Soundarya Death Anniversary : చెరగని “సౌందర్య” రూపం.. నింగికెగసి రెండు దశాబ్దాలు..

Soundarya Death Anniversary : సౌందర్య.. ఈ పేరు చెప్పగానే తెలుగు సినీ అభిమానులు మరో సావిత్రి అనే వారు. నటనకి ప్రాధాన్యమిచ్చే పాత్రలు చేస్తూ, అశ్లీలతలకి చోటు లేకుండా నిండుదనంతో ప్రేక్షకులని సమ్మోహనపరిచే నటనతో ఆకట్టుకునేవారు సౌందర్య. కన్నడ నాట పుట్టినా తెలుగమ్మాయిగానే సౌందర్య అభిమానులకి చేరువయింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే ఓ వెలుగు వెలిగిన అందాల తార సౌందర్య నేడు (ఏప్రిల్ 17) అభిమానులకు దూరమై రెండు దశాబ్దాలయింది. ఈ సందర్బంగా ఒక్కసారి ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుందాం. తెలుగు చిత్ర పరిశ్రమ నటీమణుల్లో నటన కి ప్రాధాన్యమిచ్చే హీరోయిన్లలో ఈమె ముందు వరుస లో ఉంటుంది. మహానటి సావిత్రి తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న నటి సౌందర్య మాత్రమే. సౌందర్య ముగ్ధమనోహర రూపం, ఆమె నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక అందాల ప్రదర్శనకు దూరంగా ఉండే సౌందర్య చీరకట్టులోనే అందర్నీ కట్టిపడేసేవారు. అయితే సౌందర్య అసలు పేరు సౌమ్య. సౌందర్య తండ్రి సత్యనారాయణకు చిత్ర పరిశ్రమతో ముందునుండే అనుబంధం ఉంది.

అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరోయిన్..

తండ్రి చొరవతో కన్నడలో ‘గంధర్వ’ అనే కన్నడ చిత్రంలో ఎంట్రీ ఇచ్చిన సౌందర్య, తెలుగు సినిమాలతోనే గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిత్రం తర్వాత వెంటనే తెలుగులో పి.ఎన్.రామచంద్రరావు రూపొందించిన ‘మనవరాలి పెళ్ళి’లో నటించారు. అయితే కెరీర్ కి మంచి బ్రేక్ వచ్చిన చిత్రం మాత్రం ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు. ఈ సినిమా సూపర్ హిట్ తర్వాత వరుసగా కృష్ణా రెడ్డి దర్శకత్వంలో చాలా చిత్రాల్లో నటించింది. మాయలోడు, నెంబర్ వన్, హలో బ్రదర్, పెదరాయుడు వంటి హిట్లతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక అమ్మోరు సినిమా తర్వాత టాలీవుడ్ హీరోల సినిమాల్లో సౌందర్య ఫస్ట్ ఆప్షన్ గా నిలిచేది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తో పాటు జగపతి బాబు, శ్రీకాంత్ వంటి స్టార్స్ తో నటించి మెప్పించింది. అలాగే సౌత్ లో ఆయా భాషల స్టార్ హీరోలందరితోనూ సౌందర్య నటించడం విశేషం. అయితే ముఖ్యంగా వెంకటేష్‌ తో ఆమె చాలా సినిమాలు చేసింది. ఈ కాంబినేషన్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దాదాపు పదికి పైగా సినిమాలు ఈ కాంబోలో వచ్చాయి. ఈ ఇద్దరు జంటగా నటించిన ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు, పవిత్రబంధం, పెళ్ళిచేసుకుందాం, రాజా, జయం మనదేరా వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి.

సావిత్రితో పోల్చిన ప్రేక్షకులు..

ఇక సౌందర్య నటన విషయానికి వస్తే వెంకటేష్ హీరోగా నటించిన పవిత్రబంధంలో ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. ఆ సినిమాలో వెంటకేష్ కాంట్రాక్ట్ భార్యగా సౌందర్య నటన ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆ సినిమాతో ఆమెను మహానటి సావిత్రితో పోల్చారు జనాలు. ఆ తర్వాత ఇదే కాంబినేషన్‌లో వచ్చిన పెళ్ళిచేసుకుందాం లో కూడా సౌందర్య నటన హైలెట్ అని చెప్పాలి. ఈ సినిమాలో అఘాయిత్యానికి బలైన యువతి పాత్రలో సౌందర్య నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ రెండు చిత్రాలలో సౌందర్య అభినయం చూసిన తెలుగు జనం మరో సావిత్రి అన్నారు . ఇక ఆమె నటనకు ఎనో అవార్డులు రివార్డులు కూడా సొంతం చేసుకుంది.

- Advertisement -

2004 లో నింగికెగసిన తార..

2004 వరకు బిజీగా సినిమాలు చేస్తున్న సౌందర్య తెలుగులో శివ శంకర్ లో చివరిగా నటించగా, నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వం వహించిన నర్తన శాలలో సౌందర్య ద్రౌపతి గా నటించారు. ఈ సినిమానే ఆమె చివరి చిత్రంగా మిగిలింది. ఆనాడు సావిత్రి ఆ పాత్ర చేస్తే ఆ తర్వాత ఆ పాత్రకు న్యాయం చేసేది సౌందర్య మాత్రమే అని బాలయ్య భావించారు. అయితే ఈ సినిమా ప్రారంభం అయిన తరువాత రెండు రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకుంది. సౌందర్య మరణం తర్వాత ఈ చిత్రం ఆపేసారు. అయితే అఫిషియల్ గా సౌందర్య కన్నడలో 2004లో నటించిన చివరి చిత్రం ఆప్త మిత్ర. ఈ చిత్రంలో తన నటనకు ఆమెకు ఫిల్మ్ అవార్డ్ లభించింది. ఆ తరువాత సౌందర్య 2004లో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి వెళ్తూ హెలికాప్టర్ క్రాష్ లో ప్రమాదవశాత్తూ ఏప్రిల్ 17న (Soundarya Death Anniversary) కన్నుమూశారు. ఆ ప్రమాదంలో సౌందర్య తో పాటు ఆమె సోదరుడు అమర్ కూడా కన్నుమూశారు. అలా అందరికి దూరమయ్యేసరికి సౌందర్య కేవలం వయసు కేవలం 31 సంవత్సరాలే. ఆమె మరణించి నేటికీ 20 ఏళ్లవుతున్నా కూడా ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు సినీ అభిమానులు. అయితే త్వరలోనే సౌందర్య బయోపిక్ చిత్రం తీయడానికి తెలుగులో సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు