SPB AI Voice Controversy: చిక్కుల్లో “కీడా కోలా” టీం… లీగల్ నోటీసులతో షాక్ ఇచ్చిన ఎస్పీబి వారసుడు 

గాన గంధర్వుడు, దివంగత సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఏఐ వాయిస్ వివాదం తాజాగా తెరపైకి వచ్చింది. తమ అనుమతి లేకుండా ఆయన వాయిస్ ను రీ క్రియేట్ చేసినందుకు “కీడా కోలా” టీంకు లీగల్ నోటీసులతో షాక్ ఇచ్చారు ఎస్పీ బాలసుబ్రమణ్యం తనయుడు చరణ్. లెజెండరీ సింగర్ ఎస్పీబీ వాయిస్ ని ఉపయోగించుకున్నందుకు తెలుగు మూవీ “కీడాకోలా” నిర్మాతలు, సంగీత దర్శకులపై చట్టపరమైన చర్యలకు ఆయన సిద్ధమయ్యారు.

దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన కామెడీ ఎంటర్టైనర్ “కీడా కోలా”. గత ఏడాది నవంబర్ 3న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కామెడీ అండ్ క్రైమ్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో తరుణ్ భాస్కర్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, చైతన్య రావు, మయూర్ రఘురాం, రవీంద్ర విజయ్ లు కీలక పాత్రలు చేశారు. వివేక్ సాగర్ ఈ మూవీకి సంగీతం అందించారు. అయితే ఈ సినిమాలో ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్ ను ఏఐ ద్వారా రీ క్రియేట్ చేసి వాడుకున్నారు. కానీ దీనికి తమ దగ్గర పర్మిషన్ తీసుకోకపోవడం నిరాశకు గురి చేసింది అంటూ తాజాగా ఎస్పీ బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ లీగల్ యాక్షన్ కు రెడీ అయ్యారు. ఈ మేరకు ఆయన 2024 జనవరి 18న “కీడా కోలా” మూవీ మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కు లీగల్ నోటీసులు పంపినట్టు సమాచారం. అందులో మేకర్స్ క్షమాపణలు చెప్పడంతో పాటు నష్టపరిహారం, రాయల్టిలో వాటా కోరుతూ తాను ఈ లీగల్ నోటీసులు పంపినట్టు చరణ్ వెల్లడించారు.

ఈ విషయం గురించి చరణ్ మాట్లాడుతూ ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్ ను సజీవంగా ఉంచడానికి చేసిన ప్రయత్నం మంచిదేనని అన్నారు. కానీ టెక్నాలజీ ద్వారా ఆయన వాయిస్ ను రీ క్రియేట్ చేయడం అంటే ఇప్పటికే అంగీకరించిన వాస్తవాన్ని తోసిపుచ్చడం లాంటిదని చెప్పుకొచ్చారు. సాంకేతికత అనేది మానవాళికి సేవ చేయాలి కానీ జీవనోపాధికి హాని కలిగించకూడదని, ఇలాంటి టెక్నాలజీ వల్ల ఎంతోమంది గాయకులకు తాము నమ్ముకున్న ఉపాధి దక్కకుండా పోతుందని చరణ్ చెప్పుకొచ్చారు.

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో వాణిజ్య ప్రయోజనాల కోసం ఏఐ సాంకేతికతను ఉపయోగించుకునే ధోరణి అనుమతి లేకుండా కొనసాగితే అది ప్రస్తుతం లేదా భవిష్యత్ గాయకులపై ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. అయితే తాము మీడియా ద్వారా ఈ విషయాన్ని పెద్దది చేయాలనుకోవడం లేదని, న్యాయపరంగానే ముందుకు వెళ్లాలని అనుకుంటున్నామని చరణ్ వెల్లడించారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు