HBD BoyapatiSrinu : క్లాసీ గా కనిపించే మాస్.. ఊర మాస్ డైరెక్టర్…

HBD BoyapatiSrinu : టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ఒక దర్శకుడు ఫ్యామిలీ చిత్రాలు మాత్రమే తీస్తాడు. మరో దర్శకుడు యాక్షన్ చిత్రాలే తీస్తాడు. ఇంకొకరు కామెడి ఎంటర్టైనెర్స్ కి కేరాఫ్ అవుతారు. కానీ ఓ దర్శకుడు మాత్రం కెరీర్ మొదట్నుంచి ఊర మాస్ సినిమాకి కేరాఫ్ అయ్యాడు. క్లాస్, స్టైలిష్ గా కనిపించే హీరోల్ని కూడా తన సినిమాలతో ఓ రేంజ్ మాస్ ఇమేజ్ ని తీసుకురాగల దర్శకుడతను. అతనే “బోయపాటి శ్రీను”. చూడ్డానికి క్లాసీ లుక్ తో కళ్లద్దాలు పెట్టుకుని స్టైల్ గా కనిపించినా, తన మాస్ సినిమాలతో ఊర మాస్ డైరెక్టర్ గా, మాస్ ప్రేక్షకుల్ని మెప్పిస్తూ ఆడియన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్ ఇతను. ఒక సినిమాలో తెరనిండా రక్తంపారించినా, ఫ్యామిలీ ఎమోషన్స్‌ కి పెద్ద పీట వేసినా, ఈ రెండింటి మధ్య ప్రేమని జోడించినా అది బోయపాటి శ్రీనుకే చెల్లింది. కయర్షియల్ ఫార్మాట్‌లో, మాస్ జనాలను మెప్పించేలా సినిమాలు తీస్తూ “అఖండ” చిత్ర విజయాలు సాధిస్తున్న బోయపాటి శ్రీను బర్త్ డే ఈరోజు. ఈ సందర్బంగా ఆయనకి ఫిల్మీ ఫై తరపున బర్త్ డే విషెస్ అందచేస్తూ బోయపాటి మూవీ జర్నీ పై ఓ లుక్కేద్దాం..

స్టార్స్ తోనే సినిమాలు..

సినిమాలపై ప్యాషన్ తో గుంటూరు నుండి ఇండస్ట్రీ కి వచ్చిన బోయపాటి శ్రీను యొక్క కుటుంబానికి ఫొటో స్టూడియో ఉండటం వల్ల సినీ పరిశ్రమ వైపు ఆసక్తిని కనబరిచారు. ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో కొన్నాళ్లపాటు పాత్రికేయుడిగా పనిచేశారు. ఇక ప్రముఖ దర్శకులు ముత్యాల సుబ్బయ్య దగ్గర 1997 నుండి కొన్నేళ్లు దర్శకత్వ శాఖలో పని చేసారు. ‘ఒక చిన్న మాట’, ‘గోకులంలో సీత’, ‘పెళ్ళి చేసుకుందాం’, ‘అన్నయ్య’ వంటి చిత్రాలకి సహాయ దర్శకుడిగా పనిచేశారు బోయపాటి. ఆ తర్వాత రవితేజ ‘భద్ర’ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రమే ఘన విజయం సాధించగా, అప్పటినుండే స్టార్స్ తో సినిమాలు చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత వెంకటేష్‌తో ‘తులసి’, బాలకృష్ణ తో ‘సింహా’, లెజెండ్, అల్లు అర్జున్ తో సరైనోడు వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టాడు. మధ్యలో ‘దమ్ము’, ‘జయ జానకి నాయక’, ‘వినయ విధేయ రామ’ వంటి సినిమాలతో పరాజయాన్ని అందుకున్నా బాలయ్య తో అఖండ సినిమాతో ఊర మాస్ కం బ్యాక్ ఇవ్వడమే కాకుండా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి, ఇప్పుడు అఖండ 2 కూడా తీయబోతున్నాడు.

హీరోయిజానికి కేరాఫ్ బోయపాటి సినిమాలు..

ఇక టాలీవుడ్ లో స్టార్ దర్శకుల్లో హీరోలని ఒక్కో దర్శకుడు ఒక్కోలా చూపించగలడు. రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులు ఎమోషన్స్ తో కూడిన వైవిధ్యంతో హీరోలకి హీరోయిజాన్ని తీసుకొస్తారు. త్రివిక్రమ్, పూరి జగన్నాథ్ వంటి దర్శకులు తమ పదునైన డైలాగ్స్ తో హీరోలని స్టైలిష్ గా ఎలివేట్ చేస్తారు. అయితే బోయపాటి శ్రీను (HBD BoyapatiSrinu) శైలి మరోలా ఉంటుంది. తాను చేసే హీరోలతో ఎమోషన్స్, యాక్షన్స్, ఫ్యామిలీ విలువలతో పాటు, భారీ ఫైట్స్ ని కూడా సమపాళ్లలో చూపిస్తూ సినిమాలు రూపొందించగల దర్శకుడీయన. చేసే ప్రతీ సినిమాను, అందరికి నచ్చేలా సినిమా బాగుండాలని తాపత్రయపడే దర్శకులలో బోయపాటి ముందుంటాడు. ముఖ్యంగా బాలయ్యతో సినిమా అంటే చాలు ఎక్కడ లేని ఊపొచ్చేస్తుంది బోయపాటికి. వీళ్ళ కాంబో మాత్రం అందరికి ఫేవరేట్. మాస్‌ నాడి తెలిసిన ఈ దర్శకుడి క్లైమాక్స్ అంటే ఫ్యాన్స్ కి చాలా ఇష్టం. మన వైపు కొందరు ఆడియన్స్ రొటీన్ అంటుంటే నార్త్ లో మాత్రం బోయపాటి సినిమాలు యూట్యూబ్ లో ఎగబడి చూస్తారంటే బోయపాటి సినిమా స్టైల్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఓవరాల్ గా క్లాసీ గా కనిపించే ఊర మాస్ డైరెక్టర్ ఆయన. ప్రస్తుతం బాలయ్య తో అఖండ 2 చిత్రాన్ని తెరకెక్కించే పనుల్లో ఉన్నారు బోయపాటి శ్రీను.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు