Inferiority Complex in Child : పిల్లల్లో ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఎందుకు వస్తుందో తెలుసా?

Inferiority Complex in Child : పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు పెద్దలు. ఎందుకంటే అసూయ, ద్వేషం వంటి భావాలేవీ వాళ్లలో ఉండవు. అబద్ధాలు చెప్పడం తెలీదు .స్వచ్ఛమైన మనసుతో ఉంటారు కాబట్టే పిల్లలను దేవుళ్లతో పోలుస్తారు. అయితే కొంతమంది పిల్లలు కావలసినంత ఆత్మవిశ్వాసంతో పెరుగుతారు. మరికొంత మంది పిల్లల్లో మాత్రం కాన్ఫిడెన్స్ తగ్గి ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను పెంచేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు. దాని కారణంగా పిల్లలు చాలా బాధలు పడతారు. దీనివల్ల పిల్లల్లో ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌ తలెత్తుతుంది. పిల్లల చెడు ప్రవర్తన అనేది ఏ తల్లిదండ్రులకూ నచ్చదు. అదే సమయంలో పిల్లలకు ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే, అది పేరెంట్స్ కు కూడా ఇబ్బందులను తెచ్చి పెడుతుంది. ప్రేమ, ఉత్సాహంతో ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పిల్లలలో ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరగడానికి అనేక కారణాలు ఉండవచ్చు. అసలు ఎందుకిలా జరుగుతుంది? తల్లిదండ్రుల అలవాట్లు దీనికి కారణమా లేదా పెంపకంలో లోపం వల్లనా? అంటే…

1.తల్లిదండ్రులపై నమ్మకం లేకపోవడం

పెరుగుతున్న పని భారం, లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది ప్రజలు ఒత్తిడితో జీవితాన్ని నెట్టుకు వస్తున్నారు. అలాగే జీవితంలో సమస్యలను ఎదుర్కోవడం కూడా సర్వ సాధారణం. ఈ సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పేరేంట్స్ తమ పిల్లల ముందు కోపంగా కనిపిస్తే, అది వాళ్ళ మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. పేరెంట్స్ పై నమ్మకాన్ని కోల్పోతారు. తల్లిదండ్రులే పిల్లలకు ఆదర్శం. పేరెంట్స్ లో ఆత్మవిశ్వాసం లేకపోవడం కూడా పిల్లలను బలహీనపరుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే పిల్లల్లో ఏదైనా విషయం లేదా వ్యక్తి పట్ల ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ తెలియకుండానే పెరగడం స్టార్ట్ అవుతుంది,

2. నెగెటివ్ విషయాలు చెప్పడం

ప్రతికూల అంశాలు పిల్లల మనస్సులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పిల్లల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసే పదాలను ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఇలా కాకుండా పదే పదే స్నేహితుల ముందు మీ పిల్లల గురించి చెడుగా మాట్లాడితే అది వాళ్లలో కోపాన్ని పెంచుతుంది.

- Advertisement -

3. ఇతర పిల్లలతో పోల్చవద్దు

దాదాపు ప్రతి పేరెంట్‌కి తమ పిల్లలను ఇరుగు పొరుగు పిల్లలతో పోల్చే అలవాటు ఉంటుంది, తల్లిదండ్రులకు ఉన్న ఈ అలవాటు పిల్లల మనోభావాలను దెబ్బ తీస్తుంది. పిల్లలు ఎవరికి వారే ప్రత్యేకం. ప్రతి ఒక్కరిలోనూ డిఫరెంట్ ట్యాలెంట్ ఉంటుంది. కాబట్టి మీ పిల్లలను ఎవరితోనూ పోల్చకండి. పోలికలు పెట్టడానికి బదులుగా వారిని వారిలాగే ఎదగనివ్వండి.

4. తిట్టడం మానుకోండి

తల్లిదండ్రులు తమ పిల్లలను పనికిరానివారు, స్వార్థపరులు లేదా మూర్ఖులు అని ముద్ర వేయడం ప్రారంభించినప్పుడు, అది పిల్లల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. దీంతో తాము ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని భావిస్తారు. కోపంతో పేరెంట్స్ అనే చిన్న మాట కూడా పిల్లల హృదయాన్ని గాయపరుస్తుంది.

5. ఆట పట్టించడం

పిల్లలు తమ తోటి పిల్లల నుండి బెదిరింపు లేదా ఆటపట్టించడం వంటి వాటిని ఎదుర్కొంటారు. ఇతర పిల్లలు అతని రూపం, తెలివితేటలు లేదా అతని సామాజిక స్థితి గురించి ఆట పట్టించవచ్చు. ఇది పిల్లల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. వాళ్లలో న్యూనతా భావాన్ని సృష్టిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు