Legend: నవరస నటనా సార్వభౌముడు “కైకాల సత్యనారాయణ”…

తెలుగు చిత్రపరిశ్రమలో నవరసాలు పలికించే మహానటుల ప్రస్తావన వస్తే అందులో ముందుగా గుర్తొచ్చేది “ఎస్వీ రంగారావు”. మొదటితరం నటుల్లో ఆయన స్థాయి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లని మించేదంటే అతిశయోక్తి కాదు. ఇక ఆయన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసిన ఏకైక నటుడు “కైకాల సత్యనారాయణ”. రావణ బ్రహ్మగా, దుర్యోధనుడిగా, కీచకుడిగా, ఘటోత్కచుడిగా, భీముడిగా ఇలా ఎన్నో పౌరాణిక పాత్రలలో మెప్పించిన మహానటుడాయన. అందుకే “నవరసనటనా సార్వభౌముడిగా” ప్రేక్షకులచే మెప్పు పొందాడు. ఈరోజు “కైకాల సత్యనారాయణ జయంతి”. ఈ సందర్భంగా ఆయనకి filmify టీమ్ తరపున నివాళులు అర్పిస్తూ కొన్ని విశేషాలని గుర్తు చేసుకుందాం.

కైకాల సత్యనారాయణని ఎస్వీఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు అంటుంటారు. ఎందుకంటే ఆయన తర్వాత అన్ని రకాల పాత్రలు వేసిన నటుడు ఈయనే. ఒక ప్రతినాయకుడిగా హీరోకి ఢీ అంటే ఢీ అన్నట్టు ఎన్నో పాత్రలు సత్యనారాయణ ని వరించాయి. ఇండస్ట్రీలోకి 50ల్లోనే వచ్చినా సరైన గుర్తింపు రావడానికి చాలా సమయం పట్టింది. అందుకే అన్ని రకాల వేషాలు వేసేవారు. 1973లో వచ్చిన “శారద” చిత్రంతో ఆయన కెరీర్ మలుపుతిరిగింది. చెల్లెలి సంతోషం కోసం అన్ని అన్నీ త్యాగం చేసే అన్నగా, ఈ చిత్రంలో కైకాల నటన అమోఘం.

ఒక అన్నగా, తండ్రిగా, మావయ్యగా, బాబాయి గా ఇలా సగటు మధ్యతరగతి కుటుంబీకుడి పాత్ర ఏదైనా ఒకప్పుడు డైరెక్టర్లకు సత్యనారాయణే దిక్కయ్యేవాడు. అంతే కాదు ఊళ్ళో పెద్ద అయినా, ముంబై డాన్ అయినా, వీధి రౌడీ అయినా, జైల్లో ఖైదీ అయినా సత్యనారాయణ ఉంటే ఇంకే యాక్టర్ కి పనిలేదు అనేవాళ్ళు అప్పటి సినీజనాలు.

- Advertisement -

ఇక యమగోల లో యమ ధర్మరాజు గా కైకాల నటనాపుస్తకంలో మరో పేజీని లిఖించవచ్చు. అందులో ఆయన పండించిన రౌద్రంతో పాటు, కామెడీ కూడా విపరీతంగా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ముఖ్యంగా యముండ చెప్పే డైలాగ్ ఆరోజుల్లో ఒక ట్రెండ్. ఆ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన యమలీల లో కూడా యముడిగా అద్భుతమైన రోల్ చేశారు సత్యనారాయణ. ఇక టాలీవుడ్ లో ఆరోజుల్లో పెద్ద డైరెక్టర్స్ అయిన కోదండరామిరెడ్డి, రాఘవేంద్ర రావు, ఎస్వీ క్రిష్ణారెడ్డి లాంటి దర్శకులు వాళ్ళ ప్రతి సినిమాలోనూ సత్యనారాయణకు ఒక పాత్ర ఖచ్చితంగా ఉంచేవారు.

ఇక ఎన్టీఆర్ సినిమాల్లో ఎక్కువగా నటించిన సత్యనారాయణ, హైట్, వెయిట్ తో పాటు,హెయిర్ స్టైల్, కలర్ కూడా ఎన్టీఆర్ లాగే ఉంటాయి, అందుకే 100కి పైగా ఎన్టీఆర్ సినిమాల్లో ఆయనకీ డూప్ గా కూడా నటించారు సత్యనారాయణ. ఇక ఆ తర్వాత అత్యధికంగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి 50కి పైగా చిత్రాల్లో నటించారు.

సావాసగాళ్ళు, వేటగాడు, సీతా కళ్యాణం, గూండా, సింహాసనం, యముడికి మొగుడు, కొండవీటి దొంగ, కొదమసింహం, యమలీల, ఘటోత్కచుడు తదితర చిత్రాలు సత్యనారాయణ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

దాదాపు 777సినిమాల్లో నటించిన సత్యనారాయణ 100కి పైగా పౌరాణిక,జానపద చిత్రాల్లో నటించారు. అయితే ఇప్ప్పటివరకు తెలుగురాష్ట్రాల ప్రభుత్వాల నుండి కైకాల సత్యనారాయణకి సరైన గుర్తింపు రాలేదని ఇండస్ట్రీ పెద్దలు అంటుంటారు. ఇప్పటికైనా ఇండస్ట్రీ ప్రముఖులు మేల్కొని కైకాల సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలను గౌరవిస్తూ పద్మశ్రీ అవార్డు వచ్చేలా చేయాలని పలువురు సినీపెద్దలతో పాటు, ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు