులు..

ఈ సినిమా లో బంగారం తెచ్చి.. అనే ఓ పాటలో ఒక లైన్ ఉంటుంది.. “మాతృత్వానికి మగరూపానివై, నాన్నతనంలో కణ్వుడివై, అన్నగుణంలో కృష్ణుడివై, బతుకంతా జతగా నిలిచే విధిలో పతినే మించిన తోడువై, బంధుత్వాలకి అందని బంధం ఉందని చూపిన నేస్తమా… అని సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఆ పంక్తులలోనే సినిమా కథ నేపథ్యం మొత్తం ఉంటుంది. ఓ అమ్మాయి, ఓ అబ్బాయి మ‌ధ్య ఉండే స్వ‌చ్ఛ‌మైన స్నేహాన్ని దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు తన దర్శకత్వంలో నేటి ట్రెండ్ కి తగ్గట్టు యూత్ మెచ్చేలా చూపించాడు. ఇక నిజ‌జీవితంలోనూ స్నేహానికి అధిక ప్రాధాన్య‌మిచ్చే మెగాస్టార్ చిరంజీవి, 1999లో రెండు చిత్రాల్లో న‌టించ‌గా, ఆ రెండూ కూడా స్నేహం నేపథ్యంలో తెరకెక్కడం విశేషం. అందులో ఒక‌టి.. స్నేహం కోసం కాగా, మ‌రొక‌టి ఇద్ద‌రు మిత్రులు. ఇక మొదటి చిత్రంలో చిరంజీవి తన నటనతో కన్నీళ్లు తెప్పిస్తే… రెండో చిత్రంలో ఆలోచింపచేసారు.ఇద్ద‌రు మిత్రులు ఆడ‌, మ‌గ మ‌ధ్య ఉండే స్వ‌చ్ఛ‌మైన స్నేహానికి ప్ర‌తీక‌లా రూపొందింది.

ఆ రోజుల్లో చిరంజీవి విషయంలో ఈ సబ్జెక్ట్ సాహసమే..

అయితే ఇద్దరు మిత్రులు సినిమా ఇప్పుడు చూసినా చాలా మంది ఆడియన్స్ కి మాస్ హీరోగా నంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌లో చిరంజీవి ఇలాంటి చిన్న స‌బ్జెక్ట్‌ తో సినిమా చేయ‌డానికి ఒప్పుకోవ‌డ‌మంటే ఆ రోజుల్లో పెద్ద‌ సాహ‌స‌మే అని చెప్పాలి. ఎందుకంటే చిరు వరుసగా హిట్ల‌ర్‌, మాస్ట‌ర్‌, బావ‌గారూ బాగున్నారా!, చూడాల‌ని వుంది వంటి వ‌రుస బ్లాక్ బస్టర్లతో కెరీర్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్న‌ప్పుడు, ఈ కథని రాఘవేంద్రరావు చెప్పడంతో ఒకే చేసారు. ఇక ఈ కథలో చిరుకి స్నేహితురాలిగా అప్పటికే గ్లామ‌ర్ కి కేరాఫ్ గా ఉన్న సాక్షి శివానంద్ న‌టించ‌డం మరో హైలెట్. రమ్యకృష్ణ చిరుకి జోడిగా నటించింది. ఇక పాట‌ల ప‌రంగా ఆ రోజుల్లో ఇద్దరు మిత్రులు సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పాలి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ రేంజ్ లో పెర్‌ఫార్మ్ చేయ‌క‌పోయినా, ఓ మోస్తరుగా మెప్పించి చిరు మ్యూజికల్ హిట్స్ లో ఒకటిగా నిల్చింది. ఇక మ్యూజికల్ సెన్సేషన్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ చిరు కాంబోలో అప్పటికే చూడాలని ఉంది, బావగారు బాగున్నారా! చిత్రాలు బ్లాక్ బస్టర్ కాగా ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు