SVR: వెండితెర ఘటోత్కచుడు.. విశ్వనటచక్రవర్తి “ఎస్వీఆర్” జయంతి నేడు

ఎస్వీ రంగారావు. ఈ పేరు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు లో నటనకి నాంది పలికిన పేరు. ఒక చిత్రాన్ని చూస్తున్నపుడు ఆ చిత్రంలో ఆ పాత్రధారి కాకుండా  స్వయంగా ఆ పాత్రే మనముందుకు వచ్చింది అనుకునే మహానటుల్లో ముందు మనం చెప్పుకునేది ఎస్వీ రంగారావు గురించే. తెలుగు వెండితెరకు దొరికిన ఒక వజ్రం ఆయన. తెలుగు చిత్ర పరిశ్రమకి రెండు కళ్ళు అని చెప్పుకునేది ఎన్టీఆర్, ఏఎన్నార్ ని అయితే, కనిపించని ఆ మూడే నేత్రమే “ఎస్వీఆర్”. నేడు(జూన్ 3) ఎస్వీ రంగారావు జయంతి. ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ ఈ తరానికి తెలియని కొన్ని విషయాలను గుర్తు చేసుకుందాం.

ఎస్వీఆర్ ఆయన పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. కృష్ణా జిల్లా, నూజివీడు కి చెందిన ఆయన అగ్నిమాపక సిబ్బంది అధికారిగా పనిచేసేవారు. సినిమాల మీద ఇష్టం తో ఉద్యోగానికి రాజీనామా చేసి బి.వి. రామానందం అనే దర్శకుడి ప్రమేయంతో సినిమాల్లో హీరోగా తోలివేషం వేసాడు. అలా 1946 లో “వరూధిని” అనే చిత్రం లో కథానాయకుడిగా నటించాడు. అయితే ఆ చిత్రం అంతగా ఆడకపోవడంతో అన్ని రకాల పాత్రలు చేయడం ప్రారంభించాడు. అలాంటి సమయంలోనే వచ్చిందే “షావుకారు” చిత్రంలో రంగా అనే పాత్ర. ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లు అందుకున్న ఆయన పాతాళ భైరవి చిత్రం తో సూపర్ స్టార్ డమ్ అందుకున్నారు.

ఆ చిత్రంలో వేసిన నేపాళ మాంత్రికుడి పాత్ర ఓ రేంజ్ లో పాపులర్ అయింది. అక్కడి నుండి రంగారావుకు పాత్రలన్నీ వెతుక్కుంటూ ఆయన దగ్గరికే వచ్చేవి.

- Advertisement -

ఎస్వీఆర్ నటనకి ముగ్దుడైన చైనా ప్రధాని…

ఆ కాలంలో ఎన్టీఆర్, ఎంజీఆర్ లని మించిన నటుడెవరంటే అందరూ చెప్పేది ఎస్వీఆర్ నే. అవును ఒక సినిమా హీరో పాత్రకి ఎన్టీఆర్ ని, కుదరకపోతే ఏఎన్ఆర్ ని, లేకపోతే శోభన్ బాబును, పరభాషా నటుల్ని తీసుకునేవారు. కానీ ఒక్క ఎస్వీఆర్ విషయంలో ఆయన పాత్రని, నటనని భర్తీ చేసేవాళ్ళు లేరు. ఒకానొక సందర్భంలో రంగారావు యుముడి పాత్ర పోషించిన సతీ సావిత్రి సినిమా మద్రాసులో జెమినీ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుండగా మద్రాసు పర్యటనకు వచ్చిన చైనా ప్రధాని “చౌ ఎన్ లై” ఆయన నటనను అభినందించారు.

ఈ పాత్రలు ఆయన కోసమే పుట్టాయి..

సినిమాల్లో కొన్ని పాత్రలు కొందరు నటులు చేయకపోతే ఆ చిత్రాలు విజయవంతమయ్యేవి కావు. రావణుడైనా, దుర్యోధనుడైనా, ఘటోత్కచుడైనా, కీచకుడైనా, హిరణ్యకశిపుడైనా ఈ పాత్రల్లో వేరే నటుల్ని ఊహించుకోలేము. ఒకసారి మెగాస్టార్ చిరంజీవి  ఎస్వీఆర్ గురించి ప్రస్తావిస్తూ, రంగారావు గారు తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం. ఆయన దురదృష్టం అన్నారు. ఎందుకంటే అయన వేరే దేశంలో పుట్టుంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నటుడయ్యేవారు అన్నారు.

ఒక పాత్ర కోసం ఎంతో శ్రమించే ఎస్వీఆర్ ఆ పాత్ర కోసం ఎంతో క్రమశిక్షణ గా ఉండేవారు. ఆయన రావణుడిగా నటించిన సంపూర్ణ రామాయణం చిత్రంకోసం ఆయన ఎప్పుడూ విడవని మద్యం అలవాటుని ఆరు నెలల పాటు ముట్టకుండా ఉన్నారు. “విశ్వనట చక్రవర్తి”, నటసింహ లాంటి బిరుదులు ఎస్వీఆర్ కు ఉన్నా.. ఆయన అసమాన నటనా ప్రతిభకి అవి కూడా తక్కువే అని చెప్పాలి.

ఇక ఎస్వీఆర్ నటించిన చివరి చిత్రం “యశోదా కృష్ణ”. ఈ చిత్రం తర్వాత ఆయన బైపాస్ సర్జరీ కోసం అమెరికాకు వెళ్లాలని అనుకున్నారు. కానీ దానికి ముందే 18 జులై 1974 న ఆయన కన్నుమూశారు.  ఎస్వీఆర్ మరణించి 50 యేళ్ళవుతున్నా ఆయన పాత్రలతో మాత్రం వెండితెరపై ఎప్పటికి పలకరిస్తూనే ఉంటారు.

2013 లో భారతీయ శతవార్షికోత్సవాల సందర్భంగా అప్పట్లో ఎస్వీఆర్ పేరుతో కొన్ని నాణాలను కూడా రిలీజ్ చేసారు. అయితే దేశం గర్వించే ఇంతటి గొప్ప నటుడికి ఇప్పటివరకు ఏ ప్రభుత్వ గుర్తింపు దక్కకపోవడం బాధాకరం. ఇప్పటికైనా తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు అది గమనించి ఎస్వీఆర్ కి “భారతరత్న” వచ్చేలా చేయాలనీ పలువురు సినీప్రముఖులు రాజకీయనాయకుల్ని సంప్రదిస్తూనే ఉన్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు