Vishwak Sen : నటన ఒక్కటే కాదు గురు..

తెలుగు సినీ పరిశ్రమకు ఉన్న చరిత్ర గురించి చెప్పాలంటే పేజీలు సరిపోవు. ఒక సారి ఇండస్ట్రీ తొలినాళ్లలోకి చూస్తే.. తొలినాళ్లలో అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఎన్టీ రామారావు, కృష్ణ. వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి టాప్ హీరోలుగా కొన్ని దశబ్ధాల పాటు ఓ వెలుగు వెలిగారు. రామారావు చేసిన దేవుళ్ల పాత్రలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు. కృష్ణ చేసిన అల్లూరి సీతారామరాజు లాంటి ఎన్నో పాత్రలు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.

శ్రీ కృష్ణ పాండవీయం, వరకట్నం, దాన వీర శూర కర్ణ వంటి సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేయడంతో పాటు హీరోగా కూడా నటించాడు రామారావు. కృష్ణ కూడా ఇటు హీరోగా నటిస్తూ దర్శకత్వ బాధ్యతలు కూడా చేసుకునే వాడు. అయితే ప్రస్తుత కాలంలో ఒక సినిమా చేయాలంటే స్టోరీ ఒకరు, స్క్రీన్ ప్లే ఒకరు, డైలాగ్స్ ఒకరు, దర్శకుడిగా మరొకరు ఉంటారు. కానీ అన్ని తానై సినిమాలు చేసింది రామారావు, కృష్ణ మాత్రమే. వీరి తర్వాత మళ్లీ అలా చేసిన వారు లేరు. అడపా దడపా కొంత మంది వచ్చినా రామారావు, కృష్ణ అంత చేయలేకపోయారు.

అయితే ప్రస్తుతం మళ్లీ రామారావు, కృష్ణ లాంటి లక్షణాలు ఉన్నవారు తెలుగు చిత్ర సీమలో కనిపిస్తున్నారు. వాళ్లే యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, అడివి శేష్ తో పాటు మరికొంత మంది. ఈ యంగ్ హీరోలు సినిమాల్లో హీరోగా నటిస్తూనే కథ, స్క్రీన్ ప్లే తో పాటు మెగా ఫోన్ కూడా పట్టుకుంటున్నారు. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ కథ, స్క్రీన్ ప్లే కే పరిమితం అవుతున్నాడు. కానీ విశ్వక్ సేన్, అడివి శేష్ లు మాత్రం తాము చేయాల్సిందని కంటే ఎక్కువే చేస్తున్నారు.

- Advertisement -

ఇందులో అడివి శేష్ గురించి చూస్తే..
కెరీర్ ప్రారంభంలో సైడ్ క్యారెక్టర్ల కోసమే చాలా కష్టపడ్డాడు. కానీ ఇప్పుడు ఆయనే హీరో. ఆయనే దర్శకుడు, కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అడివి శేష్ మొదట ఖర్మ, కిస్ అనే సినిమాలో నటిస్తూ మెగా ఫోన్ పట్టుకున్నాడు. కానీ అవి పెద్ద సక్సెస్ కాలేకపోయింది. అయినా నిరాశపడలేదు.. అప్పటితో మెగా ఫోన్ పక్కన పెట్టి.. తన పెన్ కు పదును పెట్టి.. క్షణం, గూఢచారి, మేజర్ వంటి సినిమాలకు స్క్రీన్ ప్లే అందించాడు. ఈ మూడు కూడా పెద్ద విజయాన్ని అందుకున్నాయి. గూఢచారి సెన్సేషనల్ హిట్ అందుకోగా, మేజర్ కు దేశ వ్యాప్తంగా సినీ లవర్స్ ఫిదా అయిపోయారు.

అలాగే మరో యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి మాట్లాడుకుంటే..
తాను హీరోగా చేసిన మూడో సినిమా ఫలక్‌నుమా దాస్ నుంచే దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. ఒక దర్శకత్వమే కాదు.. నిర్మాత అవతారం కూడా ఎత్తాడు. ఇలా కొన్ని సినిమాలు చేసిన తర్వాత తాజాగా ధమ్కి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ రెండు విభిన్న పాత్రలు చేయడమే కాకుండా దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ఇలా మోతాదుకి మించి పనులు చేస్తూ పాత తరం అగ్ర హీరోలను గుర్తు చేస్తున్నాడు.

ప్రస్తుత కాలంలో విశ్వక్ సేన్, అడివి శేష్ మాత్రమే కాదు.. వెంకీ అట్లూరి, శ్రీనివాస్ అవసరాల, రాహుల్ రవీంద్రన్, కిరణ్ అబ్బవరం లాంటి యంగ్ హీరోలు సినిమాల్లో నటిస్తూనే, తమ పెన్ కు పని చెప్పి మెప్పిస్తున్నారు. వీరితో పాటు బాలయ్య కూడా అదే దారిలో వెళ్తున్నాడు. ఇప్పటికే తాను నటించిన నర్తనశాల సినిమాకు దర్శకత్వం వహించిన బాలయ్య ఇప్పుడు మరోసారి ఆదిత్య 999 మాక్స్ అనే సినిమా కోసం మెగా ఫోన్ పట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. దీనిలో తన కొడుకు మోక్షజ్ఞ ను హీరోగా పరిచయం చేయబోతున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు