సీరియల్ యాక్టర్ గా స్టార్ట్ అయిన రాకింగ్ స్టార్ యష్ కెరీర్.. పాన్ ఇండియా స్టార్ వరకు వచ్చింది. కేజీఎఫ్-1 తో ఈ మార్కెట్ లోకి అడుగు పెట్టిన యష్ కు కేజీఎఫ్-2 తో ఒక్క సారిగా ఫుల్ క్రేజ్ వచ్చింది. దేశం మొత్తం కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా చేసింది. బాలీవుడ్ స్టార్స్ అసూయ పడేలా.. భారత చలన చిత్ర పరిశ్రమ మొత్తం రాకీ భాయ్ కి సలాం చేస్తుంది. యష్ ధాటికి వేసవికి విడుదల చేయాల్సిన సినిమాలు అన్నీ వాయిదా పడ్డాయి. ఇప్పటికే కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా జోష్ ఇప్పట్లో తగ్గేలా లేదు.
కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రాకింగ్ స్టార్ యష్ నెక్ట్స్ సినిమా ఎవరితో.. అనే ప్రశ్న అందరిలో వస్తుంది. మళ్లీ పాన్ ఇండియా రేంజ్ లో సినిమా చేస్తాడా..? లేదా.. బాలీవుడ్ డైరెక్టర్స్ తో తీస్తాడా..? టాలీవుడ్ దర్శకులతో ఉండొచ్చా.. ? అని రాకీ భాయ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే యష్ తర్వాతి సినిమా గురించి ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్ మాత్రం రాలేదు. కానీ త్వరలో.. టాలీవుడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేతులు కలుపబోతున్నట్టు సమాచారం. బోయపాటి.. గతంలో రామ్ చరణ్ కోసం యాక్షన్ థ్రిల్లర్ స్టోరీ సిద్ధం చేశాడని వార్తలు వచ్చాయి. అయితే చరణ్.. ఈ స్టోరీని కాదని వినయ విధేయ రామ ను సెలెక్ట్ చేసుకున్నాడు. దీంతో ఆ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీని యష్ కు అనుకూలంగా మార్చే పనిలో బోయపాటి ఉన్నట్టు తెలుస్తుంది. ఈ స్టోరీతో యష్ పాన్ ఇండియా సినిమా చేయనున్నట్టు ఇండస్ట్రీ టాక్.
అలాగే పూరీ జగన్నాథ్ కూడా రాకింగ్ స్టార్ తో సినిమా చేయడానికి ట్రై చేస్తున్నాడట. యష్ కోసమే జనగణమన స్టోరీని రెడీ చేశాడట. కానీ దీన్ని చివరికి విజయ్ దేవరకొండ చేస్తున్నాడు. అయితే పూరీ.. యష్ కోసం మరో ఇంట్రెస్టింగ్ లైన్ తో కలవడానికి సిద్ధంగా ఉన్నాడట. అలాగే బాలీవుడ్ లో కూడా పలువురు డైరెక్టర్లు.. యష్ కు కథను వినిపించడానికి ప్రయత్నిస్తున్నారని బీ టౌన్ టాక్.
అయితే యష్ మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తున్నాడట. గతంలో ప్రభాస్ కూడా బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నా.. తర్వాతి సినిమాలతో స్టార్ డమ్ కాస్త తగ్గింది. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ నెగెటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రభాస్ ఆలోచించి స్టోరీలు ఎంచుకుంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదని సినీ క్రిటిక్స్ అంటున్నారు. కాగ ఇప్పుడు యష్.. ప్రభాస్ కు ఎదురైన అనుభావాలను దృష్టిలో ఉంచుకుని కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. యష్ పయనం ఎటువైపు ఉంటుందో అనే ప్రశ్నకు సమాధానం రావాలంటే… మరి కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.