Happy Birthday: హాస్య “నటకిరీటి” రాజేంద్రుడు..

రాజేంద్ర ప్రసాద్… నటకిరీటిగా, నవ్వుల రారాజు గా, తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చురగొన్న వ్యక్తి. నాలుగు దశాబ్దాలుగా తన సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులని నవ్విస్తూ, ఏడిపిస్తూ, ఆలోచింపచేస్తూ ఇండస్ట్రీకి వచ్చే ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ఈరోజు ఆ లెజెండరీ నటుడి బర్త్ డే. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ కి filmify టీమ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన గురించి ఇప్పటి జెనరేషన్ కి తెలియని కొన్ని విషయాలని తెలుసుకుందాం.

టాలీవుడ్ లో పూర్తిస్థాయి కామెడీ హీరోగా మారిన మొదటి నటుడు రాజేంద్రప్రసాద్. అప్పటివరకు సినిమాల్లో హీరోలు, కమెడియన్లు వారి పాత్రల్లో నటించేవారు. కానీ రెండు కలిపి పూర్తి స్థాయి కామెడీ చిత్రాల్లో హీరోయే కామెడీ చేసే సినిమాలకు నాంది పలికింది రాజేంద్ర ప్రసాద్. ఫ్యామిలితో కలిసి రెండు గంటలపాటు నవ్వుకునే సినిమా చూడాలంటే మొదట గుర్తొచ్చేది రాజేంద్ర ప్రసాద్ సినిమాలే. అలా తన సినిమాలతో ఒక ట్రెండ్ సెట్ చేసాడు.

80లలో కొత్త రకం డాన్స్ లు ఫైట్లతో చిరంజీవి లాంటి నటుడు ఆడియన్స్ ని మెప్పిస్తే, కేవలం కామెడీ సినిమాలతో తన సత్తా చాటాడు రాజేంద్రప్రసాద్. అహనా పెళ్ళంట తో మొదలైన ఆయన నవ్వుల యుద్ధం ఇప్పటికి కొనసాగుతుంది. సినీ ఇండస్ట్రీ కి 70ల్లోనే వచ్చినా సరైన అవకాశం రాలేదు. చిన్న చిన్న పాత్రలు వేసి ఫేమ్ సంపాదించాడు. అలా మంచుపల్లకి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమాలో చిరంజీవి హీరోకాగా, ఆయన స్నేహితుల్లో ఒకరు రాజేంద్రప్రసాద్.

- Advertisement -

ప్రేమించు పెళ్లాడు చిత్రంతో హీరోగా మారిన రాజేంద్ర ప్రసాద్ కి నటుడుగా అసలైన గుర్తింపు మాత్రం “కాష్మోరా” చిత్రం ద్వారా దక్కింది. ఈ సినిమాలో మాంత్రికుడు దార్ఖా గా రాజేంద్రుడు తన నట విశ్వరూపం చూపించాడు. ఆ రోజుల్లో చిన్న పిల్లలు ఈ సినిమా చూస్తే ప్యాంట్లు తడుపుకునేవాళ్ళు.

అహనా పెళ్ళంట:

రాజేంద్రప్రసాద్ ని తెలుగుతెరకి నవ్వులరాజుని చేసిన చిత్రం అహనా పెళ్ళంట. జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణమూర్తిగా రాజేంద్రుడి అభినయం అనితర సాధ్యం. ఈ చిత్రం ద్వారానే రాజేంద్ర ప్రసాద్ తో పాటు, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావులకు నటులుగా మంచి బ్రేక్ వచ్చింది. 90ల్లో రాజేంద్ర ప్రసాద్ కెరీర్ స్వర్ణయుగం గా గడిచిందనాలి. ఏప్రిల్ 1 విడుదల, ప్రేమ తపస్సు, పెళ్లి పుస్తకం, అప్పుల అప్పారావు, ఆ ఒక్కటి అడక్కు, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు… ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తన ఖాతాలో ఉన్నాయి.

టాలీవుడ్ టాప్ హీరోలందరితోను నటించిన ఆయన 20స్ తరవాత సీరియస్ రోల్స్ లో కూడా అలరించారు. అలా ఆయన జీవితాన్ని నిలబెట్టిన చిత్రం అహనా పెళ్ళంట అయితే, తన జీవితానికే గుర్తింపు తెచ్చిన చిత్రం “ఆ నలుగురు”. ఈ సినిమాలో సగటు మనిషి సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పుతుంది. ఇక ఈ సినిమాకి ఉత్తమ నటుడుగా నంది అవార్డుని సైతం దక్కించుకున్నాడు. ఈ సినిమా ప్రేరణతోనే మీ శ్రేయోభిలాషి, ఓనమాలు వంటి మంచి సినిమాలు వచ్చాయి.

ప్రస్తుతం కామెడీ సినిమాలకి స్వస్తి చెప్పి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలు చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు ఆయన స్థానాన్ని అల్లరి నరేష్ భర్తీ చేసాడు. మెగాస్టార్ చిరంజీవి తో పాటు ఎస్వి కృష్ణారెడ్డి, అనిల్ రావిపూడి లాంటి దర్శకులకి ఎంతో ఇష్టమైన నటుడు రాజేంద్ర ప్రసాద్.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు