The goat life : తెలుగు ప్రేక్షకుల టేస్ట్ మలయాళీ హీరోలకు ఇప్పటికైనా అర్థమైందా?

The goat life : ఇండియా లో అన్ని భాషల సినిమాలని ఆదరించే ఆడియన్స్ ఒక్క తెలుగు ప్రేక్షకులే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ్, కన్నడ, మలయాళం తో పాటు హిందీ సినిమాలని కూడా కంటెంట్ బాగుంటే చాలు ఎగబడి వెళ్లిపోతామని తెలుగు ఆడియన్స్ నిరూపించారు. అలాగని ప్రత్యేకమైన సినిమాలని చెప్పి ఎలాంటి సినిమాలైనా తెలుగులో ఆడేస్తాయి అని అనుకుంటే ఆ సినిమాల మేకర్స్ పప్పులో కాలేసినట్టే. ఇక నిజానికి టాలీవుడ్ లో అన్ని జోనర్ల సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ అందులో ప్రేక్షకులు కోరుకునేది ఏదైనా ఒకటి ఉండాలి. అయితే తెలుగులో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ సినిమాలకి జనాలు ముందు ప్రాధాన్యత ఇస్తారు. అలాగని ఎదో డాక్యూమెంటరీలు చూపించినట్టు కొన్ని సినిమాలు రిలీజ్ చేస్తే, ప్రేక్షకులు చూడకపోతే అది ఎవరి తప్పో సినీ నిర్మాతలు గ్రహించాలి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆడు జీవితం తో మరోసారి అది నిరూపితమైంది.

తెలుగు జనాల టేస్ట్ అర్ధం చేసుకోండి?

రీసెంట్ గా మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఆడు జీవితం ‘ది గోట్ లైఫ్’ సినిమాకు కు విమర్శకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. జాతీయ అవార్డు ఖాయమని జోస్యం చెబుతున్నారు. పైగా కేరళతో పాటు ఓవర్సీస్ మలయాళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికే 70 కోట్ల మార్క్ ని అందుకున్న సినిమాకు వంద కోట్ల గ్రాస్ ఖాయమని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ది గోట్ లైఫ్ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. టిల్లు స్క్వేర్ ప్రభంజనం వల్ల ఎవరూ పట్టించుకోలేదనే స్టేట్ మెంట్ కొందరు ఇవ్వచ్చు కానీ, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా సరే దానికి ఎదురుగా ఇంకో మంచి కంటెంట్ ఉన్న సినిమా ఉంటే ఆడియన్స్ ఆదరిస్తారు. అందులో డౌట్ లేదు. మొన్నామధ్య టాలీవుడ్ లో గామి సినిమాకు పోటీగా రిలీజ్ అయిన మలయాళం సినిమా ప్రేమలు లాంగ్ రన్ లో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ప్రమోషన్ లో పృత్వి రాజ్ కష్టం..

అయితే ది గోట్ లైఫ్(The goat life) సినిమా కోసం పృథ్విరాజ్ హైదరాబాద్ వచ్చి మరీ ప్రమోషన్లు చేసుకున్నప్పటికీ జనాలకు రీచ్ కాలేదు. దానికి కారణాలు కూడా లేకపోలేదు. మొదటిది మూడు గంటలు సాగే సుదీర్ఘమైన ఎమోషనల్ డ్రామాలు తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కావు. అలవాటు కూడా లేదు. తమిళ్ లో హిట్టైన 96 సినిమాని తెలుగులో జాను గా రీమేక్ చేస్తే ఎలాంటి రిజల్ట్ వచ్చిందో తెలిసిందేగా. ది గోట్ లైఫ్ సినిమాకు ఇదే జరిగింది. ఎదో కష్టాలు మర్చిపోయి కాసేపు ఎంజాయ్ చేద్దామని థియేటర్ కు వస్తే గల్ఫ్ దేశంలో మనిషి పడే నరకయాతనని అంతసేపు చూసేందుకు తెలుగు జనాలు ఇష్టపడలేదు.పెర్ఫార్మన్స్ పరంగా పృత్వి రాజ్ కట్టిపడేసిన మాట వాస్తవమే కానీ మన జనాలకు కనెక్ట్ అయ్యేలా డ్రామా, ఎమోషన్లు లేకపోవడం మైనసయ్యింది. పైగా మ్యూజికల్ గానూ పాటలు పెద్దగా వినేలా అనిపించలేదు. అయితే ఇదే కంటెంట్ కేరళవాసులకు కనెక్ట్ అవ్వడంలో ఆశ్చర్యం లేదు. వాళ్లకు స్లో డ్రామాలు అలవాటే.

- Advertisement -

ఫైనల్ గా ఎంటర్టైన్మెంట్.. లేదా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే..

అయితే మొన్నామధ్య మమ్ముట్టి నటించిన భ్రమయుగం మలయాళంలో రికార్డు వసూళ్లు సాధిస్తే తెలుగులో మాత్రం మొదటి వీకెండ్ కే చేతులు ఎత్తేసింది. కానీ అదే టైం లో మలయాళం మూవీ ప్రేమలు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అయింది. దీన్ని బట్టి మలయాళీ హీరోలు టాలీవుడ్ సినీ ప్రియుల తత్వాన్ని అర్థం చేసుకోవాలి. వేగం, భావోద్వేగం, ఎంటర్ టైన్మెంట్, యాక్షన్ వీటిలో ఏ జానర్ తీసుకున్నా కట్టిపడేసే అంశాలు ఉంటే తప్ప ఆదరణ దక్కడం కష్టం. అలాగే కన్నడ సినిమాలు కాంతారా, చార్లీ వంటి సినిమాలు తెలుగులో కూడా ఎంత సక్సెస్ సాధించాయో, మలయాళీ మేకర్స్ ఏది మిస్ అయ్యారో ది గోట్ లైఫ్, భ్రమయుగం ఫలితాలు చూసాకైనా అర్ధం చేసుకోవాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు