Chiranjeevi : 36 వసంతాల “రుద్రవీణ”..చిరంజీవి నట కౌశలానికి నిదర్శనం..

టాలీవుడ్ లో స్టార్ హీరోల నుండి కమర్షియల్ సినిమాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ అందరూ మెచ్చే సందేశాత్మక చిత్రాలు ఎప్పుడో ఒకసారిగాని రావు. పైగా మొబైల్ లు, కంప్యూటర్లతో అత్యంత బిజీ గా ఉన్న ఈ రోజుల్లో కొత్త సినిమాలు చూడ్డానికే జనాలకు టైం చాలడం లేదు. అలాంటిది పాత సినిమాలు చూస్తారంటారా? అని ఒక మాట వస్తే.. ఏ తరం అయినా ఖచ్చింతగా చూడాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి అని కొన్ని క్లాసిక్స్ ని చూసి చెప్పొచ్చు. ఈ రోజుల్లో కొందరు దర్శకులు మా సినిమా అంటే మాస్ సినిమా కల్ట్ క్లాసిక్ అని ఊదరగొడుతుంటే, అసలు ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమాలు ఇవిరా అని చూపించే సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి అతి తక్కువ క్లాసిక్ మూవీస్ లో అలనాటి చిత్రం “రుద్రవీణ” ఒకటి. మెగాస్టార్ చిరంజీవిని నటన పరంగా ఎన్నో మెట్లు ఎక్కించిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. తన సినిమాలతో నలుగురికి డాన్స్ మాత్రమే కాదు, పది మందికి మంచి కూడా చెప్పగలనని ఈ చిత్రంతో చిరంజీవి చాటి చెప్పారు. అంతటి గొప్పచిత్రమయిన “రుద్రవీణ”(4 మార్చి 1988) విడుదలై నేటికీ 36 వసంతాలు పూర్తయింది. ఈ సందర్బంగా ఆ చిత్ర విశేషాల్ని కొన్ని గుర్తు చేసుకుందాం.

మాస్ హీరోగా నెంబర్ వన్ గా నిలిచిన రోజులవి..

మెగాస్టార్ చిరంజీవి గా వరుస విజయాలతో నెంబర్ వన్ గా చిత్ర పరిశ్రమని ఏలుతున్న రోజులవి. అప్పటికే పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, మంచి దొంగ లాంటి చిత్రాలతో బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపుతున్నాడు చిరు. అలా కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ గా నిలిచిన చిరంజీవిని అప్పటికే కె. విశ్వనాథ్ చెప్పులు కొట్టుకునే సాంబయ్య గా మార్చితే, ఆ తర్వాత కె. బాల చందర్ ఒక సంగీత విధ్వంసుడిగా సూర్య నారాయణ శాస్త్రిగా చూపించాడు. ఇక బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘రుద్రవీణ’. చిత్రానికి ఆ రోజుల్లో కలెక్షన్ల వర్షం కురవక పోయినా సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు, ప్రభుత్వం నుంచి అవార్డులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి.

- Advertisement -

సమాజంలో మార్పు కోసం సందేశం..

సమాజంలో ఎవరికి వారే, నా పేరు, నా కుటుంబం అంటూ ఉండే సగటు మనిషి, అలాగే సమాజంలో మంచి జరగాలి అంటూ, గుడి దగ్గర పది రూపాయలు బిచ్చమేసో, రోడ్డు మీద బైక్ పై వెళ్లే వాళ్లకు స్టాండ్ తీయ్ భయ్యా అంటూ చేసే హెల్ప్ ని పెద్ద సమాజ సేవ అనుకునే జనాలకు అది సేవ కాదు సమాజంపై కనీస బాధ్యత.. అని చెప్తూ సమాజంలో మార్పు రావాలని తపన పడే అభ్యుదయ భావాలు కలిగిన యువకుడు సూర్యం కథే ఈ రుద్రవీణ.

కథ విషయానికి వస్తే..

రుద్రవీణలో ప్రఖ్యాతి గాంచిన బిలహరి గణపతి శాస్త్రి చిన్న కొడుకే ఈ సూర్యనారాయణ.. ఇక అతనికి నాద స్వరం వాయించే ఒక మూగ అన్నయ్య. అయితే తండ్రికి ఛాందస భావాలు, కులాభిమానం ఎక్కువ.
అయితే సూర్యం సమాజం పట్ల తపన కలిగిన వాడు. సంగీత ప్రావీణ్యం తో పాటు సమాజంలో మంచికి కొత్త మార్పు కోరుకునేవాడు. ఈ క్రమంలో సూర్యం శూద్రుల అమ్మాయి లలితను ప్రేమిస్తాడు. తండ్రి కోపంతో ఇంటి నుంచి వెళ్ళిపోయి వేరుగా ఉంటాడు. ఈ మధ్యలో చారుకేశ అనే యువకుడు శాస్త్రీ కూతుర్ని ప్రేమించి ఆయనకు అల్లుడవుతాడు. అయితే ఇంటినుండి బయటికి వచ్చేసిన సూర్యం గ్రామంలో పరిస్థితుల్ని చూసి చలించిపోతాడు. అప్పట్నుంచి ఊళ్ళో మార్పు తీసుకొచ్చే కార్యక్రమాలు మొదలు పెడతాడు. ఎన్నో అవమానాలు, చీదరింపులు మధ్య చివరికి అనుకున్న లక్ష్యం సాధించి భారత రాష్ట్రపతి సత్కారం కూడా పొందుతాడు. అంత వరకూ తన మూర్ఖత్వం తో కొడుకుని దూరం చేసుకున్న గణపతి శాస్త్రీ, మెల్లి మెల్లిగా ఊరిలో సూర్యం చేసిన అభివృద్ధిని చూసి, తన తప్పు తెలుసుకుని, కొడుకు గొప్పదనం తెలుసుకుని అందరి తన తప్పు ముందు ఒప్పుకోవడంతో పాటు సూర్యం, లలితను ఒక్కటి చేయటంతో కథ ముగుస్తుంది.

అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో తొలిచిత్రం…

మెగాస్టార్ చిరంజీవి తన తల్లి కోరిక మేరకు, తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ లను నిర్మాతలుగా చేసి “అంజనా ప్రొడక్షన్స్” పేరుతో రుద్రవీణ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. 80 లక్షల బడ్జెట్ తో నిర్మించిన ఈ రుద్రవీణ చిత్రం అప్పట్లో కమెర్షియల్ గా అంతగా ఆడలేదు. కానీ ఎన్నో ప్రశంసలతో పాటు అవార్డులు సాధించి పెట్టింది. రుద్రవీణ నిర్మించిన నాగబాబు కూడా ఈ చిత్రంతో మాకు లాభాలు రరాలేదు కానీ, దేశ వ్యాప్త గుర్తింపు తో పాటు, ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టింది. ఆ విషయంలో రుద్రవీణ లాంటి గొప్ప చిత్రాన్ని నిర్మించినందుకు మాకు ఇప్పటికి గర్వంగా ఉంటుందని నాగబాబు పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు.

చిరు నటనకు ప్రశంసలు.. దర్శకత్వ ప్రతిభకు అవార్డులు..

చిరంజీవి అత్యుత్తమ నటన కనబరిచిన చిత్రాల్లో రుద్రవీణ ఒకటి. సూర్య నారాయణశాస్త్రి గా, ఈ చిత్రంలో చిరంజీవి జీవించాడని చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఓ సందర్భంలో సూర్యం తండ్రి కోపంతో ఇంట్లో ఎవ్వరూ భోజనం చేయరు. ఆ సమయంలో ఊళ్ళో చేసే మంచిని ప్రశంసించాల్సింది పోయి చేయొద్దని చెప్పే తండ్రి కోసం నేను ఆగను, నేను భోజనం చేస్తాను అంటూ విస్తరి లో అన్నం పెట్టుకుంటూ, “ఈ దేశంలో ఇప్పుడు కావాల్సింది గాన కచేరీలు కాదు, జ్ఞాన కచేరీలు” అంటాడు. ఆ సమయంలో అన్నం ముద్ద పెట్టుకుందామని ఆగిపోతూ ఒక్క క్షణంలో చిరంజీవి తన కళ్ళతో చూపించిన అభినయం మాటల్లో చెప్పలేము. అక్కడితో తినకుండా లేచిపోతాడు. ఇలాంటి గొప్ప సీన్లు సినిమాలో ఎన్నో ఉన్నాయి.

అయితే చిరంజీవిని నటనలో ఎన్నో మెట్లు ఎక్కించిన ఈ చిత్రం కమర్షియల్ గా అంతగా ఆడకపోయినా, జాతీయస్థాయిలో దేశ సమైక్యతను చెప్పే గొప్ప చిత్రంగా నర్గీస్‌దత్‌ నేషనల్ అవార్డ్‌, అలాగే ఇళయరాజాకు ఉత్తమ సంగీత దర్శకుడు, ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యంకి ఉత్తమ గాయకుడు అవార్డును దక్కించు కుంది. ఇక రాష్ట్రస్థాయిలో నంది అవార్డులలో ఉత్తమ నటుడుగా చిరంజీవి జ్యూరీ అవార్డు అందుకున్నారు. ఇక గణేశ్‌ పాత్రోకి మాటల రచయితగా నంది అవార్డ్‌ తీసుకొచ్చింది. అంజనా ప్రొడక్షన్స్‌ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రానికి పలు అంశాలలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రులకు స్ఫూర్తినిచ్చి, ఆ చిత్రంలోని అంశాలను తమ పథకాలుగా ప్రవేశపెట్టారంటే ఈ చిత్రం గొప్పతనం అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి చిత్రాల్ని మళ్ళీ చిరంజీవి నుండి రావాలని కోరుకుంటున్నారు ప్రేక్షకులు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు