Vyooham Movie Review and Rating: ‘వ్యూహం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. అందరి దృష్టి ఇప్పుడు ఏపీ ఎన్నికల పైనే ఉంది. అందుకే ఈ టైంని మిస్ చేసుకోకూడదు,క్యాష్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో చాలా పొలిటికల్ సినిమాలు వస్తున్నాయి. వాస్తవానికి రాజకీయ నేపథ్యంలో రూపొందే సినిమాలు.. వాస్తవానికి దగ్గరగా ఉండాలి. సెటైర్లు ఉన్నా.. ఆలోచింపజేసేలా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి. కానీ ఈ మధ్య వచ్చిన ‘యాత్ర 2 ‘ ‘రాజధాని ఫైల్స్’ అలా లేవు అన్నది వాస్తవం. ఇక ఇప్పుడు ‘వ్యూహం’ వచ్చింది. రాంగోపాల్ వర్మ జగన్ కి, అతని పార్టీకి మైలేజ్ చేకూర్చే ఉద్దేశంతో మాత్రమే కాకుండా ప్రత్యర్థి పార్టీల పై సెటైర్లు వేస్తూ కూడా ఈ సినిమాని రూపొందించినట్టు టీజర్, ట్రైలర్స్ స్పష్టం చేశాయి. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం రండి :

కథ :

మదన్మోహన్ రెడ్డి(అజ్మల్ అమీర్) తండ్రి వీఎస్ వీరశేఖరరెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణిస్తారు. తండ్రి మరణవార్త అతన్ని కలచివేస్తుంది. ఆ వార్త తట్టుకోలేక రాష్ట్రంలో చాలా కొంతమంది ఆత్మహత్య చేసుకుని, మరికొంతమంది గుండెపోటుతో మరణిస్తారు. ఆ కుటుంబాలను కలిసి ఓదార్చాలనే ఉద్దేశంతో అతను ఓదార్పు యాత్ర చేపడతాడు. ఇది అతని భారత్ పార్టీ హైకమాండుకు నచ్చదు. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత ఇంద్రబాబు(ధనుంజయ్ ప్రభునే) భారత్ పార్టీ హైకమాండ్ తో కలిసి మదన్ పై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపిస్తారు. ఆ తర్వాత మదన్మోహన్ రెడ్డి ఎలా బయటకి వచ్చి ఎలా తన పార్టీని బలోపేతం చేసుకున్నాడు. శ్రవణ్ కళ్యాణ్ వల్ల కూడా అతనికి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి.. వాటన్నిటినీ తట్టుకుని అతను ఎలా సీఎం అయ్యాడు అనేది ‘వ్యూహం’ కథ.

- Advertisement -

విశ్లేషణ :

సరిగ్గా గమనిస్తే ‘యాత్ర 2 ‘ కథ కూడా ఇదే. ఆ సినిమా రాకపోయినా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుండి చోటు చేసుకున్న పరిస్థితులు అందరికీ తెలుసు. ‘యాత్ర 2 ‘ విషయంలో దర్శకుడు మహి వి రాఘవ్ .. రాజశేఖర్ రెడ్డికి, జగన్ కి భజన చేస్తూ మాత్రమే సినిమా చేశాడు. నిజంగా జగన్ గురించి తెలీని వాళ్ళు ఆ సినిమా కనుక చూస్తే, ‘నిజంగా జగన్ ఇంత మంచోడా’ అనుకునేలా ఉంటుంది ఆ సినిమా. అవన్నీ పక్కన పెట్టేస్తే ‘యాత్ర 2 ‘ లో దర్శకుడు మహి వి రాఘవ్ ఎవ్వరినీ టార్గెట్ చేసి విమర్శించింది లేదు. కానీ వ్యూహం విషయానికి వచ్చేసరికి విషయం వేరు. వర్మ జగన్ కి భజన చేస్తూనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్..ల పై సెటైర్లు వేశాడు. ఇవి ఆర్గానిక్ గా ఉంటే న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. కానీ వాస్తవానికి ఇవి చాలా దూరంగా అంటే కృత్రిమంగా ఉండటం వల్ల.. కేవలం వైసిపి పార్టీ శ్రేణులకు మీమ్స్ స్టఫ్..లా మిగిలిపోతుంది. అంతేకాదు పనిలో పనిగా జగన్ పై కూడా పరోక్షంగా సెటైర్లు విసిరాడు వర్మ. అక్కడక్కడా పవన్ కళ్యాణ్ ను అమాయకుడిగా చూపించి తన అభిమానాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశాడు. ఇవన్నీ ఎలా ఉన్నా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో వర్మ నూటికి నూరు శాతం ఫెయిల్ అయ్యాడు అనేది వాస్తవం. ఇక సినిమా క్వాలిటీ ఏమైనా గొప్పగా ఉందా అంటే అలాంటిదేమీ లేదు. యూట్యూబ్ లో వచ్చే స్పూఫ్ వీడియోలను తలపిస్తూ.. చాలా నాసిరకంగా ఉంటాయి సినిమాటోగ్రఫీ, నేపధ్య సంగీతం వంటివి.

నటీనటుల విషయానికి వస్తే..

అజ్మల్ అమీర్ ను జగన్ పాత్రలో ఆల్రెడీ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అనే సినిమాలో చూశాం. లుక్స్ పరంగా ఇతను జగన్ లా సెట్ అయ్యాడు, కానీ డైలాగ్ డెలివరీ విషయంలో చూసుకుంటే ఇతను చాలా ఇబ్బంది పడ్డాడు అని తెలుస్తుంది. ధనుంజయ్ ప్రభునే… కేవలం చంద్రబాబు నాయుడు పాత్రకి తప్ప నటుడిగా పనికిరాడు అనే డౌట్స్ తెప్పించాడు. మిగిలిన నటీనటులు జస్ట్ ఓకే. పెద్దగా గుర్తుండిపోయేలా వాళ్ళు నటించింది లేదు.

ప్లస్ పాయింట్స్ :

రన్ టైం 2 గంటల 2 నిమిషాలు మాత్రమే ఉండటం

మైనస్ పాయింట్స్ :

మిగిలినవన్నీ

మొత్తంగా..

‘వ్యూహం’ చూడటం అనేది ఏదైతే ఉందో అది జనాలకి ‘శాపం’ అనడంలో సందేహం లేదు. దర్శకుడు రాంగోపాల్ వర్మ వైసీపీ బ్యాచ్ కి ‘మీమ్ స్టఫ్’ ఇచ్చాడు తప్ప ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడంలో కొంచెం కూడా మనసు పెట్టలేదు.

రేటింగ్ :0/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు