Tollywood: యంగ్ హీరోల కోసం డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్న నిర్మాతలు… వీళ్లతో రిస్క్ అవసరమా?

సినిమాలు తీస్తున్నప్పుడు నిర్మాతలు బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా హీరోల మార్కెట్ ను బట్టి సినిమాకు బడ్జెట్ ను కేటాయించడానికి రెడీ అవుతారు. కానీ తాజాగా టాలీవుడ్ లో రివర్స్ ట్రెండ్ మొదలైంది. కొంతమంది యంగ్ హీరోల విషయంలో వాళ్ళ మార్కెట్ తో సంబంధం లేకుండా డబుల్ బడ్జెట్ ను ఖర్చు పెట్టడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. ముఖ్యంగా అసలు ఫామ్ లో లేని నాగచైతన్య, అఖిల్, నాని వంటి హీరోల విషయంలో నిర్మాతలు చేస్తున్న రిస్క్ ను సాహసం అనే చెప్పాలి. మరి వీళ్ళు కథను నమ్ముతున్నారా? లేదంటే డైరెక్టర్, హీరోలపై అంత నమ్మకమా అనేది తెలీదు. కానీ ఈ కొత్త ట్రెండ్ గురించి మాత్రం మాట్లాడుకోవాల్సిందే. ఇంతకీ మిడ్ రేంజ్ హీరోల విషయంలో నిర్మాతలు రిస్క్ తీసుకుంటున్న సినిమాలు ఏంటి? ఆ హీరోలు ఎవరు? అనే వివరాల్లోకి వెళితే…

1. అఖిల్.
అఖిల్ గత చిత్రం “ఏజెంట్” అక్కినేని ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశకు గురి చేసింది. దీంతో కొంతకాలం గ్యాప్ ఇచ్చిన అఖిల్ ఇప్పుడు యువి క్రియేషన్స్ బ్యానర్‌తో భారీ బడ్జెట్ మూవీ కమిట్ అయ్యాడు. అది కూడా కొత్త డైరెక్టర్ తో. ‘ఏజెంట్’ సినిమా బ్యాడ్ రిజల్ట్ కారణంగా అఖిల్ తన నెక్స్ట్ మూవీని ఫిక్స్ చేయడానికి చాలా ఆలోచించాడు. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్ మూవీ అంటే ప్రస్తుతం అఖిల్ కు ఉన్న మార్కెట్ ప్రకారం ఆ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా నిర్మాతలు మునిగిపోవడం ఖాయం. మీడియం రేంజ్ బడ్జెట్ అంటే నిర్మాతలు కొంత సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అఖిల్ కోసం బిగ్ బడ్జెట్ మూవీ చేయడానికే నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ పేపర్‌లోనే 80 కోట్లకు పైగా ఉంటుందని, షూటింగ్ పూర్తయ్యే నాటికి 100 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ చిత్రం 2024 వేసవి ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. అఖిల్ పై మరీ ఈ రేంజ్ లో బడ్జెట్ పెట్టడమే రిస్క్ అనుకుంటూ ఉంటే, ఆయన కెరీర్ ను ఓ కొత్త దర్శకుడి చేతిలో పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అన్ని చర్చించుకుంటున్నారు అక్కినేని ఫ్యాన్స్.

2. నాగ చైతన్య
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. ఫస్ట్ లుక్ తోనే ఈ మూవీపై ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి పెరిగింది. మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న తండేల్ మూవీని టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మూవీని అలా అనౌన్స్ చేసారో లేదో ఇలా హైప్ పెరిగిపోయింది. ఈ మూవీ బడ్జెట్ చేయి దాటి పోతుందని ఫిలింనగర్ లో టాక్ నడుస్తోంది. తండేల్ మూవీకి ముందుగా 60 నుంచి 70 కోట్లు బడ్జెట్ గా అనుకున్నారట. కానీ ఇప్పుడు చూసుకుంటే కేవలం అంచనా ప్రకారమే 100 నుంచి 110 కోట్ల దాకా అవుతోందట. అంటే సినిమా పూర్తయ్యేలోపు ఈ బడ్జెట్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీంతో మిడ్ రేంజ్ బడ్జెట్ మూవీ కాస్తా హై రేంజ్ బడ్జెట్ మూవీగా మారిపోయింది. అయితే నాగ చైతన్య మార్కెట్ చూసుకుంటే మేకర్స్ రిస్క్ చేస్తున్నట్టే. నాగ చైతన్య గత చిత్రం కస్టడీ ఓవరాల్ గా చూసుకుంటే దాదాపు 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే జరిగింది. అయితే ఆ మూవీ అందులో సగాన్ని కూడా రాబట్టుకోలేకపోయింది. దీంతో నిర్మాతలు భారీగా నష్టాలు చవిచూడగా తప్పలేదు. మరి ఇలాంటి తరుణంలో గీతా ఆర్ట్స్ వారు నాగ చైతన్యపై ఏకంగా 100 కోట్లు పెట్టుబడిగా పెట్టడం పెద్ద రిస్క్ అని చెప్పొచ్చు.

- Advertisement -

3. నాని
నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా “సరిపోదా శనివారం” మూవీ బడ్జెట్ చేయి దాటిపోయినట్టు తెలుస్తోంది. మూవీకి అనుకున్న బడ్జెట్ ఒకటైతే, పూర్తయ్యేలోపు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ ఖర్చయిందని తెలుస్తోంది. నాని ప్రస్తుతం “సరిపోదా శనివారం” అనే మూవీతో బిజీగా ఉన్నారు. తన కెరీర్లో 31వ చిత్రంగా రూపొందుతున్న “సరిపోదా శనివారం” మూవీని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేస్తున్నాడు నాని. ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 90 కోట్లు ఖర్చు చేస్తున్నారనే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. నిజానికి ఈ మూవీ ఆన్ పేపర్ బడ్జెట్ 50 కోట్లేనట. కానీ తీరా సినిమా మొదలు పెట్టాక వీఎఫ్ఎక్స్ కోసం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. మొత్తానికి అనుకున్న బడ్జెట్ కంటే సరిపోదా శనివారం మూవీకి డబుల్ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చిందట నిర్మాతలకు. మొత్తానికి 50 కోట్లు అనుకుంటే ఈ మూవీ బడ్జెట్ 90 కోట్ల వరకు చేరిందని తెలుస్తోంది. ఇక ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకొని రౌండ్ ఫిగర్ 100 కోట్లు అవుతుందన్నమాట “సరిపోదా శనివారం” మూవీకి. రీసెంట్ గా వచ్చిన నాని హాయ్ నాన్న మూవీ మొత్తంగా 85 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. సరిపోదా శనివారం మూవీకి అంతకంటే డబుల్ రాబడితేనే గానీ లాభాల్లోకి అడుగు పెట్టరు బయ్యర్లు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు