Koratala Shiva : కొరటాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు… ఇంకా వదలని “శ్రీమంతుడు” వివాదం

Koratala Shiva : స్టార్ డైరెక్టర్ కొరటాల శివను గతంలో “శ్రీమంతుడు” సినిమా విషయంలో చేసిన తప్పు ఇంకా వదలడం లేదు. బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సినిమానే ఆయనను వివాదాల్లోకి నెట్టేసింది. “శ్రీమంతుడు” మూవీ కాపీరైట్ సమస్య ఈయనను కోర్టుకీడ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా కొరటాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. న్యాయస్థానం క్రిమినల్ కేసు ఎదుర్కొక తప్పదంటూ తీర్పునిచ్చి ఈ డైరెక్టర్ నెత్తి మీద బాంబు చేసింది.

ఇంతకీ వివాదం ఏమిటంటే…
2017 ఆగస్టు 7న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీ “శ్రీమంతుడు”. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మహేష్ బాబు కెరీర్ లో మరిచిపోలేని చిత్రంగా మిగిలింది. కానీ డైరెక్టర్ కు మాత్రం మరపురాని పీడకలగా మిగిలిపోయింది. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద 140 కోట్లు కొల్లగొట్టిన శ్రీమంతుడు మూవీని తన నవల ఆధారంగా తెరకెక్కించారు అని రచయిత శరత్ చంద్ర సంచలన ఆరోపణలు చేశారు. ఆయన అక్కడితో ఆగకుండా ఈ విషయమై కోర్టు మెట్లు ఎక్కారు.

“శ్రీమంతుడు” మూవీని పాపులర్ మాసపత్రిక స్వాతిలో 2012లో ప్రచురితమైన “చచ్చేంత ప్రేమ” అనే తన నవల ఆధారంగా రూపొందించారని, కానీ దానికి తన అనుమతి తీసుకోలేదని శరత్ చంద్ర కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో ఈ కేసుని 1729/2017 కింద నమోదు చేశారు. అందులో భాగంగా నిర్మాతలతో పాటు హీరో మహేష్ బాబు, డైరెక్టర్ కొరటాల శివపై ఆయన కేసు వేశారు. ఈ కాపీరైట్స్ వివాదం కారణంగా పలుసార్లు కొరటాల శివతో పాటు మహేష్ బాబుకి కూడా నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. గత ఏడాది నవంబర్ 22న నాంపల్లి హైకోర్టు “శ్రీమంతుడు” మూవీ కాపీరైట్స్ కేసులో డైరెక్టర్ కొరటాల శివ క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందేనని తీర్పునిచ్చింది.

- Advertisement -

అయితే కొరటాల నాంపల్లి కోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. కానీ అక్కడ కూడా కొరటాల శివకు చుక్కెదురైంది. తాజాగా ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్‌ కేసు ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసింది. ఇన్నేళ్లుగా సాగుతూ వస్తున్న “శ్రీమంతుడు” వివాదం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. మరి క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా కొరటాలపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా ప్రస్తుతం కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో “దేవర” అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు