Ravi Teja Eagle Movie Review & Rating: ఈగల్ మూవీ రివ్యూ – రేటింగ్

About the movie

మాస్ మహారాజ్ రవితేజకి ఈ మధ్య కాలంలో హిట్లు లేవు. ‘క్రాక్’ తర్వాత లాటరీలో వచ్చిన ‘ధమాకా’ బ్లాక్ బస్టర్ తప్ప మిగిలిన అన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా రవితేజ సినిమా అని చెప్పలేం. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన పాన్ ఇండియా సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’ కూడా డిజాస్టర్ గా మిగిలింది. దీంతో ‘ఈగల్’ పైనే చాలా ఆశలు పెట్టుకున్నాడు రవితేజ. నిజానికి సంక్రాంతి కానుకగా జనవరి 13 నే ఈ సినిమా రిలీజ్ కావాలి. కానీ పోటీలో ఎందుకు అని చిత్ర బృందం వెనక్కి తగ్గి.. ఈ రోజు అనగా ఫిబ్రవరి 9న ‘ఈగల్’ ను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించి రవితేజకి సక్సెస్ ను అందించిందా లేదా. అనేది ఇప్పుడు తెలుసుకుందాం…

కథ:
నేషనల్ మీడియా జర్నలిస్ట్ అయిన నలిని(అనుపమ పరమేశ్వరన్) ఓ రోజు మార్కెట్ కి వెళ్లగా ఓ అరుదైన పత్తితో నేసిన క్లాత్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటుంది. అది తలకోనలో దొరికే మాత్రమే పత్తి అని.. దాని గురించి తన న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వేస్తుంది. దాని వల్ల ఈమె చిక్కుల్లో పడుతుంది. ఆ ఒక్క ఆర్టికల్ వల్ల ఈమె పనిచేసే ఆఫీస్ కి ప్రధానమంత్రి నుండి కూడా కాల్ వస్తుంది. సిబిఐ తో పాటు ఐటీ అధికారులు కూడా నళిని పనిచేసే సంస్థపై రైడ్ చేస్తాయి. ఈ క్రమంలో ఆ సంస్థ ఈమె పై సీరియస్ యాక్షన్ తీసుకుని.. ఆమెను జాబ్ నుండి తీసేస్తుంది. దీని వెనుక ఈగల్ హస్తం ఉంది అని తెలుస్తుంది. అయితే తలకోనలో లభించే అరుదైన పత్తి గురించి ఆర్టికల్ రాస్తే ఏకంగా ప్రధాన మంత్రి నుండి ఫోన్ కాల్ రావడం ఏంటి అని.. ఆ రహస్యాన్ని చేధించేందుకు అక్కడికి పయనమవుతుంది నళిని. ఈ క్రమంలో ఆమెకి సహదేవ్ వర్మ(రవితేజ) గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి.? సహదేవే ఈ ఈగలా? అసలు సహదేవ్ గతమేంటి? అతని గురించి పోలీసులు, సి.బి.ఐ అధికారులు మాత్రమే కాకుండా… రా ఆఫీసర్లు కూడా ఎందుకు వెతుకుతున్నారు? అనేది మిగిలిన కథ.

- Advertisement -

విశ్లేషణ:
దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని సంగతి పక్కన పెట్టి.. ముందుగా మనం తెలుగు ఫిలిం మేకర్స్ గురించి మాట్లాడుకోవాలి. టాలీవుడ్లో ఉన్న దర్శకుల పై కె.జి.ఎఫ్ ప్రభావం ఎక్కువగానే ఉంది అని ప్రతి సినిమాతో ప్రూవ్ అవుతూనే ఉంది. ఇప్పుడు ‘ఈగల్’ విషయానికి వద్దాం. దీని విషయంలో కూడా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని చాలా వరకు ‘కె.జి.ఎఫ్’ నే అనుసరించాడు అని చెప్పాలి. మొదటి అరగంట హీరో చుట్టూ ఉండేవాళ్ళు చేసే హడావిడి చూస్తుంటే.. దర్శకుడు అతి ఎలా ఉండబోతుంది అనే విషయం పై క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తంగా ఒకటి, రెండు సీన్లు మాత్రమే చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కడా కూడా ప్రేక్షకులకి ఆసక్తి కలగదు. ఇక సెకండ్ హాఫ్ కి అయితే నిజంగా దండం పెట్టేయొచ్చు.

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడా? ఎప్పుడు సినిమా ముందుకు వెళ్తుందా? అని ప్రేక్షకులు నీరసంతో ఎదురుచూసే పరిస్థితి. అయితే అమ్మవారి విగ్రహం నుండి గన్లు ఓపెన్ అయ్యే సీన్ మాత్రం బాగుంటుంది. ఆ సీన్ అయ్యాక మళ్ళీ ఎండ్ టైటిల్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఈ సినిమాకి దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కంటే కూడా యాక్షన్ కొరియోగ్రాఫర్లు ఎక్కువ పనిచేసారు అని చెప్పాలి. కార్తీక్ ఘట్టమనేని మాత్రం డీవోపీ గా మంచి మార్కులు వేయించుకున్నాడు. దర్శకుడిగా అతనికి ఇది రెండో సినిమా. మొదటి సినిమా నిఖిల్ తో చేసిన ‘సూర్య వెర్సస్ సూర్య’. 2015 లో ఆ సినిమా రిలీజ్ అయ్యింది. 9 ఏళ్ళు అతని డైరెక్షన్లో ఇంకో సినిమా రాలేదు అంటేనే ప్రేక్షకులు అర్ధం చేసుకోవాలి. ‘ఈగల్’ మాత్రం ప్రేక్షకులకి ఆ క్లారిటీ ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి.

ఈ సినిమాకి డైలాగ్స్ మణిబాబు కారణం అందించారు. అతను పేజీలకి పేజీలు డైలాగ్స్ రాసేసాడు. అన్నీ బాగున్నాయి కూడా. కానీ అనవసరమైన ప్రాసలు చిరాకు తెప్పిస్తాయి. అతని తప్పేమీ లేదు. ఆ డైలాగులకి తగ్గ ఎమోషన్ ఈ సినిమాలో లేదు. అందుకే అవి పేలలేదు. నిర్మాతలు మాత్రం ఏమాత్రం ఎమోషనల్ కనెక్ట్ లేని ఈ సినిమాకి కోట్లకు కోట్ల డబ్బుని మంచి నీళ్లలా ఖర్చు పెట్టేశారు. పాపం వాళ్ళకి ఓటీటీ బిజినెస్ కూడా అవ్వలేదు అని నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ ఓపెన్ గానే చెప్పేసారు. సంగీత దర్శకుడు దేవ్ జ్యాండ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంప్రెస్ చేయదు.

నటీనటుల విషయానికి వస్తే… రవితేజ పెర్ఫార్మన్స్ కి పేరు పెట్టనక్కర్లేదు. చాలా మనసు పెట్టి ఈ సినిమా చేసాడు. యాక్షన్ సీన్స్ కోసం బాగా కష్టపడ్డాడు. అతని లుక్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ మాస్ ఆడియన్స్ అతని నుండి ఆశించే ఎలిమెంట్స్ ఇందులో ఉండవు. హీరో కావ్య థాఫర్ గెస్ట్ రోల్ లా వచ్చి వెళ్ళిపోతుంది. గ్లామర్ పరంగా కూడా ఆమెకు స్కోప్ లేని రోల్ ఇది. అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ అనలేం. కథని ముందుకు తీసుకెళ్లే ఓ కీలక పాత్ర పోషించింది. అవసరాల శ్రీనివాస్, మధుబాల, వినయ్ రాయ్, నవదీప్ పెద్దగా చేసింది ఏమీ లేదు. ప్రణీత పట్నాయక్, అజయ్ ఘోష్..ల పాత్రలు బాగానే ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్(కొంతవరకు మాత్రమే)
అమ్మవారి విగ్రహం సీన్
సినిమాటోగ్రఫీ
డైలాగ్స్

మైనస్ పాయింట్స్:
కథ
ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం
ఓవర్ ఎలివేషన్స్

చివరిగా..‘ఈగల్’ ఏ దశలోనూ ఆకట్టుకొని ఓ బోరింగ్ యాక్షన్ సినిమా. టెక్నికల్ గా మంచి మార్కులు వేయించుకున్నా.. ఆసక్తికర కథ, కథనాలు లేకపోవడం వల్ల ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ఈ సినిమాతో రవితేజకి బాక్సాఫీస్ సక్సెస్ దక్కే అవకాశం అయితే లేదు అనే చెప్పాలి.

రేటింగ్…. 1.5/5

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు