Bollywood Box office: ఆ ముగ్గురు హీరోల వల్ల 300 కోట్లు లాస్

Bollywood Box office: ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు బ్యాడ్ టైం నడుస్తోంది. కరోనా నుంచి ఎంత ప్రయత్నించినా గాని ఒక్క హీరో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేకపోతున్నాడు. పఠాన్, జవాన్ లాంటి సినిమాలతో బాలీవుడ్ కు గత వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు షారుక్. కానీ ఆయన మూడో సినిమా డంకీతో యావరేజ్ గా నిలవడంతో పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా వచ్చిన రెండు సినిమాలతో ముగ్గురు హీరోలు ఏకంగా 300 కోట్ల లాస్ ని మిగిల్చారు బి టౌన్ కి. మరి ఇంతకీ ఆ ముగ్గురు హీరోలు ఎవరు? అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే…

బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన బడే మియా చోటే మియా అనే మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అలాగే అదే టైములో అజయ్ దేవగన్ కూడా మైదాన్ అనే మూవీతో థియేటర్లలో సందడి చేశాడు. కానీ ఈ రెండు సినిమాలు కూడా నిర్మాతలు భారీ నష్టాన్ని చూసేలా చేశాయి.

మైదాన్ తో నిర్మాత జేబుకు భారీ చిల్లు

భారత దిగ్గజ ఫుట్ బాల్ కోచ్ హైదరాబాది లెజెండ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా తెరకెక్కిన హిందీ మూవీ మైదాన్. ఇందులో అజయ్ దేవగన్ హీరోగా నటించగా, ప్రియమణి కీలక పాత్ర పోషించింది. అమిత్ శర్మ ఈ స్పోర్ట్స్ బయోపిక్ కు దర్శకత్వం వహించారు. ఇక మైదాన్ మూవీ ఏప్రిల్ 11న ఈద్ కానుకగా థియేటర్లోకి వచ్చింది. టాక్ పాజిటివ్ గానే ఉన్నప్పటికీ కమర్షియల్ గా మాత్రం ఈ మూవీ హిట్ కాలేదు. మైదాన్ మూవీ 250 కోట్లతో తెరకెక్కగా, ఫస్ట్ వీకెండ్ ఈ మూవీ కేవలం 21 కోట్ల కలెక్షన్లను మాత్రమే సాధించగలిగింది. దీంతో నిర్మాతలకు దాదాపు 150 కోట్ల నష్టం తప్పలేదు.

- Advertisement -

బడే మియా చోటే మియా విషయానికి వస్తే….

కరోనా కంటే ముందు నుంచే హిట్ కోసం విలవిలలాడుతున్న అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో పట్టు వదలనే విక్రమార్కుడిలా బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి బడే మియా చోటే మియా మూవీతో దారుణమైన పరాజయాన్ని చవి చూసాడు అక్షయ్ కుమార్. ఈ మూవీలో అక్షయ్ కుమార్ తో పాటు టైగర్ ష్రాఫ్ కూడా హీరోగా నటించినా హిట్ మాత్రం దక్కలేదు. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటించారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 11న థియేటర్లలోకి వచ్చింది. కానీ అంచనాలను అందుకోలేక ఫస్ట్ వీకెండే బాక్స్ ఆఫీసును గుర్రు పెట్టి నిద్రపోయేలా చేసింది. బడే మియా చోటా మియా మూవీ 350 కోట్లతో తెరకెక్కగా, ఫస్ట్ వీకెండ్ కేవలం 36 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది. దీంతో నిర్మాతలకు దాదాపు 150 కోట్ల భారీ నష్టం తప్పలేదు.

ఇలా మొత్తానికి ఈ ముగ్గురు హీరోలు కలిసి బాలీవుడ్ కు కేవలం వారం రోజుల వ్యవధిలోనే 300 కోట్ల నష్టాలను చవి చూసే దారుణమైన పరిస్థితిని తీసుకొచ్చారు. ఇక త్వరలోనే పలు సౌత్ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్లు బాలీవుడ్ థియేటర్లలోకి దిగితేనే గాని పరిస్థితి చక్కబడేలా కనిపించట్లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు