Ilayaraja Songs : సాంగ్స్ పై రైట్స్ రచయితలకి కూడా ఉంటాయా? ఇళయరాజాకు జడ్జ్ సూటి ప్రశ్న

Ilayaraja Songs : తన 4,500 పాటల రైట్స్ కు సంబంధించిన అగ్రిమెంట్ ముగిసినప్పటికీ పలు సంగీత సంస్థలు ఇంకా వాడుకుంటున్నాయి అని ఆరోపిస్తూ కోలీవుడ్ మ్యూజిక్ దిగ్గజం ఇళయరాజా చెన్నై హైకోర్టులో కేసు వేశారు. అయితే తాజాగా ఈ కేసు విషయంలో ఇళయరాజాకు చుక్కెదురయింది. పాటలపై పాటల రచయితలకు కూడా రైట్స్ ఉంటాయా? అని ఎదురు ప్రశ్నించారు జడ్జ్. ఇంతకీ ఈ కేసు విషయంలో అసలు ఏం జరుగుతుంది? అంటే…

అసలు వివాదం ఏంటంటే?

ఇళయరాజా తమిళ చిత్రసీమలో ప్రముఖ సంగీత స్వరకర్త. ఆయన స్వరపరిచిన 4,500 పాటలను ఉపయోగించేందుకు ఎక్కో, అకీ సహా సంగీత సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అగ్రిమెంట్ ముగిసిన తర్వాత కాపీరైట్ రైట్స్ ను పొందకుండా తన పాటలను వాడుకుంటున్నారని దావా వేశారు.

2019లో ఈ కేసును విచారించిన మద్రాసు హైకోర్టు సింగిల్ జడ్జి.. నిర్మాతల నుంచి హక్కులను పొందిన తర్వాత ఇళయరాజా పాటలను వినియోగించుకునే హక్కు సంగీత సంస్థలకు ఉందని, ఈ పాటల మీద ఇళయరాజాకు వ్యక్తిగత నైతిక హక్కు కూడా ఉందని 2019లో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుపై ఇళయరాజా దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన ద్విసభ్య ధర్మాసనం ఇళయరాజా పాటలను ఉపయోగించకుండా సంగీత సంస్థలపై మధ్యంతర నిషేధం విధించింది.

- Advertisement -

ఎకో మ్యూజిక్ కంపెనీ పిల్..

ఇదిలా ఉండగా ఎకో కంపెనీ తరపున అప్పీల్ దాఖలు చేయగా, సినిమా కాపీరైట్ నిర్మాతలదేనని, తమతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పాటలను ఉపయోగించుకునే హక్కు తమకు ఉందని పేర్కొంది. ఈ కేసును న్యాయమూర్తులు ఆర్. మహదేవన్, మహ్మద్ షఫీక్ ఈరోజు మరోసారి విచారించారు.

ఇళయరాజాకు శాలరీ ఇచ్చారు..

ఆ సమయంలో ఎకో కంపెనీ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది విజయ్ నారాయణ్ మాట్లాడుతూ.. ఇళయరాజాకు సంగీతం అందించినందుకు నిర్మాత డబ్బులు చెల్లించారు. కాబట్టి రైట్స్ నిర్మాతకే దక్కుతాయని చెప్పారు. నిర్మాత నుంచి హక్కులు రావడంతో పాటలు తమవే అయ్యాయని పేర్కొన్నారు.

సాహిత్యం లేనిదే పాట లేదు..

దీనిపై ఇళయరాజా తరఫు సీనియర్ న్యాయవాది సతీష్ పరాశరన్ స్పందిస్తూ.. మ్యూజిక్ కంపోజిషన్ అనేది క్రియేటివ్ వర్క్ కాబట్టి కాపీరైట్ చట్టం వర్తించదని అన్నారు. అప్పుడు జోక్యం చేసుకున్న న్యాయమూర్తులు అలా అయితే పాటల రచయిత సాహిత్యం అందిస్తే, గాయకుడితో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ పాటను రూపొందించారు. సాహిత్యం లేనిదే పాట లేదు. అలాంటప్పుడు గీత రచయిత కూడా పాటపై హక్కులు క్లెయిమ్ చేస్తే ఏం జరుగుతుందని ప్రశ్నించారు.

విచారణ వాయిదా..

ఇక ఈ పాటల విక్రయం ద్వారా ఇళయరాజాకు వచ్చిన డబ్బు ఎవరికి చెందుతుంది అనేది కేసు తుది తీర్పుపై ఆధారపడి ఉంటుందని మద్రాస్ హైకోర్టు తెలిపింది. ఇళయరాజా పాటలపై పాటల రచయితలు హక్కులు పొందే అవకాశం ఉందా లేదా అనే అంశంపై న్యాయమూర్తులు ఇళయరాజా పక్షాన్ని వివరణ కోరారు. దీంతో న్యాయమూర్తి కేసును జూన్ 2వ తేదీకి వాయిదా వేశారు. మరి చివరకు ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు