Devara : “దేవర” షూటింగ్ లో తీవ్ర గాయాలు… హాస్పిటల్ పాలైన సైఫ్

Devara : బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ తాజాగా “దేవర” సెట్ లో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. మరి ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం “దేవర” మూవీ వాయిదా పడబోతోందా? లేదా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా? ఇంతకీ ప్రస్తుతం సైఫ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అనే వివరాల్లోకి వెళితే…

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర” సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ మూవీ హిట్ కావడంతో, ఇప్పుడు “దేవర” సినిమాపై హైప్ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. కోస్టల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుండగా, ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ గా కీలక పాత్రను పోషిస్తున్నారు. అయితే తాజాగా జరుగుతున్న “దేవర” మూవీ షూటింగ్లో యాక్షన్ సీన్స్ చేస్తుండగా సైఫ్ అలీ ఖాన్ గాయపడినట్లు సమాచారం.

నిజానికి కొన్నాళ్ల క్రితమే ఈ సినిమా షూటింగ్లో సైఫ్ గాయపడ్డాడని, భుజానికి మోకాలికి గాయం అయిందని, తాజాగా మరోసారి యాక్షన్ సీన్స్ చేస్తుండగా అప్పట్లో తగిలిన గాయాలు మళ్లీ తిరగబడ్డాయని, దీంతో సైఫ్ డాక్టర్లను సంప్రదించగా, వాళ్లు సర్జరీ చేయాలని సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన రీసెంట్ గా ముంబై కోకిలా బెన్ ఆస్పత్రిలో చేరినట్టు “దేవర” టీం వెల్లడించింది. ఇప్పటికే సైఫ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ “దేవర” టీం ట్వీట్ చేసింది. అయితే సర్జరీపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

- Advertisement -

ఆ ట్వీట్ చూసి ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాక గత రెండు రోజుల నుంచి “దేవర” సినిమా వాయిదా పడుతుందని వార్తలు జోరుగా నడుస్తున్నాయి. ఏప్రిల్ లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉండడంతో, “దేవర” మూవీ రిలీజ్ చేసే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు. తాజాగా ఇప్పుడు మరోసారి సైఫ్ అలీ ఖాన్ కు గాయాలు, సర్జరీ అంటూ “దేవర” మూవీ షూటింగ్ కు బ్రేకులు పడడంతో వాయిదా వార్తలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. మరి సైఫ్ అలీ ఖాన్ తిరిగి సెట్ లో ఎప్పుడు అడుగుపెడతాడో? ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో, ముందుగా ప్రకటించిన విధంగా ఏప్రిల్ 5న సినిమాను రిలీజ్ చేస్తారా లేదా? అనే విషయాలు తెలియాలి అంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు