Nuvve Nuvve: సిరివెన్నెలకు నివాళి

త్రివిక్రమ్ దర్శకుడిగా పరిచయమైన “నువ్వే నువ్వే” చిత్రం 20 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్బంగా ఆ సినిమా విశేషాలను పంచుకున్నారు దర్శకుడు త్రివిక్రమ్.

వనమాలి హౌస్‌లో ‘నువ్వే కావాలి’ షూటింగ్ జరుగుతుంది. రవికిశోర్ గారు, నేను పక్కన ఖాళీ స్థలంలో నడుస్తూ మాటల మధ్యలో కథ చెప్పా. ఆయన చెక్ బుక్ తీసి ఒక అమౌంట్ వేసి ఇచ్చారు. ‘నువ్వే కావాలి’కి రైటర్‌గా ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో… దాదాపుగా అంత అమౌంట్ అడ్వాన్స్‌గా ఇచ్చారు. నేను దాంతో బైక్ కొనుక్కున్నాను. అప్పటికి నేను రాసిన ‘నువ్వే కావాలి’ షూటింగ్‌లో ఉంది. నేను ఏం చేయగలనో తెలియదు. కానీ, నేను చెప్పిన కథ విని రవికిశోర్ గారు ఎంతో నమ్మారు. ఆయనకు నేను ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా సరిపోదు.

మద్రాసులో ‘నీరం’ చూసి అందులో సన్నివేశాలను నా ఇష్టం వచ్చినట్లు ఎలా మార్చేయాలో చెబుతుంటే విన్న రవికిశోర్ గారు… ‘స్వయం వరం’ రాసిన తర్వాత నన్ను ఎవరూ పిలవకపోతే నేను భీమవరం వెళ్లి క్రికెట్ ఆడుకుంటుంటే మా ఇంటి పక్కన ఎస్‌టీడీ బూత్ నంబర్ కనుక్కుని నాకు ఫోన్ చేసిన రవికిశోర్ గారు… ‘నువ్వు నాకు నచ్చావ్’ కథను మీరు అనుకున్న హీరోకి కాకుండా పెద్ద హీరోకి చెబుతానని వాదిస్తే ‘నీ ఇష్టం వచ్చినట్టు చావు’ అని ప్రోత్సహించిన రవికిశోర్ గారు… రాత్రిపూట స్క్రిప్ట్ చదివి నేను రాసిన డైలాగ్ నచ్చితే ఫోన్ చేసి ఏడ్చిన రవికిశోర్ గారు… నేను పంజాగుట్టలో ఉన్నప్పుడు మా రూమ్ దగ్గరకు వచ్చి కింద నుంచి హారన్ కొట్టి పిలిచే రవికిశోర్ గారు… ఆయనకు నేను ఎలా కృతజ్ఞతలు చెప్పాలి? రసికుడు కానివాడికి కవిత్వం నివేదించే దరిద్రం నా నుదుటి మీద రాయొద్దని కాళిదాసు చెప్పాడు. నేను రాసిన మాటలు వినే రసికుడిని నాకు ప్రదర్శించినందుకు దేవుడికి నేను ఎన్నిసార్లు కృతఙ్ఞతలు చెప్పాలి!

- Advertisement -

‘నువ్వే నువ్వే’ కోసం ఢిల్లీకి వెళ్లి శ్రియ‌తో పాటు వాళ్ళ అమ్మకు కథ చెప్పడం నుంచి శ్రీనగర్ కాలనీలో రవికిశోర్ గారి ఆఫీసులో అందరికీ స్క్రిప్ట్ రీడింగ్ ఇవ్వడం నుంచి ప్రకాశ్ రాజ్ గారి ఇంటికి వెళ్లడం, ఊటీలో షూటింగ్ చేయడం… ప్రతిదీ ఇప్పటికీ గుర్తు. ‘నువ్వే నువ్వే’ షూటింగ్‌లో ఫైట్ మాస్టర్ లేకపోతే తరుణ్ చేత ఒక కిక్ కొట్టించే సీన్ చేశా. అప్పుడు నాలో వయలెన్స్ ఉందని అర్థమైంది. ‘అతడు’ తీసిన తర్వాత వెంకటేష్ గారు ‘నువ్వు చూస్తే సాఫ్ట్ గా ఉంటావ్. సినిమా వైలెంట్ గా తీశావ్’ అన్నారు. ఆ వయలెన్స్ ‘నువ్వే నువ్వే’లో కిక్ తో స్టార్ట్ అయ్యింది.
నాలో ఉన్న రచయితను గానీ… దర్శకుడిని గానీ… నాకంటే ఎక్కువగా గుర్తించిన, ఇష్టపడ్డ వ్యక్తి రవికిశోర్ గారు. ఆయన్ను నేను చాలా ప్రేమిస్తా. గౌరవిస్తా. రవికిశోర్ గారు అనడమే వచ్చు. నాకు ఆయన అన్నలాగా!

ఆయనకు, సీతారామశాస్త్రి గారి మధ్య ఉన్న లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ ఇంకెవరి మధ్య చూడలేదు. అందుకు నేను సాక్షిని. ‘గాలిపటం గగనానిదా? ఎగరేసే నేలదా?’ అని రాసిన శాస్త్రి గారి గురించి నేను ఏం చెప్పగలను! ఆయన మాటల్లో చెప్పాలంటే… ‘ఆయన ఉఛ్వాసం కమలం. ఆయన నిశ్వాసం గానం. ఆయన జ్ఞాపకం మన అందరికీ ఎప్పటికీ అమరం’. అటువంటి సీతారామశాస్త్రి గారి దివ్య స్మృతికి ఆయన పాదాల దగ్గర ఈ సినిమాను రవికిశోర్ గారు, నేను, మా చిత్ర బృందం నివాళిగా అర్పిస్తున్నాం” అని అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు