Aamir khan: నేనెప్పుడూ అలా చేయలేదు.. పోలీసులను ఆశ్రయించిన అమీర్ ఖాన్

Aamir khan: ప్రస్తుతం దేశంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇక్కడ చూసినా ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. దశలవారీగా ఎన్నికలు జరుగుతుండడంతో పలు రాష్ట్రాలలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎండలను సైతం లెక్కచేయకుండా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ సమయంలోనే సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలా నటుడు అమీర్ ఖాన్ కి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. ఓ పార్టీని ప్రమోట్ చేస్తున్నట్టు కనిపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నట్లు ఉంది.

దీనిపై తాజాగా ఆయన స్పందించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, తాను ఏ పార్టీని ప్రమోట్ చేయడం లేదని స్పష్టం చేశారు. తన 35 ఏళ్ల జీవితంలో ఏ రాజకీయ పార్టీని ఎన్నడూ ఆమోదించలేదని అన్నారు. అమీర్ ఖాన్ అధికార ప్రతినిధి ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ” అమీర్ ఖాన్ ఓ పార్టీని ప్రమోట్ చేస్తున్నట్టు వచ్చిన వీడియో చూసి మేమందరం అప్రమత్తం అయ్యాం. అది పూర్తి నకిలీ వీడియో. ఈ వీడియో పై మేము ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాం.

ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యింది. 2024 లోక్సభ ఎన్నికల కోసం అమీర్ ఖాన్ ఓ సందేశం ఇచ్చారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని.. ఎన్నికలలో చురుకుగా ఉండాలని అన్నారు. ఆ వీడియోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసి వైరల్ గా మార్చారు. భారతీయులంతా బయటకు వచ్చి ఎన్నికలలో ఓటు వేయాలని, ఎన్నికల ప్రక్రియలో భాగం కావాలని మాత్రమే అమీర్ ఖాన్ కోరుతున్నారు” అని ఆయన తరపున ప్రతినిధి తెలిపారు. ఇక అమీర్ ఖాన్ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం “సితారే జమీన్ పర్” సినిమాలో నటిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు