Netflix : నెట్ ఫ్లిక్స్ పై సీబీఐ కేసు… పాపులర్ మర్డర్ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ ఆపాలంటూ నోటీసులు 

నెట్ ఫ్లిక్స్ లో వచ్చే డాక్యుమెంటరీలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న పలు సెన్సేషనల్ క్రైమ్ స్టోరీలను డాక్యుమెంటరీల రూపంలో నెట్ ఫ్లిక్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా “ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ : ది బరీడ్ ట్రూత్” అనే డాక్యుమెంటరీని స్ట్రీమింగ్ చేయడానికి సిద్ధమై, దాని కారణంగా నెట్ ఫ్లిక్స్ కష్టాల్లో పడింది. ఏకంగా సీబీఐ ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ ను ఆపాలంటూ కోర్టుకెక్కింది.

షీనా బోరా హత్య కేసు అప్పట్లో ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2015లో వేరే కారణంతో డ్రైవర్ శ్యాంవర్ రాయ్ అరెస్ట్ అయ్యాడు. ఆ విచారణ సమయంలోనే షీనా బోరా హత్య గురించి బయట పెట్టాడు అతను. డ్రైవర్ స్టేట్మెంట్ ను ఆధారంగా చేసుకుని అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కేసు ఎన్నో కీలక మలుపులు తిరిగి, సస్పెన్స్ సినిమాను తలపించింది. ఎట్టకేలకు 2012 ఏప్రిల్ లో షీనా బోరాను ఇంద్రాణి ముఖర్జీ కారులోనే డ్రైవర్, మాజీ భర్త సాయంతో గొంతు నులిమి చంపేసిందని పోలీసుల విచారణలో తేలింది. అనంతరం షీనానే ఇంద్రాణి సొంత కూతురు అనే షాకింగ్ విషయం బయటపడింది. అప్పుడు అరెస్ట్ అయిన ఇంద్రాణి, సంజీవ్ ఖన్నా, పీటర్ ముఖర్జీ 2022 మేలో బెయిల్ ద్వారా జైలు నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం వీరంతా బెయిల్ పై బయటే ఉన్నారు. కానీ ఈ కేసు ఇంకా క్లోజ్ కాలేదు.

ఇక షీనా బోరా మర్డర్ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న ఇంద్రాణి ముఖర్జీపై డాక్యుమెంటరీ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ రూపొందించింది. ఫిబ్రవరి 23న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే “ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ : ది బరీడ్ ట్రూత్” ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది. మరోవైపు ఈ సమయంలోనే నెట్ ఫ్లిక్స్ కు ఈ సిరీస్ విషయంలో లీగల్ కష్టాలు వచ్చి పడ్డాయి. 2012లో షీనా బోరా మర్డర్ జరగగా, 2015లో అది బయటపడింది. ఇప్పటికీ ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఈ క్రైమ్ కేసు గురించి డాక్యుమెంటరీ తీసి ప్రేక్షకులకు చూపించడం కరెక్ట్ కాదని సిబిఐ వాదిస్తోంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్ ఇండియాతో పాటు ఈ డాక్యుమెంటరీ సిరీస్ లో భాగమైన అందరూ స్పందించాలంటూ సిబిఐ స్పెషల్ జడ్జ్ ఎస్పి నాయక్ ఆదేశించారు. ముంబై కోర్టులో ఫిబ్రవరి 20న ఈ కేసుపై జరగబోతోంది. మరి సీబీఐ రిక్వెస్ట్ మేరకు “ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ : ది బరీడ్ ట్రూత్” డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ ఆగుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు