Manchu Vishnu : వారే సినిమాల్లో న‌టించాలి

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా మంచు విష్ణు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంచు విష్ణు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికలలో తాను చేసిన వాగ్దానాలు 90 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు. అలాగే నటులు కాని వారు చాలామంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్నార‌ని తెలిపారు. సుమారు 20 నుంచి 25 శాతం మంది నటులు కాని వారు “మా”లో సభ్యులుగా ఉన్నారని వెల్లడించారు.

గతంలో ఉన్న లొసుగుల ద్వారా వీరంతా సభ్యులు అయ్యారని ఆరోపించారు. కానీ ఇక నుంచి మా అసోసియేషన్ సభ్యత్వం కఠినంగా ఉండేలా తుది నిర్ణయం తీసుకుంటున్నామని వెల్లడించారు. నటులు మాత్రమే సభ్యులు కావాలని స్పష్టం చేశారు. “మా” లో సభ్యత్వం ఉన్నవారే సినిమాలలో నటించాలని నిర్మాతలకు సూచించినట్లు అధ్యక్షుడు మంచు విష్ణు కీలక ప్రకటన చేశారు. నిర్మాతలు కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్పినట్లు ప్రకటించారు. అలాగే అసోసియేషన్ కు వ్యతిరేకంగా ఎవరైనా ధర్నాలు చేసినా, మీడియా ముందుకు వచ్చినా శాశ్వత సభ్యత్వం రద్దు చేస్తామని హెచ్చరించారు.

దాదాపు ఐదేళ్లు శాశ్వత సభ్యుడుగా ఉంటేనే “మా” ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే ఇప్పుడున్న ఫిలిం చాంబర్ భవనాన్ని కూల్చివేసి కొత్త భవనం కట్టేందుకు పూర్తి ఖర్చును తానే భరిస్తానని వెల్లడించారు. చాలామంది సభ్యులు రెండవ అంశానికే మద్దతు పలికారని చెప్పారు. “మా” కుటుంబంలో తమకు ఏమైనా ఇబ్బందులు వస్తే అంతర్గతంగా తామే సరిదిద్దుకుంటామని.. అలాకాకుండా బయటకు వెళ్లి అల్లరి చేస్తే తక్షణమే తరిమేస్తామని హెచ్చరించారు మంచు విష్ణు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు