Robbery at Director Joshi House : స్టార్ డైరెక్టర్ ఇంట్లో చోరీ… కోటి విలువైన నగలు మాయం

Robbery at Director Joshi House : మలయాళ చిత్రసీమలో ప్రముఖ దర్శకుల్లో జోషి ఒకరు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కొచ్చిలో నివసిస్తున్నారు. అయితే రీసెంట్ గా ఆయన ఇంట్లో దొంగతనం జరగ్గా, కోటి విలువైన నగలు చోరీకి గురైనట్టు తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన జోషి అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.

జోషి ఇల్లు కొచ్చిన్‌లోని పనంపిల్లిలో ఉంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో పానంపల్లి నగర్‌లోని బి స్ట్రీట్‌లోని జోషి ఇంటి నంబర్ 347 అభిలాషంలో చోరీ జరిగింది. 19వ తేదీన రాత్రి జోషి, అతని భార్య సింధు, కుటుంబసభ్యులు ఎప్పటిలాగే ఇంట్లో పడుకున్నారట. తెల్లవారుజామున 5 గంటల సమయంలో సింధు నిద్ర లేచి చూసేసరికి ఇంటి వెనుక కిటికీ కడ్డీలు వంగి ఉండడం కన్పించిందట. దీంతో షాక్‌కు గురైన ఆమె వెంటనే ఇంటిపై అంతస్తుకు వెళ్లి ఇంట్లో ఏమైనా దొంగతనం జరిగిందా అనే అనుమానంతో అన్నీ చెక్ చేశారట. అయితే కోటి విలువైన బంగారు, వజ్రాభరణాలు, వాచీలు దొంగలు దోచుకెళ్లినట్లు గుర్తించి, వెంటనే కొచ్చి పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో పోలీసులు హడావుడిగా విచారణ చేపట్టారు. ఓ గదిలోని సేఫ్ లాకర్ పగులగొట్టి రూ.25 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్, 10 డైమండ్ చెవిపోగులు, 10 ఉంగరాలు, 10 బంగారు నెక్లెస్ లు, 2 బంగారు గాజులు, 10 ఖరీదైన వాచీలు, రూ.8 లక్షలతో పాటు ఇతర నగలను దొంగలు అపహరించారు. ఇంట్లో డైరెక్టర్ జోషితో పాటే కుటుంబ సభ్యులు ఉండగానే చోరీకి పాల్పడిన ఘటన కొచ్చిలో కలకలం రేపింది. అది కూడా కోటి విలువైన నగలు మాయమవ్వడంతో అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అక్కడి పోలీసులు.

- Advertisement -

ఇంట్లో అమర్చిన సీసీటీవీలో దొంగ ఉన్న దృశ్యాలు రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజీలో టీ షర్ట్, టోపీ, నల్లటి శాలువా ధరించిన 30 ఏళ్ల వ్యక్తి కిటికీ తెరవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించి, వేలిముద్రలు వంటి సాక్ష్యాలను తీసుకెళ్లారు పోలీసులు. అలాగే కుటుంబ సభ్యులతో పాటు పని మనిషి స్టేట్మెంట్ ను కూడా తీసుకున్నారు. అయితే దొంగతనం జరిగి మూడు రోజులు గడుస్తున్నా ఇంకా పోలీసులు దొంగలను పట్టుకోలేదని తెలుస్తోంది.

దీంతో మలయాళ ఇండస్ట్రీలోనే స్టార్ డైరెక్టర్ అయిన జోషి ఇంట్లో అందరూ ఉండగానే ఇలాంటి భారీ చోరీ జరిగితే సాధారణ జనాల పరిస్థితి ఏంటి అంటూ టెన్షన్ పడుతున్నారు అక్కడున్న జనం. మరి కొచ్చి పోలీసులు ఈ కేసును ఎప్పుడు పరిష్కరిస్తారో? చూడాలి. దీన్ని చేసింది ఇంటి దొంగలా లేక బయట వారెవరన్నా చేశారా? అనే దిశగా విచారణ సాగుతున్నట్టు సమాచారం.

డైరెక్టర్ జోషి మలయాళంలో న్యూఢిల్లీ, ట్వంటీ ట్వంటీ, ఎయిర్‌పోర్ట్, రాబిన్ హుడ్, క్రిస్టియన్ బ్రదర్స్, రన్ బేబీ రన్ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. తమిళంలో సత్యరాజ్ నటించిన ఎయిర్‌పోర్ట్ చిత్రానికి కూడా ఆయనే దర్శకత్వం వహించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు