Sundaram Master Movie Review Rating: సుందరం మాస్టర్ రివ్యూ

కమెడియన్స్ హీరోలుగా మారి సినిమాలు చేయడం కొత్త విషయం ఏమీ కాదు. ఈ లిస్ట్ చాలా పెద్దదే. అయితే వైవా హర్ష కూడా హీరోగా మారి ‘సుందరం మాస్టర్’ అనే సినిమా చేశాడు. రవితేజ సమర్పణలో రూపొందిన ఈ సినిమాకి శ్వేత కాక‌ర్లపూడి, షాలిని నంబు నిర్మాతలు. కళ్యాణ్ సంతోష్ సంతోష్ దర్శకుడు. మరి సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం రండి…

కథ:
పాడేరు అనే ఊరికి కొంత దూరంలో ఉన్న మిరియాల మిట్ట అనే గూడెం, అక్కడి జనాల జీవన శైలి ఇప్పటి జనరేషన్ కి చాలా దూరంగా ఉంటుంది. అక్కడి జనాలు కూడా చాలా కఠినంగా ఉంటారు. అయినప్పటికీ వాళ్లంతా ఒకే కుటుంబంలా జీవిస్తూ ఉంటారు. ఈ క్రమంలో తన ఊరికి ఇంకొకరిని రానివ్వరు. ఇలాంటి మిరియాల మిట్ట కోసం ఒక ఇంగ్లీష్ మాస్టారు కావాలని లేఖ రావడంతో సుందర్ రావు (హర్ష చెముడు)ను పంపిస్తుంది ప్రభుత్వం. సుందరం మిరియాల మిట్టకి వెళ్లే ముందు ఎం.ఎల్.ఎ(హర్ష వర్ధన్) ని కాలుస్తాడు. అతను ‘మిరియాల మిట్టలో విలువైంది ఏదో ఉందని, అదేంటో కనిపెట్టి చెప్పాలని’ సుందరంకి ఎమ్మెల్యే చెబుతాడు. అలా ఆ ఊరుకి వెళ్లిన సుందరంకి ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. తనకి ఇంగ్లీష్ రాదు అని తెలుసుకున్న ఆ గూడెం జనాలు అతన్ని ముప్పు తిప్పలు పెడతారు? అయితే సుందరం.. ఆ గూడెంకి ఏ పని మీద వెళ్ళాడో.. ఆ పని పూర్తిచేసాడా? ఆ ఊరిలో విలువైంది ఏముంది? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:
దర్శకుడు కళ్యాణ్ సంతోష్ ఈ కథని ముందుగా సినిమాగా తీయాలనుకున్నాడా? లేక వెబ్ సిరీస్ గా తీయాలని అనుకున్నాడా? అనే డౌట్ మొదట్లోనే వచ్చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో కథ లేకపోయినా హర్ష చెముడు కామెడీ టైమింగ్ తో లాంగించేశాడు. సో ఫస్ట్ హాఫ్ సో సోగా అనిపిస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ పై ఇంటర్వెల్లో కంప్లైంట్ కనుక చేస్తే.. ఆ వెంటనే ఫస్ట్ హాఫ్ చాలా బెటర్ అనే ఫీలింగ్ ను సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుండే క్రియేట్ చేశాడు దర్శకుడు. అంటే సెకండ్ హాఫ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అర్ధం పద్దం లేని కామెడీ, అనవసరమైన లవ్ ట్రాక్.. పోనీ దానికి సరైన జస్టిఫికేషన్ ఇచ్చారా? అంటే అదేమీ లేదు. ఎమోషనల్ సీన్స్ ఉన్నా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విధంగా అవి లేవు. సినిమాటోగ్రఫీ, నేపధ్య సంగీతం.. స్టైల్ చూస్తుంటే మనం వెబ్ సిరీస్ చుస్తున్నామా? అనే ఫీలింగ్ కలుగకమానదు. డైలాగులు కూడా షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్..లనే గుర్తుచేస్తాయి. నిర్మాణ విలువలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ లేవు.

- Advertisement -

నటీనటుల విషయానికి వస్తే.. హర్ష చెముడు అలియాస్ వైవా హర్ష తన మార్క్ కామెడీతో నవ్వించాడు. కానీ హీరో అనే బరువుని అతను నటనతో మోయలేకపోయాడు. ఎమోషనల్ సీన్స్ లో అతను పూర్తిగా తేలిపోయాడు. దివ్య శ్రీపాద తన సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో మంచి మార్కులు వేయించుకుంటుంది. కానీ తన కెరీర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే రేంజ్లో అయితే ఇందులో ఆమె పాత్ర లేదు. ‘కెజియఫ్’లో ఇనాయత్ ఖలీల్ పాత్రలో కనిపించిన బాలకృష్ణ… ఈ సినిమాలో గూడెం పెద్దగా చేశారు. మొదట్లో ఈ పాత్రకి మంచి స్కోప్ ఉంది అనిపిస్తుంది. కానీ తర్వాత తేలిపోయినట్టు ఉంటుంది. మిగిలిన నటీనటుల పాత్రలకి పెద్దగా ప్రాముఖ్యత లేదు.

ప్లస్ పాయింట్స్ :

హర్ష చెముడు కామెడీ
ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్ :

బలమైన కథ, కథనాలు లేకపోవడం
ఎమోషనల్ సీన్స్ లో బలం లేకపోవడం
లవ్ స్టోరీ సెట్ అవ్వకపోవడం

మొత్తంగా ‘సుందరం మాస్టర్’ మెప్పించింది అంటూ ఏమీ లేదు.
నొప్పించింది అనే చెప్పాలి..! ఇలాంటివి వెబ్ సిరీస్ లుగా తీస్తే టార్గెటెడ్ ఆడియన్స్ చూస్తారేమో కానీ, సినిమాగా తీసి థియేటర్ కి ఇస్తే.. జనాలు అధరించరు అని చెప్పడంలో సందేహం లేదు.

రేటింగ్: 1 / 5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు