పక్కపక్కనే అక్షరాలను నిలిపి ఉంచిన
అర్ధమున్న ఓ పదము కానిదే అర్ధముండునా
నీది అన్న నిర్వచనం ఇచ్చుకో జీవితానికి, ఏమి చేసినా.!
అంటారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక పాటలో..
ఈ మాటలు మాటల మాంత్రికుడు “త్రివిక్రమ్” కి సరిగ్గా సరిపోతాయి అని చెప్పొచ్చు. అతనికి అక్షరాలను అలవోకగా కాగితంపై విసరడము తెలుసు , పదాలను పద్దతిగా కూర్చోబెట్టడము తెలుసు.
మాటలు అందరూ రాస్తారు
కానీ త్రివిక్రమ్ గుర్తుండిపోయేలా రాస్తారు.
కొన్ని మాటలకు అర్ధాలుంటాయి
కానీ త్రివిక్రమ్ మాటల్లో అంతర్గతం ఉంటుంది.
శేఖరం గారి అమ్మాయి లేచిపోయిందంటే నా తలెత్తుకుని ఎలా తిరగాలిరా అని అడిగితే.?
నీ తల జాతీయ జెండా కాదు మావయ్య
ఎత్తుకు తిరిగినా , దించుకుతిరిగిన జాతి మొత్తం నిలబడి చూడటానికి.
కూతురిని కంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపి కన్నీళ్లు పెట్టుకోవటం కాదు.. మోసపోయి కన్నవాళ్ల దగ్గరకి వస్తే కన్నీళ్లు తుడవడానికి కూడా సిద్ధంగా ఉండాలి అని రాస్తాడు.
అత్తయ్య.. మావయ్య నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా అని అడిగితే.?
అలాంటిదేమి లేదు మీ మావయ్య చెడ్డవాడు కాదు , అలాని మంచివాడు కాదు , మొగుడు.. అంతే.
నా బాధలు చెప్పుకునేంత పెద్దవి కాదు,
మర్చిపోయేంత చిన్నవి కాదు.
కొన్ని కేరెక్టర్స్ కి మాత్రమే ఇలా రాస్తాడు అనుకుంటే పొరపాటే,
“నాకు డబ్బు అవసరం అబ్బా, ఇష్టం కాదు” అని విలన్ కి కూడా రాస్తాడు త్రివిక్రమ్. ఒకటా, రెండా ఉదాహరణలు చెప్పడానికి బోలెడు.
అందుకే రచయిత , దర్శకులు , నటులు తనికెళ్ళ భరణి గారు రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో..
ఒకప్పుడు రైటర్స్ కి కరెక్ట్ గా డబ్బులిచ్చేవారు కాదు అని,
త్రివిక్రమ్ వచ్చాక దర్శకులతో పాటుగా తాను కూడా రెమ్యునరేషన్ తీసుకోవడం మొదలుపెట్టారని, పరుచూరి బ్రదర్స్ రైటర్స్ కి స్టార్ స్టేటస్ తీసుకుని వచ్చారని చెప్పుకొచ్చారు.