Ugadi Festival : ఫ్యాన్స్ ఎదురుచూపు.. ఆ రోజు అప్డేట్ల జాతరే..

Ugadi Festival : తెలుగు ప్రజలకు దసరా, సంక్రాంతి వంటి పండగల తో పాటు ఉగాది పండగ కూడా ఎంతో ప్రత్యేకమైనది. ఉగాదితోనే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. అందుకే తెలుగు ప్రజలు అందరూ ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఒక్క తెలుగు వారే కాదు కర్ణాటక లో , మహారాష్ట్ర ప్రాంతాల్లో కూడా గుడి పడ్వా పేరుతో ఈ పండగని జరుపుకుంటారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఈ పండగ కి విశిష్ట స్థానం ఇస్తారు టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్. హీరోల మొదలుకొని దర్శక, నిర్మాతల దాకా అందరూ ఈ పండగ కోసం వెయిట్ చేస్తారు కూడా. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త సినిమాలకి సంబందించిన అప్డేట్స్ ఎన్నో ఉగాది రోజు వస్తుంటాయి. ప్రతి ఏడాది లాగే ఈ ఇయర్ కూడా ఏప్రిల్ 9న ఉగాది పండగ కి చిన్న నుండి పెద్ద సినిమాల అప్డేట్స్, ఫస్ట్ లుక్స్, అలాగే పండగ స్పెషల్ పోస్టర్లు రిలీజ్ కాబోతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న సినిమాల స్పెషల్ పోస్టర్స్, వీడియోలు రిలీజ్ కూడా ఉగాది రోజు ఉంటాయి.

చిరు నుండి చిన్న సినిమాల దాకా..

ఇక ఈ సారి ఉగాది పండగ(Ugadi Festival) రోజున ఏయే సినిమాలకి సంబందించిన అప్డేట్స్ వచ్చే అవకాశం ఉందో ఓ సారి చూసుకుంటే ముందుగా మెగాస్టార్ చిరంజీవి నుండి మొదలు పెట్టాలి. చిరంజీవి హీరోగా వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో చేస్తున్న ‘విశ్వంభర‘ నుంచి ఒక చిన్న గ్లింప్స్ ని ఉగాది సందర్భంగా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంట. అలాగే చిరంజీవి హీరోగా సుస్మిత కొణెదల, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించే సినిమాకి సంబంధించి అప్డేట్ రావొచ్చని టాక్ వినిపిస్తోంది. ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రెడీ అవుతోన్న సినిమా నుండి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోయే అఖండ సీక్వెల్ పై అఫీషియల్ అప్డేట్ కూడా ఉగాది రోజు రావొచ్చని అంటున్నారు. అయితే బాలయ్య పండగలకి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడు కాబట్టి ఇవి కాకపోయినా ఏ సినిమా అప్డేట్ అయినా రావొచ్చని భావిస్తున్నారు ఫ్యాన్స్. హరీష్ శంకర్ దర్శకత్వంలో బాలయ్య సినిమాపై అఫీషియల్ కన్ఫర్మేషన్ పోస్టర్ వస్తుందని సమాచారం. ఇక నాగార్జున, వెంకటేష్ కొత్త సినిమాల అనౌన్స్ మెంట్ ఉగాది రోజు ప్రకటించే అవకాశం ఉంది. సోగ్గాడే చిన్ని నాయన సిరీస్ లో పార్ట్ ౩ పైన కూడా ఉగాది రోజున కన్ఫర్మేషన్ రావొచ్చని టాక్. వెంకటేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో మూవీ కన్ఫర్మ్ కాగా, సంక్రాంతికి వస్తున్నాం వర్కింగ్ టైటిల్ తో ఉగాది రోజున అనౌన్స్ మెంట్ ఉండొచ్చు.

స్టార్ హీరోల సప్రైజ్ కోసం ఫ్యాన్స్ రెడీ..

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల నుండి కొత్త పోస్టర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుండి ప్రత్యేకమైన పోస్టర్ దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడట. ఇక బుచ్చిబాబు రామ్ చరణ్ సినిమా టైటిల్ అనౌన్స్ కూడా చేసే ఛాన్స్ ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా నుంచి ఉగాది విషెస్ పోస్టర్స్ రావొచ్చని టాక్. ఇక మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్టుపై కూడా ఆ పండగ రోజు ఏదైనా అప్డేట్ ఇస్తారా అని ఫ్యాన్స్ అయితే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచరస్ గా రూపొందనుందని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. సమ్మర్ అనంతరం రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ కల్కి2898AD నుండి ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ కానుందట. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున కాంబినేషన్ లో వస్తున్న కుబేర మూవీ అప్డేట్ కూడా రానుంది. ఇవే కాకుండా మీడియం రేంజ్ హీరోలైన నాని, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, నిఖిల్, సిద్ధూ జొన్నలగడ్డ, వరుణ్ తేజ్ లాంటి హీరోల కొత్త సినిమాల అప్డేట్స్ కూడా ఉగాది రోజు వచ్చే ఛాన్స్ ఉంది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు