కేజీఎఫ్ -2 సునామీ ఆగడం లేదు. భాషాలతో సంబంధం లేకుండా.. రికార్డులను సృష్టిస్తోంది. కేజీఎఫ్-2 ధాటికి థియేటర్స్ లో ఇతర సినిమాలు నిలవలేకపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ సౌత్ సినిమా సత్తా చాటుతుంది. ఎవరూ ఊహించని విధంగా బాలీవుడ్ లోనూ రాకింగ్ స్టార్ యష్ దుమ్ములేపుతున్నాడు. నార్త్ లో కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్ల వరకు బాక్సాఫీస్ కలెక్షన్లు వచ్చాయంటే.. హిందీ ప్రేక్షకులపై కేజీఎఫ్ -2 ఎంత ప్రభావం చూపిందో తెలుస్తుంది. బాలీవుడ్ నిర్మాతలు, హీరోలు ఈ ఏప్రిల్ లో సినిమాలను రిలీజ్ చేయడానికి వెనకడుగువేస్తున్నారు. కానీ షాహిద్ కపూర్.. జెర్సీ సినిమాతో ఏప్రిల్ 22న ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు.
టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని చేసిన జెర్సీ కి రీమేక్ గా షాహిద్ కపూర్ ఈ సినిమా చేస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని అల్లు ఎంటర్‌టైన్‌మెంట్, దిల్ రాజ్ ప్రొడక్షన్స్, సితార ఎంటర్‌టైన్ మెంట్స్ తో పాటు బ్రాట్ ఫిల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే కేజీఎఫ్ -2 అంతటి భారీ సినిమా ఉన్నా.. రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే బుకింగ్స్ ను కూడా ప్రారంభించింది. అయితే బుకింగ్స్ లో జెర్సీ కి కేజీఎఫ్ షాక్ తగిలినట్టు తెలుస్తుంది.
జెర్సీ కన్నా.. ఎక్కువ బుకింగ్స్ కేజీఎఫ్-2 కే వస్తున్నాయట. కేజీఎఫ్-2 రిలీజ్ అయి ఐదు రోజులు గడుస్తున్నా.. థియేటర్స్ లో జోష్ తగ్గలేదు. దీంతో జెర్సీ అడ్వాన్స్ బుకింగ్స్ కంటే.. కేజీఎఫ్-2 బుకింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. విడుదలకు ముందే.. సౌత్ సినిమా దెబ్బ పడితే.. రిలీజ్ తర్వాత పరిస్థితి ఏంటని ఆలోచనలో పడ్డట్టు సమాచారం. అయితే తెలుగులో ప్రమోషన్స్ వేగంగా చేసే అల్లు అరవింద్, దిల్ రాజ్.. బాలీవుడ్ లో వెనకపడ్డారా..? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సౌత్ సినిమాల హవా నడుస్తున్న సమయంలో జెర్సీని రిలీజ్ చేయడానికి కారణం ఏమై ఉంటుందని సినీ అభిమానులు అంటున్నారు.