Veturi : కవితా సెలయేటి ప్రవాహానికి “సుందర” రూపం.. వేటూరి..

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక మహా అధ్యాయం “వేటూరి శకం”. ఈయన పేరు ఈ జెనరేషన్ ఆడియన్స్ కి అంతగా తెలియకపోవచ్చు కానీ, 20వ దశకం ఆరంభం వరకు వేటూరి రచనా సాహిత్యం, తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు ఇండస్ట్రీ ఆజన్మాంతం రుణపడి ఉండడం తప్ప ఏమి చేయలేదు. అంతటి స్థాయి ఉన్న “వేటూరి సుందర రామమూర్తి” జయంతి నేడు. ఈ సందర్బంగా filmify టీం తరపున ఆయనకు నివాళులు అర్పిస్తూ వేటూరి గురించి ఆయన రచన గురించి మచ్చుకు కొన్ని గుర్తు చేసుకుందాం.

ఎక్కడో కృష్ణా జిల్లా లో ఓ మారుమూల కుగ్రామమైన పెద కళ్లేపల్లికి చెందిన ఈయన మద్రాసు లో పదిహేనేళ్ల పాటు పాత్రికేయుడిగా పని చేసి, రచన మీద మక్కువతో కె. విశ్వనాధ్ సహకారంతో ఆయన దర్శకత్వంలోనే వచ్చిన ‘ఓ సీత కథ’ అనే చిత్రం ద్వారా 1974 లో వెండితెర ప్రవేశం చేసారు. అయితే సామాన్యుడికి కూడా అర్ధమయ్యే వాడుక భాషలోనే రాయడం వేటూరితోనే మొదలైందని ఇండస్ట్రీ లో అంటుంటారు. అలా వేటూరి ని ఆదర్శంగా తీసుకుని వచ్చిన వాళ్లలో సిరివెన్నెల కూడా ఒకరు.

అయితే వేటూరికి అత్యంత ప్రజాదరణ తెచ్చిన పాట మాత్రం 1977లో వచ్చిన “అడవి రాముడు” లో సందేశాత్మక గీతం. ఈ చిత్రంలో వేటూరి కలం ఊడి పడిన “కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు” అనే పాట ఆ రోజులలో యావత్ తెలుగు ప్రేక్షకుడిని కదిలించింది. ఇక అక్కడ్నుంచి ఆయన వెనుతిరిగి చూసుకొలేదు. ముఖ్యంగా 1979 లో “శంకరా భరణం” లో ఆయన రాసిన ‘శంకరా నాదశరీరాపరా’.. అంటూ రాసిన పాట ప్రతి ప్రేక్షకుడిని భక్తి పారవశ్యంతో ముంచెత్తేలా చేసింది. ఈ ప్రజాభిమానమే వేటూరికి 8 నందులు వచ్చేలా చేసింది.

- Advertisement -

ఓ ఇంటర్వ్యూ లో సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గురువు వేటూరి గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు.. “మొదటిసారి వేటూరి గారిని అనుకోకుండా చూసినప్పుడు ఒళ్లంతా చెమటలు పట్టేసి శరీరం వణికి పోయింది. ఆయన దగ్గరకు వెళ్లి నమస్కారం చేసి…”గోపికలు కృష్ణున్ని చూసి అవాక్కయి, ముగ్దురాళ్ళై అలా చూస్తూ ఉండిపోయారని పోతన గారు రాస్తే అతిశయోక్తి అనుకున్నానండి. కానీ ఇప్పుడు ఆయన ముందు నిలుచున్న నా పరిస్థితి అదే!” అని చెప్పి వచ్చేశాను” అన్నారు. నిజానికి తెలుగు రచయితల్లో ట్రెండ్ సెట్టర్ అంటే వేటూరి గారే, నేను కేవలం ఆయనకీ కొనసాగింపుని మాత్రమే అని అన్నారు సిరివెన్నల.

వేటూరి రచనల్లో మచ్చుకు కొన్ని…

1. గీతాంజలి.. ఓ ప్రియా
నిప్పులోన కాలదు నీటిలోన నానదు గాలిలాగ మారదు ప్రేమ సత్యము
రాచవీటి కన్నెది రంగు రంగు స్వప్నము పేదవాడి కంటిలో ప్రేమ రక్తము…

2.గోదావరి 2006

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదరి..

3.శుభలేఖ 1983

రాగాల పల్లకిలో కోయిలమ్మా.. రాలేదు ఈవేళ ఎందుకమ్మా
రాలేదు ఈవేళ కోయిలమ్మా..రాగాలే మూగబోయినందుకమ్మా …

ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఐదు వేలకి పైగా పాటలు రాసి తెలుగుకళామతల్లికి సేవల్ని అందించారు.

అయితే విషాద గీత రచనలో సిద్ధహస్తులైన వేటూరి కి అవార్డుల పంట ఇచ్చింది కూడా ఆ పాటలే కావడం విశేషం. ఆకాశాన సూర్యుడుండడు సంధ్యవేళకి, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, లాంటి ఇప్పటికి వింటూనే ఉంటాం. ఈ మధ్య ఏ సినీ, రాజకీయ ప్రముఖులు తాను చాలించినా ఈ పాటలే వేస్తారు. అలాంటిది వేటూరిని కూడా తెరపై అలా చూడాల్సి వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. తెలుగు కళామతల్లికి ఎన్నో సేవలు చేసిన వేటూరి సుందరరామమూర్తి 2010 లో మే 22న గుండెపోటు తో స్వర్గస్థులయ్యారు. అయినా వేటూరి తన పాటల రూపంలో ఎప్పటికి మనల్ని పలకరిస్తూనే ఉంటారు.

భక్తి పారవశ్యంతో శంకరా అంటూ శివుడ్ని పిలిచినా,
కృషి ఉంటె మనుషులు ఋషులవుతారు అంటూ సందేశాన్నిచ్చినా,
కరిగిపోయాను కర్పూర వీణలా అంటూ ప్రేమికులు యుగళ గీతం పాడినా,
అన్నింట్లోనూ వేటూరి పాటల రూపంలో పలకరిస్తూనే ఉంటారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు