Happy Birthday: రచనా తపస్వి… తనికెళ్ళ భరణి

టాలీవుడ్ లో అన్ని రంగాల్లోనూ ఆరితేరినవారు చాలా తక్కువ మంది ఉంటారు. దాసరి నారాయణరావు, ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి దర్శక నటులు ఈ కోవలోకే వస్తారు. అయితే ఇండస్ట్రీ పెద్దగా గుర్తించని మరో గొప్ప రచయిత కూడా ఉన్నాడు. ఆ వ్యక్తి కొన్నేళ్ల వరకు మనకు నటుడిగానే పరిచయం. కానీ ఎప్పుడైతే “నాన్నెందుకో వెనుకబడ్డాడు” అనే కవిత వైరల్ అయ్యిందో ఆరోజు నుండి ఈ జనరేషన్ ప్రేక్షకులకి ఆయన రచనా గొప్పదనం, కవితా శక్తి గురించి తెలిసివచ్చింది.

ఆయనెవరో కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి “తనికెళ్ళభరణి”. అవును… నటుడుగా, దర్శకుడిగానే కాకుండా రచయితగా కూడా చాలా సినిమాలకు పని చేసారు తనికెళ్ళ భరణి. ఈరోజు తనికెళ్ళ భరణి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకి “filmify” టీమ్ తరపున బర్త్ డే విషెస్ తెలియచేస్తూ తనికెళ్ళభరణి గురించి కొన్ని విశేషాలని తెలుసుకుందాం.

నటుడు రాళ్ళపల్లి నరసింహారావు సహకారంతో సినిమాల్లోకి రచయితగా ప్రవేశించిన భరణి “లేడీస్ టైలర్” చిత్రంతో మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన “శివ” సినిమాకి మాటలు రాయడమే కాకుండా, నటుడిగాను ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత దాదాపు 60 కి పైగా సినిమాలకు రచనా సహకారం అందించాడు. ఇక ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన యమలీల సినిమాలో “తోట రాముడు” అనే కామెడీ విలన్ పాత్రతో నటుడుగాను సూపర్ సక్సెస్ అయ్యాడు.

- Advertisement -

అక్కడినుండి నటుడిగా ఎక్కువ బిజీ కావడంతో కొన్నాళ్ల పాటు రచయితగా దూరమయ్యాడు. దాదాపు 200కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన పలువురు స్టార్ హీరో, హీరోయిన్లకి తండ్రిగాను, మామగాను, బాబాయ్ గాను మంచి పాత్రలు వేశారు. ఇవే గాక గబ్బర్ సింగ్, రాజా ది గ్రేట్ వంటి సినిమాల్లో విలన్ ల పక్కన అడ్వైజర్ గా ఉన్న పాత్రలు వేశారు. అయితే ఎన్ని సినిమాలు చేసినా “సముద్రం” సినిమాలో చేసిన ప్రతినాయక పాత్ర మాత్రం తనికెళ్ళ భరణి ని ఓ రేంజ్ లో నిలబెట్టింది. ఈ సినిమాకు బెస్ట్ విలన్ గా నంది అవార్డు సైతం గెలుచుకున్నారు.

ఇక తణికెళ్లభరణి కవిగాను ఎంతో సక్సెస్ అయ్యారు. ఆయన రచించిన “ఆటగదరా శివ”, “శభాష్ శంకరా” అనే పుస్తకాలు కవిగా ఎన్నో మెట్లు ఎక్కించాయి. ఇక భరణి రచించిన “నాలోని శివుడు గలడు” పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఏ శివాలయంలో మైక్ పెట్టినా, ఈ పాటే ముందు వినబడుతుంది.

ఇక తనికెళ్ళభరణి తెలంగాణా యాసలో మాటలు రాయడంలోనూ, డైలాగులు చెప్పడంలోనూ సిద్ధహస్తుడు. ఆనాటి శివ నుండి మొన్నటి జాతిరత్నాలు వరకు ఎన్నో సినిమాల్లో భరణి నైజాం యాసలో మాట్లాడి అదరగొట్టాడు. రీసెంట్ గా మణిరత్నం తెరకెక్కించిన “PS2” చిత్రానికి సంభాషణలు రాసారు తనికెళ్ళ భరణి.

ఇక చివరగా తణికెళ్లభరణికి అన్ని రకాలుగానూ టాలీవుడ్ లో గౌరవం తెచ్చిపెట్టిన సినిమా “మిథునం”. లెజెండరీ సింగర్ స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మాణ్యం, నటి లక్ష్మీ ప్రధానపాత్రల్లో తణికెళ్లభరణి దర్శకత్వం వహించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు, ఎన్నో అవార్డులు, రివార్డులని సాధించి పెట్టింది. అయితే తనకు రచయితగా ఇప్పటికీ నిరూపించుకునే అవకాశం పూర్తిగా రాలేదని తణికెళ్లభరణి పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. పెద్ద సినిమాల్లో మంచి అవకాశం వస్తే తన రచనా శక్తి ఏంటో చెప్తానని అన్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు