South : టైం ట్రావెల్ చేస్తున్న సౌత్ స్టార్స్… ఎంతమందికి వర్కౌట్ అవుతుందో?

సినిమా ఇండస్ట్రీలో జరిగే పరిస్థితులు కొన్నిసార్లు విచిత్రంగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఒకేసారి ఒకే కాన్సెప్ట్ తో సినిమాలు రావడం. కొన్నిసార్లు రొమాంటిక్ జానర్, మరికొన్నిసార్లు క్రైమ్ జానర్, ఇంకొన్నిసార్లు హార్రర్ జానర్లో ఒకేసారి మూడు నాలుగు సినిమాలు వస్తూ ఉంటాయి. మరి మేకర్స్ తెలీక ఒకేసారి ఇలాంటి కథలను పట్టుకుంటారా? లేదంటే ట్రెండ్ ఫాలో అవుతున్నామని, ఎవరి టేకింగ్ వారిదేనని సరిపెట్టుకుంటారో తెలియదు. కానీ ఇలా రిపీట్ అవ్వడం మాత్రం ఇదే మొదటిసారి కాదు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల విషయంలో ఇలాగే జరుగుతోంది. స్టార్ హీరోలంతా టైం ట్రావెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇంతకీ ఆ హీరోలు ఎవరు? ఎంతమందికి ఈ స్టోరీ లైన్ వర్కౌట్ అవుతుంది? అనే విషయంలోకి వెళ్తే…

ఈసారి స్టార్ట్ చేసింది ప్రభాసే…

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం “కల్కి” అనే టైం ట్రావెల్ ఫాంటసీ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ స్టోరీని ఇప్పటికే బయట పెట్టేశారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. శ్రీవిష్ణు అంశతో పుట్టిన భైరవ పాత్ర వందలాది సంవత్సరాలు ప్రయాణం చేస్తూ మహాభారత కాలం నుంచి వర్తమానం దాకా కొనసాగుతుందని నాగ్ అశ్విన్ ఎప్పుడో చెప్పేశారు. అంటే 3102 బీసీ నుంచి భవిష్యత్తు 2898 ఏడి దాకా అన్ని యుగాల్లోనూ కథానాయకుడు భైరవ ప్రయాణం కొనసాగుతుంది. ప్రభాస్ నిజానికి ఇప్పటిదాకా ఇలాంటి స్టోరీ లైన్ ను ట్రై చేయలేదని చెప్పాలి. ఇక ఇప్పుడు ఆయనకున్న ఇమేజ్ ను, డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ సామర్థ్యం, స్టోరీ లైన్ ను బట్టి చూస్తే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం పక్కా అనిపిస్తోంది. ఈ మోస్ట్ అవైటింగ్ మూవీ గురించే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. మూవీ రిలీజ్ అయితే ఆ ఫీవర్ హై లెవెల్లో ఉండే అవకాశం ఉంది.

- Advertisement -

సూర్య కంటిన్యూ చేస్తున్నాడు…

ఇక కోలీవుడ్ స్టార్ సూర్య కూడా దాదాపుగా ఇలాంటి స్టోరీ లైన్ తోనే థియేటర్లలోకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. “కల్కి”తో పోలిస్తే “కంగువా” బ్యాక్గ్రౌండ్ వేరే అయినప్పటికీ మెయిన్ థీమ్ మాత్రం దగ్గరగా ఉంటుందని అంటున్నారు. కంగువా స్టోరీ విషయానికి వస్తే… 1678లో ఉన్న ఓ అటవీ జాతి నాయకుడు 2024లోకి టైం ట్రావెల్ ద్వారా వచ్చి, ఒక రీసెర్చ్ స్టూడెంట్ సహాయంతో మధ్యలోనే ఆగిపోయిన తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాడని టాక్ నడుస్తోంది. ఈ మూవీలో సూర్య రకరకాల గెటప్పులు, స్టైల్స్ తో కనిపించబోతున్నారు. అయితే ఇప్పటికే సూర్య టైం ట్రావెల్ నేపథ్యంలో ఒక సినిమాలో కనిపించారు. “24” అనే మూవీలో సూర్య హీరోగా నటించగా, విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. మరి ఈసారి టైం ట్రావెల్ అనేది సూర్యకు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అంటే కాలమే సమాధానం చెప్పాలి.

చిరు కూడా ఈ ట్రెండ్ నే ఫాలో అవుతున్నాడా?

ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా తన కొత్త మూవీతో ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం చిరు వశిష్ట దర్శకత్వంలో “విశ్వంభర” అని మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న “విశ్వంభర” కథ ముల్లోకాల చుట్టూ తిరుగుతుందని, ఇందులో త్రిష దేవతగా కనిపించబోతోందని, ఇంకా ఏంజిల్స్ కూడా ఉంటారని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా ఇది ఒక సోషియో ఫాంటసీ మూవీ కాబట్టి ఇందులో కూడా టైం ట్రావెల్ థీమ్ ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలీదు. కానీ మొత్తానికి ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఇప్పుడు టైం ట్రావెల్ లోనే మునిగిపోయారన్న మాట.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు