కేజీఎఫ్ స్టార్ యష్‌కి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం విధితమే. ఈ సినిమాతో యష్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పాన్ ఇండియా స్టార్‌గా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇటీవల విడుదలైన కేజీఎఫ్ 2 తరువాత యశ్ నుంచి మరో ప్రాజెక్ట్ అప్డేట్ రాలేదు.
ఈ రాకింగ్ స్టార్ తన తరువాత ప్రాజెక్ట్ ఎవరితో చేయనున్నాడనే క్యూరియాసిటీ అభిమానుల్లో నెలకొంది. ఇదివరకు సౌత్ సినిమాలను ఎగతాళి చేసేవారు .. కానీ ఇప్పుడు సౌత్ సినిమాలే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తున్నాయి. బాలీవుడ్ సినీ పరిశ్రమగా మాత్రమే పరిగణించే వారని.. సౌత్ సినిమాలను హిందీ చిత్రాలతో పోటీపడాలంటే ఎంతో కష్టంగా ఉండేదని భావించేవారు. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమా తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
తాజాగా ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో యష్ తన తరువాత సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. “పది సంవత్సరాల కిందట ఉత్తరాదిన డబ్బింగ్ సినిమాలు ప్రాచుర్యం పొందాయి. కానీ తొలుత అందరూ భిన్నమైన అభిప్రాయాలతో వాటిని చూడడం ప్రారంభించారు. సౌత్ సినిమాలను ఇక్కడి వారు ఎగతాళి చేసేవారు. ఇదేం యాక్షన్.. అందరూ అలా ఎగిరిపోతున్నారు అంటూ నవ్వుకునే వారు. కానీ చివరికి వారి కళారూపాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. దక్షిణాది సినిమా తక్కువ ధరకు అమ్ముడయ్యేవి. కానీ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా పరిస్థితినే మార్చేసింది.ప్రస్తుతం ప్రజలు సౌత్ సినిమాలను ఎక్కువగా చూడడం ప్రారంభించారు. గతంలో ఇక్కడ మార్కెట్ చేయాలంటే బడ్జెట్ వేరేలా ఉండేది. ఇప్పుడు డిజిటల్ విప్లవంతో మనకు అవకాశం వచ్చింది” అంటూ వెల్లడించారు.