Aavesham : ‘ఫాఫా’ కోసం ఎగబడిపోతున్నారు. త్వరలో తెలుగులోనూ!

Aavesham : టాలీవుడ్ లో ఈ మధ్య తెలుగులో సరైన సినిమా రావట్లేదని టాలీవుడ్ సినీ ప్రేక్షకులు ఇతర భాషల సినిమాల కోసం ఎగబడుతున్నారు. ముఖ్యంగా మలయాళం సినిమాల కోసం తెలుగు సినీ ప్రేక్షకులు బారులు తీరుతున్నారు. రీసెంట్ గా డబ్ అయిన ప్రేమలు, మంజుమ్మేల్ బాయ్స్ వంటి సినిమాలను తెలుగులోనూ మూవీ లవర్స్ ఎంతగానో ఆదరించారు. ప్రేమలు అయితే డిస్ట్రబ్యూటర్లకి నాలుగు రెట్లు లాభం అందించి టాలీవుడ్ లో టాప్ మలయాళం గ్రాసర్ గా నిలిచింది. ఇక భ్రమయుగం, ఆడు జీవితం లాంటి సినిమాలని కూడా తెలుగులో ఒక సెక్షన్ అఫ్ ఆడియన్స్ బాగా చూసారు. అయితే ఇప్పుడు ఏకంగా మలయాళం వెర్షన్ నే తెలుగు ఆడియన్స్ చూడ్డానికి సిద్ధమయ్యారు. మలయాళంలో అర్ధం కాకపోయినా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో కలిపి మల్టీ ఫ్లెక్స్ లలో సినిమా చూస్తున్నారు జనాలు.

ఫాఫా కోసం..

ఇదిలా ఉండగా మలయాళం స్టార్ ఫహద్ ఫాజిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మలయాళం లో ఎంతో టాలెంట్ ఉన్న ఈ హీరో, సౌత్ వ్యాప్తంగానూ ఎంతో ఖ్యాతి గాంచాడు. ఎలాంటి పాత్రలోనైనా రఫ్ ఆడించగల దిట్ట ఈయన. నాలుగేళ్ళ కింద ట్రాన్స్ అనే ఓటిటి సినిమాతో తెలుగు ఆడియన్స్ ని పలకరించిన ఫహద్, పుష్పలో భన్వర్ సింగ్ షెకావత్ గా ఓ రేంజ్ లో పాపులర్ అయ్యాడు. నిజంగా పుష్ప ని మించిన రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. కేవలం ఆ ఒక్క బ్లాక్ బస్టర్ అతని డబ్బింగ్ సినిమాలను కూడా వెల్లువలా వచ్చేలా చేసింది. తాజాగా ఫహద్ ఫజిల్ హీరోగా నటించిన కొత్త సినిమా ‘ఆవేశం’ గురువారం ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజయ్యింది. మలయాళంలో ఫస్ట్ షో కే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా థియేటర్లలో ఇరగదీస్తోంది. అయితే ఒక్క కేరళలోనే కాదు. తెలుగు డబ్బింగ్ చేయకపోయినా, హైదరాబాద్ లో ఈ సినిమాని తెలుగు ఆడియన్స్ ఎగబడి చూస్తున్నారట. మలయాళం రాకపోయినా సబ్ టైటిల్స్ తో మల్టీప్లెక్స్ లో సినిమాని చూస్తున్నారు. అయితే ఈ సినిమాని మళయాళంతో పాటు తెలుగులో కూడా ముందే రిలీజ్ చేయాల్సి ఉండగా, సినిమా ఫలితం చూశాక తెలుగు రిలీజ్ నిర్ణయించాలని నిర్మాతలు భావించడంతో మన దాకా రాలేదు.

తెలుగు రిలీజ్ కి ప్రయత్నాలు..

ఇక ఆవేశం(Aavesham) సినిమా విషయానికి వస్తే ఇందులో హీరో పాత్ర పేరు రంగా. బెంగళూరుకు చదువుకోవడానికి వచ్చిన ముగ్గురు కాలేజీ కుర్రాళ్ళు తమ సీనియర్లతో ర్యాగింగ్ గొడవ కారణంగా ప్రతీకారంతో రగిలిపోతారు. సహాయం కోసం నగరంలో పేరుమోసిన రౌడీగా చెలామణిలో ఉన్న రంగాను కలుస్తారు. అక్కడి నుంచి వీళ్ళ ప్రయాణం అనూహ్య మలుపులు తిరుగుతుంది. ఇక సినిమా ఫహద్ ఫాజిల్ వన్ మ్యాన్ షో గా అనే ఉంటుంది. కేవలం ఒక ఇంట్లో రోమాంచమ్ తీసి వంద కోట్లు వసూళ్లు తెచ్చిన జీతూ మాధవన్ దీనికి దర్శకుడు కావడం విశేషం. సినిమా చూసిన మూవీ లవర్స్ లో ఫహద్ లోని కొత్త కోణం చూసి ఆశ్చర్యపోతున్నారు.సినిమా కథ నేపథ్యం సీరియస్ డ్రామా అయినా, ఆద్యంతం నవ్విస్తూ, ఎమోషన్స్ కి గురి చేస్తూ, థ్రిల్ పంచుతుంది. ఫహద్ ఫాజిల్ మీద సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక మూవీ రిజల్ట్ గురించి విన్న టాలీవుడ్ నిర్మాతలు కొందరు ఈ ఆవేశం హక్కులను కొనే పనిలో పడ్డారట. దిల్ రాజు, మైత్రి నిర్మాతలు ఈ సినిమా కోసం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని తెలుస్తుంది. బహుశా ఈ వారంలోపు సినిమా తెలుగు డబ్బింగ్ అనౌన్స్ మెంట్ రావచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు