NTR: శక పురుషుడికి వందేళ్లు

నందమూరి తారక రామారావు.. ఈ పేరే ఒక సంచలనం. తెలుగు సినీ,రాజకీయ చరిత్రలో ఒక ప్రభంజనం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. అన్న నిర్వచనం ఈయనకే చెందుతుంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమను మూడు దశాబ్దాల పాటు ఏలిన ఈ నట సార్వభౌముడు, రాజకీయాల్లోనూ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకి సేవలనందించారు. మే 28 NT రామారావు జయంతి. ఈ సందర్భంగా filmify టీమ్ తరపున నందమూరి కుటుంబసభ్యులకు ఆయన అభిమానులకు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఎన్టీఆర్ గురించి కొన్ని ప్రత్యేక విషయాలను తెలుసుకుందాం.

నందమూరి తారక రామారావు 1923 మే 28న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, పామర్రు మండలం, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకటరామమ్మ దంపతులకు జన్మించారు. ఎన్టీఆర్ 1942 లో తన20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్ళి చేసుకున్నారు. తారక రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. పదకొండు మందిలో ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా, గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు.

ఇక ఎన్టీఆర్ సినీరంగ ప్రవేశం విషయానికి వస్తే 1947లో ఆయన మంగళగిరి లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఉద్యోగం సంపాదించాడు. అయితే సినిమాల్లో చేరాలనే కోరికతో జాబ్ వచ్చిన మూడు వారాలకే ఆ దానికి స్వస్తి చెప్పి మద్రాసు వచ్చాడు. అలా 1949 లో LV ప్రసాద్ దర్శకత్వంలో మనదేశం అనే సినిమాలో చిన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఆ చిత్ర నిర్మాత, మరియు కథానాయిక అయిన కృష్ణవేణి ఎన్టీఆర్ ను నటుడిగా పరిచయం చేశారు. ఇక ఆ తర్వాత విడుదలైన పల్లెటూరి పిల్ల, షావుకారు చిత్రాలు ఎన్టీఆర్ కు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. 1951 లో వచ్చిన “పాతాళ భైరవి” చిత్రం ద్వారా ఎన్టీఆర్ ఒక స్టార్ హీరోగా వెలుగొందాడు.

- Advertisement -

NTR తీసుకున్న మొదటి పారితోషకం 1,116 లు. ఇది ఆయన నటించిన “పల్లెటూరి పిల్ల” చిత్రానికి తీసుకోవడం జరిగింది. ఇక 1957లో విడుదలైన “మయా బజార్” చిత్రానికి గాను ఆయన అత్యధిక పారితోషకంగా 7500 తీసుకున్నారు . అప్పట్లో ఇది చాలా పెద్ద మొత్తం.

“విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు”గా, “ఎన్టీవోడు” గా అభిమానుల చేత మన్ననలు పొందిన ఎన్టీఆర్ 44 ఏళ్ళ సినిమా జీవితంలో ఎన్.టి.ఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు చేసారు. ఇక 1968 భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు. అంతే కాదు పౌరాణికాలు పెట్టింది పేరైన ఆయన 100కు పైగా పౌరాణిక పాత్రలు చేశారు. 1993 లో వచ్చిన శ్రీనాథ కవిసర్వభౌముడు ఆయన నటించిన చివరి సినిమా.

ఎన్టీఆర్ ఇటు సినిమాల్లోనే గాక రాజకీయాల్లోనూ అద్భుతమైన విజయాలు సాధించారు. 1982 లో మార్చిలో తెలుగు దేశం పార్టీ పెట్టిన ఆయన కేవలం 9నెలల కాలంలోనే ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆ రోజుల్లోనే 199 స్థానాల్లో టిడిపి గెలవడం విశేషం.

ఇక ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ పదవి చేపట్టిన తర్వాత చేసిన ముఖ్యమైన పనుల్లో ఇవి చెప్పుకోదగ్గవి.
*స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత రామారావుదే.
*రెండు రూపాయలకే కిలో బియ్యం తెలుగు రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది.
*తెలంగాణాలో బడుగు బలహీనవర్గాలని పట్టి పీడుస్తున్న పటేల్ పట్వారి వ్యవస్థ లని రద్దు చేసి తెలంగాణా ప్రజలకి చాలా మేలు చేసారు.

మూడు దశాబ్దాల సినీ జీవితంలోను, పదేళ్ల రాజకీయ జీవితంలోను నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్.. 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం ఆయన నట వారసులుగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ స్టార్ లు గా కొనసాగుతున్నారు. తెలుగుజాతికీ, తెలుగుభాషకూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు