Sandeep Reddy Vanga : చైనాలో వీళ్లకు మంచి బిజినెస్… బాలీవుడ్ క్రిటిక్స్ కు ఇచ్చి పడేసిన డైరెక్టర్

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ “యానిమల్” బాక్స్ ఆఫీస్ ను చీల్చి చెండాడిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమాకు విమర్శకుల నుంచి మాత్రం నెగిటివ్ రియాక్షన్ వచ్చింది. తాజాగా కొంతమంది రివ్యూవర్స్ పై సందీప్ రెడ్డి వంగా ఫైర్ అయ్యారు. తనదైన శైలిలో బాలీవుడ్ క్రిటిక్స్ కు ఇచ్చి పడేశారు. ఇంతకీ సందీప్ రెడ్డి ఏమన్నాడంటే?

“యానిమల్” సినిమాలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. తండ్రిని రక్షించుకునేందుకు ఏం చేయడానికి అయినా వెనకాడని కొడుకుగా రణబీర్ పోషించిన పాత్ర ప్రేక్షకులకు థియేటర్లలో మంచి కిక్ ని ఇచ్చింది. ఇక ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో, ఇండస్ట్రీలో అంతే పెద్ద చర్చకు దారి తీసింది. “యానిమల్” మూవీపై పలువురు విమర్శకులు విమర్శల వర్షం కురిపించారు. ఈ మూవీ సమాజానికి చేటు చేస్తుందని, హింస, విచ్చలవిడితనం హద్దులు దాటిన ఒక పనికిమాలిన మూవీ అంటూ కొందరు క్రిటిక్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ప్రేక్షకులపై వీళ్ల వ్యాఖ్యలు ఎలాంటి ఎఫెక్ట్ ను చూపించలేకపోయాయి. మొత్తానికి ఈ మూవీ విడుదలైన 20 రోజుల్లోనే 830 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టడం చూస్తుంటేనే “యానిమల్” ప్రేక్షకులకు ఎంతగా నచ్చేసిందో అర్థమవుతుంది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కొందరు విమర్శకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బాలీవుడ్ కు చెందిన క్రిటిక్స్ పై ఫైర్ అవుతూ పలువురు పేర్లను ప్రస్తావించి మరీ వాళ్ళు సినిమా విషయంలో నిరక్షరాస్యులు అంటూ మండిపడ్డారు. ఆ రివ్యూవర్స్ క్రాఫ్ట్, సౌండ్ డిజైన్, ఎడిటింగ్ వంటి వాటి గురించి మాట్లాడలేదని, ఎందుకంటే వాళ్లకు సినిమాను విశ్లేషించేంత జ్ఞానం లేదని చురకలు అంటించారు. ఇక ముంబైలో ఉన్న ఒక క్రిటిక్స్ గ్యాంగ్ కొందరి సినిమాలనే ప్రశంసిస్తుందని, మిగతా వాళ్ళ సినిమాలను మాత్రం రివ్యూల పేరుతో చీల్చి చెండాడుతారు అంటూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. అంతేకాకుండా ఆ రివ్యూవర్స్ ఇంగ్లీషులో చాలా కొత్త కొత్త పదాలను వాడతారని, ఆ జ్ఞానంతో వాళ్ళు చైనాకు వెళ్తే అక్కడ మంచి బిజినెస్ జరుగుతుందని సెటైర్ వేశారు. చైనాకే ఎందుకు అనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. చైనాలో ఇంగ్లీష్ కు బాగా డిమాండ్ ఉంటుందని, అక్కడివాళ్లు ఇంగ్లీష్ ట్యూషన్లకు బాగా ఇంపార్టెన్స్ ఇస్తారని, మనీ కూడా బాగా పే చేస్తారు. కాబట్టి అదొక మంచి మనీ మేకింగ్ బిజినెస్, వీళ్లకు కలిసి వస్తుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. దీంతో “యానిమల్” మూవీపై కావాలని నెగిటివ్ రివ్యూస్ ఇచ్చిన బాలీవుడ్ క్రిటిక్స్ కు సందీప్ రెడ్డి నుంచి వచ్చిన ఈ రియాక్షన్ చెంపపెట్టులా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు