K.vishwanath : “కళాతపస్వి” కళాభిరుచికి నిదర్శనం ఈ చిత్ర మాలికలు…

కళాతపస్వి కాశీనాథుని విశ్వనాధ్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు . భారతీయ కళా, సాంస్కృతిక రంగాలకు పెద్ద పీట వేస్తూ ఆయన తీసిన ప్రతీ సినిమా ఒక కళా ఖండమే. ప్రతీ దృశ్యం ఒక చిత్ర రాజమే. ఇంకా చెప్పాలంటే వెస్ట్రన్ కల్చర్ కి అలవాటు పడిన ఒక తెలుగువాడికి కె. విశ్వనాధ్ తీసిన సినిమాలు చూపిస్తే చాలు, భారతీయ కళా, సాంస్కృతిక వైభవంపై, సాంప్రదాయాలపై ఒక్కసారిగా అతను అభిప్రాయం మార్చుకుంటాడంటే అతిశయోక్తి కాదు.. అంటే ఆయన తీసిన చిత్రాల్లో దేశ సంస్కృతి పై అంత గొప్పదనం ఉంటుందని అర్ధం.

సాధారణంగా దేశభక్తి సినిమాలంటే చాలామంది స్వతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వీరుల గాథల నేపథ్యంలో వచ్చిన చిత్రాలు చూపిస్తూ ఉంటారు. కానీ దేశ సంస్కృతి, కళల గొప్పదనాన్ని చెప్పే స్వర్ణ కమలం, శంకరా భరణం, సిరి వెన్నెల లాంటి చిత్రాలు కూడా దేశభక్తి సినిమాల కోవలోకే వస్తాయి. అలాంటి గొప్ప చిత్రాలు అందించిన కళాతపస్వి ఈ సినీ లోకాన్ని విడిచి సరిగ్గా నేటికీ ఒక ఏడాది పూర్తయింది. ఈ సందర్బంగా విశ్వనాధ్ తీసిన చిత్ర రాజాల్లో అత్యుత్తమ పది చిత్రాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం..

1. శంకరా భరణం : (1980)

- Advertisement -

Shankara Bharanam

కె. విశ్వనాధ్ దర్శకత్వం వహించిన ‘శంకరా భరణం’ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమని భారతీయ సినిమా ఇండస్ట్రీ లో ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టింది. అప్పటివరకు ఒక మూస ధోరణిలో సాగిపోతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీని చూసి కొందరు మహా నటులు మనకంటూ మంచి చిత్రాలు ఏవి అని చూస్తే, వేళ్ళ మీద లెక్క పెట్టాల్సి వచ్చింది. శంకరా భరణం వచ్చాక ఇది నా తెలుగు సినిమా అని గొప్పగా చెప్పడం స్టార్ట్ చేసారు. అప్పటివరకు తెలుగు ఇండస్ట్రీ ని చాలా చిన్న చూపు చూసిన తమిళ ఇండస్ట్రీ వాళ్ళు శంకరాభరణానికి ముగ్దులై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సినిమాలో ఒక వెస్ట్రన్ మ్యూజిక్ గురించి, భారతీయ సంగీతం గురించి ఒక సీన్ ఉంటుంది, ఆ ఒక్క సీన్ చూస్తే చాలు శంకరా భరణం లో ఎంత విషయం ఉందొ చెప్పడానికి.

2. స్వయం కృషి : (1987)

swayam krushi

సాంబయ్య అనే చెప్పులు కొట్టుకునే వ్యక్తి తన స్వయంకృషితో సమాజంలో ఎంత ఎత్తుకు ఎదిగాడు.. ఆ క్రమంలో సోమరి గా ప్రవర్తించే తన కొడుకుని ఎలా మార్చుకున్నాడో ఈ కథ ద్వారా తెలుస్తుంది. సమాజంలో ప్రతి తండ్రి తన కొడుక్కి ఇవ్వాల్సింది ఆస్తి పాస్తులు కాదు, అంతకంటే గొప్ప విలువైన విజ్ఞానం, విజ్ఞత, విధేయత, సంస్కారాలేనని ఈ స్వయంకృషిని చూసి నేర్చుకోవచ్చు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి చెప్పులు కొట్టుకునే సాంబయ్య గా నటించడం ఆయన కెరీర్ కే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. చిరు సినీ జీవితంలో ఎన్ని చిత్రాలు చేసినా దీన్ని మించే పాత్ర మాత్రం ఆయన చేయలేదనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే న భూతో నభష్యతి.

3. సాగర సంగమం : (1983)

Sagara Sangamam

క్లాసికల్ డాన్స్ అంటే ఎంతో పిచ్చి ఉన్న బాలు తన జీవితంలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల డాన్స్ ని వదిలేస్తే, తిరిగి నాట్యమే అతడ్ని కోరుకుని తన జీవితంలోకి వచ్చి ఎలా తన సంగీత సాగరంలో కలుపుకుపోయిందో చెప్పే చిత్రమే సాగర సంగమం. ఈ చిత్రంలో కమల్ హాసన్ నటన అద్భుతం అని చెప్పాలి.

4. శుభలేఖ : (1982)

Shubhlekha

సంఘం లో అమ్మాయిలని చులకన భావంతో చూసే కొందరు వ్యక్తులని ప్రశ్నిస్తూ, సంఘం లో వరకట్నానికి వ్యతిరేకంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో కెరీర్ లో అప్పుడప్పుడే స్టార్ గా ఎదుగుతున్న చిరంజీవికి ‘శుభలేఖ’ మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా ద్వారా పరిచయమైన సుధాకర్ ఈ చిత్రం పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారు. సుమలత , చిరంజీవి ఇందులో అద్భుతంగా నటించారు. ఈ చిత్రంలో ఓ వాణిజ్య ప్రకటనకు చిరంజీవి భారతదేశంలో ఉన్న అన్ని సంప్రదాయాలకు నాట్యం చేయడం హైలెట్.

5. సప్తపది : (1981)

sapta padi

ఈ సినిమా కూడా విశ్వనాథుడి దర్శకత్వంలో నృత్యం ప్రధానాంశం గా తెరకెక్కిన చిత్రం. అయితే ఈ సినిమాలో భారతీయ వర్ణ వ్యవస్థ గురించి ఇందులో చూపించిన విధానం, దాని వల్ల సమాజం లో భారతీయులు ఏం కోల్పోతున్నారో అద్భుతంగా చూపించడం జరిగింది. ముఖ్యంగా ఈ చిత్రంలో క్లైమాక్స్ అత్యద్భుతం అని చెప్పాలి.

6. స్వర్ణ కమలం : (1988)

swarna kamalam

చిత్రకారుడైన ఒక యువకుడు తన పక్కింట్లో ఉండే బ్రాహ్మణ విద్వాంసుని కుమార్తెను, ఆమె కళను చూసి మురిసిపోతాడు. అయితే భారతీయ సంస్కృతి, కళలపై చిన్న చూపు ఉన్న ఆ అమ్మాయికి కనువిప్పు కలిగించి, నాట్యకళలో ప్రోత్సహించి ఉన్నత శిఖరాలకు ఎలా చేర్చాడన్నదే ఈ సినిమా కథ. ఇందులో వెంకటేష్, భానుప్రియ అద్భుతంగా ఎంతో నటించి మెప్పించారు. ఈ చిత్రం తర్వాత సినిమా ఇండస్ట్రీ లో డాన్స్ బాగా చేసే ఏ అమ్మాయి వచ్చినా భానుప్రియ తో పోల్చి చూస్తారు. వెంకటేష్ కెరీర్లోనే టాప్ 10 చిత్రాల్లో స్వర్ణ కమలం ఖచ్చితంగా ఉంటుంది.

7. సిరి వెన్నెల : (1986)

Siri Vennela

విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సంగీత ప్రాధాన్యతా చిత్రం ఈ ‘సిరివెన్నెల’. సర్వదమన్ బెనర్జీ, సుహాసిని జంటగా నటించిన ఈ సినిమాలో కథ ఓ అంధ వేణు వాయిద్యకారుడు, మూగ చిత్రకారురాలి చుట్టూ తిరుగుతుంది. కె. వి. మహదేవన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలన్నీ సీతారామ శాస్త్రి రాశారు. ఆ తర్వాత ఈ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మారింది.

8. ఆపద్భాంధవుడు (1992)

Apadbandhavudu

మెగాస్టార్ చిరంజీవి మాధవ గా నటించిన ఈ చిత్రం ఎంతో గొప్ప ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో ఆయన నటనకి కన్నీళ్లు పెట్టుకొని ప్రేక్షకుడు ఉండడు. అన్నీ కోల్పోయిన తనని ఆదుకున్న వ్యక్తి కుటుంబాన్ని, వెన్నంటి ఉండి ఆపద్భాంధవుడిలా తనని పెంచి పెద్ద చేసిన వ్యక్తి కుటుంబాన్ని ఎలా ఆదుకున్నాడనేదే ఈ చిత్రం. అయితే ఈ చిత్రం అప్పట్లో చిరంజీవి నటించిన మాస్ సినిమాల మధ్య రావడంతో భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రం అంతగా థియేటర్లలో ఆడలేదు. కానీ టెలివిజన్ లో ఈ చిత్రం ఎప్పుడేసినా ప్రేక్షకాదరణ పొందుతూనే ఉంది.

9. స్వాతి ముత్యం : (1986)

Swati Mutyam

పెద్దలని ఎదిరించి పెళ్ళి చేసుకున్న ఒక సాంప్రదాయ సామాన్య కుటుంబానికి చెందిన యువతి, చిన్నపుడే భర్త చనిపోతే ఆమె ఎదురుకున్న పరిస్థితులు ఎలాంటివో ఇందులో చూపించారు. అలాంటి సమయంలో అనుకోకుండా ఆమె జీవితము లోకి వచ్చిన ఒక అమాయకపు యువకుడితో ఎలాంటి ప్రయాణం ఎలా సాగిందన్నదే కథ.  తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఆస్కార్ కి ఎంపికైన మొట్ట మొదటి సినిమా ఇది.

10. సిరి సిరి మువ్వ (1976)

Siri Siri Muvva

అప్పటివరకు కమర్షియల్ ఫార్మాట్ లో, సందేశాత్మక కుటుంబ కథా చిత్రాలు తీస్తున్న విశ్వనాధ్ కి సంగీతంపై, కళలపై సినిమాలు తీయడానికి ప్రేరేపించిన చిత్రమిది. చంద్రమోహన్, జయప్రద జంటగా నటించిన ఈ సినిమా లో నాట్యం అంటే ప్రాణం లా భావించే మూగమ్మాయిగా జయప్రదను చూపించిన విధానం, ఆమెని అమితంగా ఆరాధించే వ్యక్తి గా చంద్ర మోహన్ నటన అశేష ప్రేక్షకాదరణ పొందేలా చేసింది. ఈ చిత్రానికి కెవి. మహదేవన్ అందించిన స్వరాలు ఇప్పటికి ఒక ఆణిముత్యమే. సిరి సిరి మువ్వ తర్వాతే విశ్వనాధ్ స్వర్ణ కమలం, సాగర సంగమం, స్వాతి కిరణం లాంటి కళా ఖండాలు తీయడం జరిగింది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు