2024 Lok Sabha Elections : ఓటర్ల జాబితాలో తమిళ నటుడి పేరు మిస్… ఆయనేం చేశారంటే?

2024 Lok Sabha Elections : ఏప్రిల్ 19న తమిళనాడు వ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ప్రజా ప్రతినిధులు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలతో పాటు సామాన్య జనం కూడా నిన్న సాయంత్రం వరకు ఓటేశారు. కానీ ప్రముఖ తమిళ నటుడు సూరికి మాత్రం ఎన్నికల్లో ఓ షాకింగ్ ఘటన ఎదురైంది. ఓటర్ల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో షాకైన ఆయన ఓటు హక్కును వినియోగించుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.

ఓటు వేయలేకపోయాను అంటూ వీడియో…

కోలీవుడ్ నటుడు సూరి ఓటు వేయడానికి వెళ్లినా ప్రజాస్వామ్య కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోతున్నారని బాధ పడుతూ ఒక వీడియోను విడుదల చేశారు. నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ కోసం సూరి తన భార్యతో కలిసి వలసరవక్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వెళ్లారు. కానీ ఎన్నికల అధికారులు ఓటరు జాబితాను పరిశీలించగా, అందులో నటుడు సూరి పేరు కనిపించలేదు. దీంతో ఆయన భార్యను మాత్రమే ఓటు వేయడానికి అనుమతించారు. పోలింగ్ బూత్ నుంచి నిరాశగా బయటకు వచ్చిన సూరి తన సోషల్ మీడియా అకౌంట్లో అసలు విషయాన్ని వెల్లడించారు.

100 శాతం ఓటు వేయాలనే ప్రజాస్వామ్య కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు ఓటు వేయడానికి వచ్చానని, అయితే ఓటరు జాబితా నుంచి తన పేరును తొలగించారని ఆ వీడియోలో సూరి అన్నారు. ఎవరిని నిందించాలో నాకు తెలియదు, నేను ఓటు వేయలేకపోయాను అనే విషయం నన్ను నిరుత్సాహ పరుస్తుందని, కానీ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూరి కోరారు. ఒక్క సూరి మాత్రమే కాదు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో తమ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారంటూ జనం ఫిర్యాదు చేశారు.

- Advertisement -

సూరి విషయానికొస్తే…

తమిళ సినిమాల్లో కామెడీ రోల్స్ తో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించే సూరి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 2009లో విడుదలైన ‘వెన్నిల కబడ్డీ కుజు’, ‘విడుతలై 1’, ‘అన్నాత్తే’ వంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న సూరి నెక్స్ట్ విడుతలై 2′, ‘కొట్టుకాళి’ సినిమాల్లో భాగం కానున్నాడు.

ఓటు హక్కును వినియోగించుకున్న స్టార్స్..

2024 లోక్ సభ ఎన్నికల మొదటి దశలో తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ తన ఓటు హక్కును ఉపయోగించుకున్న కోలీవుడ్ సెలెబ్రిటీలలో ఒకరు. ఆయన తన టీంతో కలిసి చెన్నైలోని తిరువాన్మియూర్‌లోని ఉన్న పోలింగ్ బూత్‌కు ఉదయాన్నే వచ్చి ఓటు వేశారు. హీరో, మక్కల్ నీది మైయం (ఎంఎన్‌ఎం) నాయకుడు కమల్ హాసన్ కోయంబేడులోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోయెస్ గార్డెన్‌లోని స్టెల్లా మారిస్ కాలేజీలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఓటు వేశారు. ధనుష్ టీటీకే రోడ్డులోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పాఠశాలలో ఉదయం 8 గంటల ప్రాంతంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే శివకార్తికేయన్, గౌతమ్ కార్తీక్, దర్శకులు సుందర్ సి, ఇళయరాజా, శరత్ కుమార్, రాధిక శరత్ కుమార్, విజయ్ సేతుపతి, దర్శకుడు వెట్రిమారన్, దలపతి విజయ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు