Daniel Balaji : గుండెపోటుతో చిరుత విలన్ మృతి… డేనియల్ తీరని కోరిక ఇదే

Daniel Balaji : కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ అకాల మరణం సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. 48 ఏళ్ల డేనియల్ తాజాగా గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. శుక్రవారం అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్టు డాక్టర్లు కన్ఫామ్ చేశారు. అకస్మాత్తుగా డేనియల్ బాలాజీ మరణించాడు అనే వార్త బయటకు రావడంతో సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన తీరని కోరిక గురించి ఓ వార్త బయటకు వచ్చింది. మరి ఇంతకీ డేనియల్ తీరని కోరిక ఏంటి? అనే ఆసక్తికరమైన విషయంలోకి వెళ్తే….

ఇదే డేనియల్ తీరని కోరిక…

తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న డేనియల్ బాలాజీ సినీ ప్రస్థానం చిరస్మరణీయమైనది. 1975లో జన్మించిన డేనియల్ బాలాజీ ( Daniel Balaji ) చిన్నప్పటి నుంచే సినీ పరిశ్రమపై ఆసక్తి ఉండడంతో తారామణి అనే ఫిలిం కాలేజీలో శిక్షణ తీసుకున్నాడు. డైరెక్టర్ కావాలనేది ఆయన చిరకాల కోరిక. తారామణి కాలేజీలో శిక్షణను పూర్తి చేసుకున్న వెంటనే కమల్ హాసన్ హీరోగా నటించిన మరుద నాయకం సినిమాలో అవకాశం వచ్చింది. అయితే ఎప్పటికైనా డైరెక్టర్ కావాలనే కోరికతో ఈ సినిమాకు చాలా కాలం పాటు ప్రొడక్షన్ మేనేజర్ గా వర్క్ చేశాడు డేనియల్. ఆ తర్వాత సీరియల్ లో అవకాశం రావడంతో వెండితెర కంటే ముందు బుల్లితెరపైనే నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత తమిళ, తెలుగు భాషల్లో ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు. డైరెక్టర్ గా మారాలనే ఆయన కల నెరవేరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

డేనియల్ బాలాజీ అనే పేరు ఎలా వచ్చిందంటే?

బుల్లితెర పై హీరోగా సినీ కెరీర్ లో స్టార్ట్ చేసిన బాలాజీ సినిమాల్లో మాత్రం విలన్ గా అలరించాడు. చిరుత, ఘర్షణ, టక్ జగదీష్ వంటి తెలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. కమల్ హాసన్ సినిమా కోసం.పని చేస్తున్న టైం లోనే బాలాజీకి రాధిక శరత్ కుమార్ నటించిన పిన్ని (చిత్తి) అనే సీరియల్ లో ఛాన్స్ వచ్చింది. ఈ సీరియల్ లో ఆయన పాత్ర పేరు డేనియల్ కాగా, దానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అప్పటినుంచి బాలాజీని డేనియల్ బాలాజీ అని పిలవడం మొదలుపెట్టారు అభిమానులు. సినిమాలకు కూడా అదే పేరును కంటిన్యూ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం తమిళంలో ఫుల్ బిజీగా ఉన్న డేనియల్ బాలాజీ శుక్రవారం అకస్మాత్తుగా చనిపోయారు. నటుడిగా సక్సెస్ ఫుల్ గా రాణించిన డేనియల్ డైరెక్టర్ కావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. సరైన అవకాశాలు రాకపోవడంతో ఆయన కోరిక నెరవేరలేదు. 48 ఏళ్ల వయసులో బాలాజీ హఠాన్మరణం సౌత్ ఇండస్ట్రీని తీవ్ర విషాదంలో ముంచేసింది. సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు డేనియల్ బాలాజీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో కలిపి ఇప్పటిదాకా మొత్తం 50కి పైగా సినిమాల్లో నటించాడు డేనియల్. జూనియర్ ఎన్టీఆర్ సాంబ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన డేనియల్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. టాలీవుడ్ లో ఆయన చివరిగా నటించిన మూవీ నేచురల్ స్టార్ నాని టక్ జగదీష్. ఇందులో మెయిన్ విలన్ గా నటించాడు. ఇక ఈరోజు పురసైవల్కంలోని ఆయన నివాసంలో భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు