Lava Kusa: 60 వసంతాలు పూర్తి చేసుకున్న పౌరాణిక చిత్రం

తెలుగు చలనచిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సినిమా “లవకుశ”. 1963 మార్చి 29న విడుదలైన ఈ సినిమా నిన్నటితో సరిగ్గా 60 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర విశషాలను కొన్ని తెలుసుకుందాం.

తెలుగులో విడుదలైన మొట్ట మొదటి పూర్తి స్థాయి రంగుల చిత్రం లవకుశ. తెలుగు లో కోటి రూపాయలు వసూలు చేసిన తొలి సినిమా కూడా ఇదే.

ఈ సినిమా కథ “రామాయణం” లోని “ఉత్తర కాండ” ఆధారంగా రూపొందించబడింది. ఈ కథ సీతా రాముల కుమారులైన లవ కుశల గురించి చెప్పబడింది. ఈ కథలో శ్రీరామ పట్టాభిషేకం, రామరాజ్యం యొక్క సంక్షిప్త కాలం, చాకలి వారి నింద, సీతను బహిష్కరించడం, లవ కుశుల పుట్టుక, రాముడితో తన లవ కుశల సంఘర్షణ, లవ కుశుల పట్టాభిషేకం, మరియు రామావతార ముగింపు తో ఈ కథ ముగుస్తుంది.

- Advertisement -

ఈ పౌరాణిక సినిమా ను సి. పుల్లయ్య మరియు అతని కుమారుడు సి.ఎస్ రావు కలిసి దర్శకత్వం వహించారు. లలితా శివజ్యోతి ఫిల్మ్స్ పతాకం పై శంకర రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. మహా గాయకులు శ్రీ ఘంటసాల బలరామయ్య ఈ చిత్రానికి సంగీతం అందించారు. అంతే కాక ఈ చిత్రం లో 16 పాటలు ఆయన ఆలపించారు. పద్యాలతో కలిసి ఈ సినిమాలో మొత్తం 38 పాటలుంటాయి.

ఈ సినిమా లో రాముడిగా నందమూరి తారక రామారావు నటించగా సీతాదేవిగా అంజలీదేవి నటించారు. లక్ష్మణుడి గా కాంతారావు, భరతుడిగా కైకాల సత్యనారాయణ, శత్రుఘ్నుడి గా శోభన్ బాబు, వాల్మీకి గా చిత్తూరు నాగయ్య, లవుడిగా నాగరాజు, కుశుడిగా సుబ్రహ్మణ్యం, ఆంజనేయుడు గా శాండో కృష్ణ ఇంకా రేలంగి, గిరిజ,  ఎస్. వరలక్ష్మి, కన్నాంబ, సూర్యకాంతం, ధూళిపాళ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

1958 లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ నాలుగేళ్ల పాటు జరుపుకుంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా ఆ తర్వాత కన్నడ, హిందీ భాషల్లో కూడా డబ్ అయింది. ఈ సినిమా 26 కేంద్రాల్లో విడుదలై అన్ని థియేటర్ల లో కూడా 100 రోజులు ఆడింది. అంతే కాదు 18 థియేటర్లలో 175 రోజులు ఆడి సిల్వర్ జూబ్లీ వేడుకను జరుపుకుంది. ఈ సినిమా థియేటర్ లో 1111 రోజుల పాటు ప్రదర్శింప బడి రికార్డు క్రియేట్ చేసింది.

ఆ రోజుల్లోనే ఈ సినిమాకు ఎన్నో మైళ్ళు ప్రయాణించి థియేటర్లకు ఎడ్ల బండ్లు కట్టుకుని వచ్చేవారు. తెలుగులో రాముడైన, కృష్ణుడైన మొదట గుర్తొచ్చేది ఎన్టీఆర్. అలాంటి పేరుకు బీజం వేసింది ఈ సినిమాయే. రాముడిగా ఎన్టీఆర్ పాత్ర అమోఘం, ఆ పాత్ర ఆయన తప్ప ఎవరూ చేయలేనంతగా అందులో జీవించారు. ఈ సినిమా తర్వాత రాముడి పాత్రలో ఎంతో మంది చిత్రాల్లో నటించినా రామారావు క్రేజ్ ని మాత్రం బీట్ చేయలేక పోయారు. ఇక సీత గా అంజలి దేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికి తెలుగు లో సీత అంటే మొదట గుర్తొచ్చేది అంజలీదేవినే. ఆమె అభినయంతో  సీత పాత్రని మరో లెవెల్ కి తీసుకువెళ్ళారు.

అయితే ఈ సినిమా విడుదలైన 60ఏళ్ళ తర్వాత ఈరోజు శ్రీరామ నవమి కలిసి రావడం విశేషం. ఇక ఈ సినిమాని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ 2011 లో “శ్రీ రామ రాజ్యం” పేరుతో బాపు దర్శకత్వంలో రీమేక్ చేశారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు