Crew : సోలో గా కుదరలేదు.. అందుకే కలిసి కొట్టారు..

Crew : బాలీవుడ్ లో ఈ ఇయర్ స్టార్ హీరోల నుండి సరైన సినిమా ఇంకా రాలేదన్న విషయం తెలిసిందే. రెండు నెలల కింద రిలీజ్ అయిన ఫైటర్ సినిమా జస్ట్ యావరేజ్ అనిపించుకుంది. కానీ లాస్ట్ మంత్ సైతాన్ బ్లాక్ బస్టర్ తో మాత్రం బాలీవుడ్ గాడిలో పడిందని చెప్పాలి. అజయ్ దేవగన్ అందులో హీరో అయినప్పటికీ ఆ సినిమా చిన్న సినిమాగా రిలీజ్ అయింది. వష్ అనే గుజరాతి సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన సైతాన్ మౌత్ టాక్ తో బాలీవుడ్ లో కళ్ళు చెదిరే విజయం సాధించింది. దాదాపు 200 కోట్ల వరకు వసూలు చేసి బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఆ తర్వాత అదే హిట్ స్టేటస్ ని కంటిన్యూ చేస్తున్నాయి కొన్ని చిన్న సినిమాలు. ఇటు టాలీవుడ్ లో కూడా ఓ మోస్తరు విజయాలు తప్ప హనుమాన్ తర్వాత టాలీవుడ్ లో నిఖార్సైన హిట్టు దక్కకపోగా, లేటెస్ట్ గా రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ మాత్రం థియేటర్లలో ఇరగదీస్తుందని చెప్పాలి. వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయి వంద కోట్ల దిశగా దూసుకుపోతుంది. అయితే మనకు టిల్లు స్క్వేర్ సందడితో సరిపోయింది కానీ, బాలీవుడ్ లో అదే రోజు విడుదలైన ‘క్రూ’ అనే చిన్న సినిమా కూడా మంచి వసూళ్లతో విజయం దిశగా దూసుకుపోతోంది.

చిన్న సినిమా పెద్ద సక్సెస్..

బాలీవుడ్ లో మార్చి 29న రిలీజ్ అయిన క్రూ (Crew) సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది. దీంట్లో హీరోలు ఎవరూ లేరు. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీగా సినిమా తెరకెక్కింది. ఇక సీనియర్ జూనియర్ కలిపి ముగ్గురు హీరోయిన్లను ప్రధాన పాత్రలో పెట్టి రాజేష్ ఏ కృష్ణన్ క్రూ సినిమాకు దర్శకత్వం వహించారు. విచిత్రమేమిటంటే ట్రైలర్ వచ్చే దాకా అసలు ఈ సినిమా నిర్మాణంలో ఉన్న సంగతే చాలా మందికి తెలియదు. 90స్ స్టార్ హీరోయిన్ టబు, 20స్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ అలాగే ప్రస్తుత జనరేషన్ నుంచి కృతి సనన్ ని హీరోయిన్స్ గా తీసుకున్నారు. విశేషమేంటంటే వయసుతో సంబంధం లేకుండా ఈ సినిమాలో వీళ్లకు గ్లామర్ టచ్ జోడించడం జరిగింది. విమానంలో క్యాబిన్ క్రూగా పని చేసే ముగ్గురు మహిళల చుట్టూ నడిచే కథే ఈ మూవీ. కోహినూర్ ఎయిర్ లైన్స్ యజమానికి ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు సరిపడా డబ్బు లేక సతమతమవుతూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితిలో ఒక స్టాఫ్ అనుకోని పరిస్థితుల్లో చనిపోతాడు. తీరా చూస్తే అతను బంగారం దొంగ రవాణా చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడని గ్రహించిన హీరోయిన్లు టబు, కరీనా, కృతి ఏకంగా ఇదంతా చేసే డాన్ తో డీల్ మాట్లాడుకునేందుకు సిద్ధ పడతారు. ముందు తేలికే అనుకుంటారు కానీ ముందుకెళ్లే కొద్దీ ప్రమాదాలు, ఇబ్బందులు చుట్టుముడతాయి. ఆ ఇబ్బందుల నుండి బయటపడి వీళ్ళు అనుకున్నది సాధించారా లేదా అన్నది కథ.

కలిసి సక్సెస్ కొట్టిన హీరోయిన్లు..

అయితే కథ ఆద్యంతం గొప్పగా లేకపోయినా కాలక్షేపానికి లోటు లేకుండా ఫన్ తో క్రూ(Crew) మూవీ సాగుతుంది. అలా కాకుండా సినిమాలో గొప్ప ట్విస్ట్ లు అని ఏదేదో ఊహించుకుంటే మాత్రం అసంతృప్తి మిగిలే అవకాశం లేకపోలేదు. ఓ మోస్తరు వినోదం తప్ప మరీ ఎక్స్ ట్రాడినరీగా ఉండదు. కానీ అనూహ్యంగా ఈ సినిమా వారం తిరక్కుండానే 70 కోట్లకు పైగా గ్రాస్ ని దాటేసిన క్రూ వంద కోట్ల దిశగా దూసుకుపోతుంది. ఫైనల్ గా బాలీవుడ్ లో సైతాన్ తర్వాత మరో ఊహించని సక్సెస్ వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా లో నటించిన ముగ్గురు హీరోయిన్లకు గత సినిమాలు ప్లాప్ లు గా మిగిలాయి. సీనియర్ హీరోయిన్ టబు సక్సెస్ లు లేక క్యారెక్టర్ ఆర్టిస్టు గా కొనసాగుతుంది. ఇక కరీనా కపూర్ అప్పుడప్పుడూ హీరోయిన్ గా పెద్ద సినిమాల్లో నటిస్తున్నా సక్సెస్ మాత్రం దక్కలేదు. ఇక యంగ్ బ్యూటీ కృతి సనన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆది పురుష్ నుండి ఈమెకి వరుస ప్లాప్ లతో పాటు ట్రోలింగ్ కి గురయింది. అయితే మొన్నామధ్య ఒక రోబో కామెడీ సినిమాతో యావరేజ్ సక్సెస్ అందుకున్న కృతి, క్రూ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. మొత్తానికి సోలో బ్లాక్ బస్టర్స్ కొట్టకపోయినా, ముగ్గురు కలిసి సక్సెస్ అందుకున్నారని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో 150 కోట్ల మార్క్ ని అందుకునే ఛాన్స్ ఉంది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు