Sri Rama Navami Special : రామాయణ గాథతో వచ్చిన అద్భుత చిత్రాలు..

Sri Rama Navami Special: ‘శ్రీ రామ నవమి’.. భారతదేశంలో హిందువులు జరుపుకునే పండుగల్లో ఒకటి. రామ నవమి అనేది రాముడి జన్మదినాన్ని జరుపుకొనే పండుగ కాగా, చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదో రోజున శ్రీరామ నవమి జరుపుకొంటారు. శ్రీరామ భక్తులు చైత్రమాసం శుక్ల పక్ష పాడ్యం నుండి నవమి వరకు రామాయణం పారాయణం చేస్తారు. దేశ వ్యాప్తంగా ఎంతో మంది భక్తులు శ్రీ రాముని పలు విధాలుగా కీర్తిస్తూ, ప్రార్థిస్తూ వాళ్ళ వాళ్ళ సంప్రదాయాల ప్రకారం శ్రీ రామ నవమి జరుపుకుంటారు. ఇక తాతల తరంలో నాటకాల రూపంలో రామచంద్రుని వైభవాన్ని చాటిన పెద్దలు, ఈ తరంలో చిత్ర రాజాల ద్వారా శ్రీరామ చరితాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలా తెలుగు చిత్ర పరిశ్రమలో రామాయణ ఇతిహాస గాథలతో వచ్చిన అద్భుత చిత్రాల్లో ప్రజలు ప్రేక్షకులు మెచ్చిన కొన్ని చిత్రాల గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం..

1. సంపూర్ణ రామాయణం(1972)

1972 లో బాపు దర్శకత్వంలో శోభన్ బాబు, చంద్రకళ సీతారాములుగా నటించిన ఈ చిత్రం అద్భుత ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఆ రోజుల్లో రాముడి పాత్ర అంటే ఎన్టీఆర్ అనే వాళ్ళు. కానీ అంతకు మించిన అభినయంతో శోభన్ బాబు రాముడిగా ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేసారు. ఈ చిత్రంలో రాముడి జననం నుండి కళ్యాణం, అలాగే రవాణ సంహారం చేసి శ్రీరామ పట్టాభిషేకం జరిగే వరకు ఈ కథ ఉంటుంది. చాలా చిత్రాలు కూడా ఇదే ఇతివృత్తం తో కథలు రావడం జరిగింది. ఈ చిత్రానికే మొదటి ప్రాధాన్యత ఎందుకంటే రామాయణాన్ని ఉన్నది ఉన్నట్టుగా, ఒక పాత్ర ని ఎక్కువ చేయకుండా, తక్కువ చేయకుండా చూపించిన చిత్రాల్లో ఈ సినిమా ముందు వరుసలో ఉంటుంది.

2. సంపూర్ణ రామాయణం (1958)

మహా నటుడు ఎన్టీ రామారావు శ్రీ రాముడిగా నటించి మెప్పించిన ఈ చిత్రం 1958 లో రాగా, తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కింది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో ఎన్టీఆర్ రాముడిగా నటించి మెప్పించారు. ఈ చిత్రం లో తొలిసారిగా శివాజీ గణేశన్ లక్ష్మణుడిగా నటించగా, అదే ఆయనకి తొలి పౌరాణిక పాత్ర.

- Advertisement -

3. సీతారామ కళ్యాణం (1961)

ఎన్టీ రామారావు స్వీయ దర్శకత్వంలో రావణ బ్రహ్మ గా నటించి నిర్మించిన ఈ చిత్రంలో హరనాథ్ రామచంద్రునిగా నటించారు. ఇక ఈ చిత్రంలో రాముడి కల్యాణానికి సంబంధించిన పాట “సీతారాముల కళ్యాణం చూతము రారండి” ఇప్పటికి తెలుగు వారికి ఎంతో ప్రియమైనది. ఇప్పటికి కూడా శ్రీ రామ నవమి రోజున ఈ పాట ఏదో ఒక గుడి దగ్గర పెడుతూనే ఉంటారు.

4. సీతా కళ్యాణం(1976)

బాపు దర్శకత్వంలో 1976 లో వచ్చిన ఈ చిత్రం సీతమ్మ కోణంలో సాగుతుంది. శ్రీ మహా లక్ష్మి జానకి గా జననం మొదలుకొని, సీత గా శ్రీ రాముడితో కళ్యాణం వరకు ఈ చిత్రంలో చూపడం జరిగింది. రవి కుమార్ ఈ చిత్రంలో రాముడిగా నటించగా, సీత గా జయప్రద ఆ పాత్రలో ఒదిగిపోయిందని చెప్పాలి.

5. శ్రీ రామ పట్టాభిషేకం (1978)

ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలోనే వచ్చిన ఈ చిత్రంలో రామారావు రాముడిగా, రావణుడిగా ద్విపాత్రాభినయం తో మెప్పించారు. సంగీత సీతగా నటించారు.

6. లవ కుశ (1963)

ఎన్టీఆర్ హీరోగా నటించిన లవకుశ చిత్రం రామాయణంలోని రవాణా సంహారం జరిగిన తర్వాత శ్రీ రామ పట్టాభిషేకం తర్వాత జరిగిన కథని ఈ చిత్రంలో చూపించడం జరిగింది. ఇక ఈ చిత్రం తర్వాత తెలుగు ప్రేక్షకులకి రాముడు అంటే ఎన్టీఆర్, సీత అంటే అంజలిదేవి అనే ముందు గుర్తుకువస్తారు అంటారు. ఇక తెలుగులో వచ్చిన మొట్ట మొదటి రంగుల చిత్రం లవకుశ.

7. శ్రీ రామ రాజ్యం (2011)

నందమూరి బాలకృష్ణ హీరోగా బాపు దర్శకత్వంలో లవకుశ రీమేక్ గా శ్రీ రామరాజ్యం తెరకెక్కగా, 2011 లో విడుదలై మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది.

ఇవే కాక శ్రీ రామ కథ, శ్రీ రామ భక్త, బాల రామాయణం, లాంటి ఎన్నో చిత్రాలు (Sri Rama Navami Special ) తెలుగు లో విడుదలై మంచి ఆదరణ దక్కించుకున్నాయి. రీసెంట్ గా ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ కూడా రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కగా, అంతగా జనాలు ఆదరించలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు