Satyajit Ray Birth anniversary : భారతీయ సినిమాకు నిలువెత్తు రూపం.. 16 కళల ఉద్ధండుడు.. ఈ భారతరత్న..

Satyajit Ray Birth anniversary : “సత్యజిత్ రే”.. ఈ పేరు బహుశా తెలుగువారు చాలా తక్కువ విని ఉంటారు. కానీ సినీ అభిమానులకు మాత్రం ఈ పేరు చాలా సుపరిచితమైనది. ముఖ్యంగా ఆస్కార్ ని ప్రేమించే ప్రతి సినిమా వారికి ఈ పేరు గుర్తుంటుంది. భారతీయ సినిమాలో కొత్త ఒరవడి సృష్టించినవారు.. బాహుముఖ ప్రజ్ఞాశాలి సత్యజిత్‌ రే. దేశంలోని ప్రతి దర్శకుడు, నిర్మాతతో పాటు సినిమా పరిశ్రమలో ఉన్న అన్ని విభాగాల వారికి ఆయన ఎంతో ఆదర్శప్రాయుడు. బెంగాలీ చిత్ర పరిశ్రమ వారికైతే ఆయన లాంటి ఫిల్మ్ మేకర్ దొరకడం వారి అదృష్టం గా భావిస్తుంటారు. దేశంలోనే లెజెండరీ దర్శకులలో ఈయన అగ్రగణ్యుడు. ఒక్క దర్శకత్వంలోనే కాదు, కళా దర్శకత్వం, కథా రచన, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌, కెమెరా, సంగీతం, నిర్మాణం, కొరియోగ్రఫీ, ఇలా సినిమాకు సంబంధించిన ప్రతీ శాఖలోనూ సత్యజిత్‌ రే తన గొప్ప ప్రతిభను కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇక ఈ తరం వారికి గుర్తుండేలా అంటే భారత్ కు ఆస్కార్ తెచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఈయన. ఈ రోజు ఈ లెజెండరీ దర్శకుడి జయంతి (2 May 1921).. ఈ సందర్బంగా ఆయనకీ నివాళులు అర్పిస్తూ సత్యజిత్ రే గురించి కొన్ని విశేషాలను తెలుసుకుందాం..

బహుముఖ ప్రజ్ఞాశాలి..

లెజెండరీ దర్శకులు సత్యజిత్‌ రే 1921 మే 2న కలకత్తాలో జన్మించగా, ప్రెసిడెన్సీ కాలేజీలో ఎకనామిక్స్‌ చదువుకున్నారు. తమ కుటుంబానికి సన్నిహితులైన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ప్రభావం ఆయన సినిమాలపై చాలా ఉండేది. ఇక సినిమాలు, గ్రామ్‌ఫోన్‌ రికార్డులపై ఉన్న ఆసక్తి ఆయనను ఎక్కువ రోజులు చదవనివ్వకుండా చేసాయి. ఓ పుష్కర కాలం పాటు ఓ బ్రిటిష్‌ అడ్వర్‌టైజింగ్‌ కంపెనీలో పని చేసిన తర్వాత సినిమాల్లోకి వచ్చిన సత్యజిత్‌ రే 1928లో బిభూతిభూషణ్‌ బందోపాధ్యాయ్‌ రాసిన పథేర్‌ పాంచాలి నవల ఆధారంగా సినిమా తీయాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. అయితే సినిమాల గురించి అన్ని విభాగాల్లో పట్టు సాధించి, ఎట్టకేలకు 1955 లో ఆయన ‘పథేర్‌ పాంచాలి’ ని తెరకెక్కించారు. ఇక మొదటి సినిమాతోనే దేశ విదేశాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు సత్యజిత్. ఇక ఆ తర్వాత తీసిన సినిమాలన్నీ క్లాసిక్స్‌గా పేరొంది, ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. ఇక కథల పరంగా కూడా ఎన్నో డిఫరెంట్ జోనర్ లో కథలు, నవలలు రాసారు. సైన్స్‌ ఫిక్షన్‌, డిటెక్టివ్‌ కథలు కూడా సత్యజిత్ రాశారు. నాలుగు దశాబ్దాల పాటు సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగారు. ఇక సత్యజిత్ రే తెరకెక్కించిన సోనార్ కెల్ల, అషాని సంకేత్, అపరాజితో, మహానగర వంటి కళాఖండాలు ఎన్నో ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. ఇక లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్ ఆస్కార్‌ను అందుకున్న తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు. భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత పురస్కారం “భారతరత్న” ను కూడా అందుకున్నారు.

భారతీయత.. కష్టాలరూపంలో..

అయితే సత్యజిత్ రే (Satyajit Ray Birth anniversary) ని ఒకరకంగా విమర్శించిన వారూ లేకపోలేదు. కొంతమంది విమర్శకులు సత్యజిత్‌ రే గొప్పోడేమీ కాదు, దేశంలో ఉన్న దరిద్రాన్నంతా సినిమాల్లో చూపించి అవార్డులు కొట్టేశారంతే! అని కొందరంటారు. అది వారి మేధా దారిద్య్రానికి చిహ్నమని అంటారు విలేఖర్లు. ఆ మాటకొస్తే తాను గొప్ప గొప్ప కళాఖండాలు తీశానని, తీస్తున్నానని ఏనాడూ సత్యజిత్‌రాయ్‌ అనుకోలేదు. ప్రతి ఒక్కరు తన చిత్రాలు చూడాలన్నదే ఆయన అభిమతం. చాలా మంది దర్శకులకు ఆయనే ఇన్‌స్పిరేషన్‌! మనుషుల్లోని రాగద్వేషాలు, భావోద్వేగాలు, ఆనంద విషాదాలు సత్యజిత్‌ చూపించినట్టుగా మరే దర్శకుడు తెరకెక్కించలేకపోయాడని, చాలా మంది మూవీ మేకర్స్ అంటూ ఉంటారు. ఇక వివిధ అంశాలతో ఆయన 27 సినిమాలు తీయగా, షార్ట్‌ సినిమాలు, డ్యాకుమెంటరీలు కలిపి మొత్తం 37 ఉన్నాయి. ఇక ఆయన పొందిన అవార్డులలో 1992లో వచ్చిన ఆస్కార్ లైఫ్ అచీవ్ మెంట్ అవార్డు, 1992 లో వచ్చిన భారతరత్నలు అత్యంత ముఖ్యమైనవి. మొత్తంగా సత్యజిత్ రే గురించి ఒక్క మాటలో చెప్పాలంటే భారతీయ జీవనచిత్రంలోని అణువణువూ సినిమా రూపంలో తెరకెక్కించిన దర్శకుడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు