k. viswanath : ఆఖరి ఫోటో కథ

కొన్ని ఫోటోలు కథలు చెప్తాయి. ఇక్కడ మీరు చూస్తున్న కె.విశ్వనాథ్‌ గారి పార్ధీవదేహం ఫోటో గురించి ఒక్కొక్కరు ఒక్కోరకంగా కొన్ని వందల కథలు రాయొచ్చు. ఒక సారి నిశితంగా ఆ ఫోటోను పరిశీలించండి. ఐస్‌పెట్టెలో తుది శ్వాస విడిచిన పెద్దాయన శివుని విభూది ధరించి హూందాగా పడుకున్నట్లు ఉంది కదూ! తన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అమ్మ జోలపాటలా ఎంత హాయిగా ఉంటాయో అందరికి తెలుసు. ఇంటిపెద్ద వెళ్లిపోతే చుట్టూ ఉన్న అందరూ మౌనంగా ఉండి ఆయనతో తమకున్న అనుబంధాలని నెమరువేసుకుంటారు.

అలా ఆయన్ను గుర్తుచేసుకుంటూ అక్కడున్న ఆయన భౌతికకాయం వద్ద నిల్చుని ఉన్నాను. అంత గొప్పమనిషితో వందలసార్లు కలిసి మాట్లాడటం, వేలకొద్ది ఫోటోలు తీయటంతో పాటు, చిన్న చిన్న ఇంటర్వూలు ఆయనతో చేస్తూ గడిపిన నాకు చివరిసారి ఓ ఫోటోతో బై అని చెప్పాలి అనుకున్నాను. ఆ మహానుభావునితో ఎంతమందికి ఎన్నిరకాల అనుబంధాలు ఉన్నాయో కదా అనిపించింది. తెలియకుండానే చేతిలోని ఫోటో క్లిక్‌ అంది. ఎంత చక్కగా మంచులో ముడుచుకుని పడుకున్నారో కదా.. అని అక్కడున్న వారందరూ అనుకుంటుంటే తెలియకుండానే రెండు చేతులు ఒక్కచోటుకు చేరి నమస్కరించాయి.

ఆయన వ్యక్తిగత సంస్కారాన్ని తన సినిమాలకు కూడా అద్దారు. ఐస్‌పెట్టెలో ఉన్న పెద్దాయన రెండు చేతులు దగ్గర పెట్టుకుని వచ్చిన ప్రతి ఒక్కరిని మౌనంగా గమనిస్తున్నట్లుంది కదూ! మౌనంగా, ధ్యానంగా, దైవంలా, ప్రశాంతంగా ఎంత హాయిగా నిద్రిస్తున్నాడో ఆ మహామనిషి. ఐస్‌ బాక్స్‌లో ఎలా ఉన్నా బాక్స్‌ఫీస్‌లో మాత్రం నా స్టైలే సెపరేటు అన్నట్లు బాక్స్‌ పైనున్న ఫోటోలో మీసం మెలేసి రాజసంగా ప్రపంచాన్ని చూస్తున్న కె.విశ్వనాథ్‌ని ఫోటో గురించి మాట్లాడటానికి రెండు కళ్లు సరిపోవు.

- Advertisement -

పక్కనే ఖాకీ డ్రెస్‌లో కెమెరాలోనుంచి ప్రపంచాన్ని ఆయన ఏ తీరుతో చూస్తాడో అనేలాగా ఓ ఫోటో.. ఫైనల్‌గా ఆయన జీవితంలోని చివరిఘట్టం ఎంత హుందాగా ఉందో ఈ ఒక్కఫోటోలో కళ్లముందు కదలాడుతోంది…సెలవు గురువుగారు.. తడుస్తున్న కళ్లతో మీ ఆత్మీయతను మీ ప్రేమాభిమానాన్ని మీ ఆశీర్వచనాలను నిండుగా పొందిన నేను ధన్యుడిలా ఫీలవుతూ… వెళ్లిరండి కళాతపస్వి.. శివైక్యం..

శివమల్లాల

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు