Re-Release: చిన్న సినిమాలపై ప్రభావం

రోజులు మారుతున్న కొద్ది సినీ పరిశ్రమలో అనేక మార్పులు వచ్చాయి.
ఒకప్పుడు స్టార్ హీరోల సినిమా రిలీజ్ డే టికెట్ దొరకడం చాలా కష్టం.
కానీ ఇప్పుడు ఇంట్లో నుండే టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం. ఒకప్పుడు సినిమా సక్సెస్ ను ఆ సినిమా ఆడే సెంటర్స్ ను, రోజులను బట్టి నిర్ణయించేవారు. కానీ ఇప్పుడు సినిమాకి వచ్చే కలక్షన్స్ బట్టి ఆ సినిమా సక్సెస్ నిర్ణయిస్తున్నారు. ప్రేక్షకులు సినిమాలకు రావడం తగ్గించేసారు అని నిర్మాతలు వాపోతున్న తరుణంలో, మంచి సినిమాలు వస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు థియేటర్ కి వస్తారని బింబిసార, సీతారామం సినిమాలు నిరూపించాయి.

కేవలం కొత్త సినిమాలకు మాత్రమే కాకుండా రీ రిలీజ్ సినిమాలకు కూడా ప్రేక్షకులకు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల సినిమాలకు స్పెషల్ షోలు వేయడం ఈరోజుల్లో ట్రెండ్ గా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఆగస్ట్ 8 మరియు 9 తేదీల్లో జరిగిన ఒక్కడు, పోకిరి స్పెషల్ షోలతో ఇదంతా ప్రారంభమైంది. ఈ సినిమాకి భారీ రెస్పాన్స్ వచ్చింది.

ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రెండ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి తమ్ముడు, జల్సా షోలను మరింత భారీగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. నిన్న చాలా సెంటర్లలో తమ్ముడు ప్రదర్శించబడింది. నిన్న వినాయక చవితి అయినప్పటికీ 1999లో వచ్చిన ఈ చిత్రాన్ని చూసేందుకు జనాలు థియేటర్లకు ఎగబడ్డారు. జల్సా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా 500కి పైగా స్క్రీన్లలో రీ-రిలీజ్ అవుతోంది. ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో మాత్రమే ఈ రెండు సినిమాలకు ఈ రెండు రోజుల్లో 30కి పైగా షోలు వేశారు.

- Advertisement -

ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే, చాలా షోలు అతి తక్కువ కాలవ్యవధిలోనే హౌస్‌ఫుల్‌గా మారాయి. ఈ సినిమాల కలెక్షన్లు కచ్చితంగా భారీగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ స్పెషల్ షోల సక్సెస్ తర్వాత మిగతా హీరోల ఫ్యాన్స్ ట్రెండ్ ఫాలో అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

ప్రేక్షకులకు నోస్టాల్జిక్ వైబ్స్ మరియు థియేటర్లలో ఆనందాన్ని తెస్తుంది అనే వాస్తవాన్ని పక్కన పెడితే, ఈ ప్రత్యేక షోలు మరోవైపు చిన్న చిత్రాల రన్‌పై ప్రభావం చూపుతాయి. తమ్ముడు రీ-రిలీజ్ కారణంగా బింబిసార, సీతా రామం మరియు కార్తికేయ 2 వంటి చిత్రాల థియేట్రికల్ రన్ పై ఎఫెక్ట్ పడింది. అలానే సెప్టెంబర్ 2న రిలీజ్ కాబోయే రంగ రంగ వైభవంగా, ఫస్ట్ డే ఫస్ట్ షో చిత్రాలపై కూడా పవన్ కళ్యాణ్ జల్సా సినిమా ఎఫెక్ట్ పడనుంది. పాత చిత్రాలను మళ్లీ విడుదల చేయడం అభిమానులకు ఆనందాన్ని కలిగించడమే కాకుండా, మంచి చిన్న-బడ్జెట్ చిత్రాల రన్‌పై కూడా కొంత ప్రభావం చూపుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు